Suryaa.co.in

Andhra Pradesh

ఆకలి అనే పదం వినబడకూడదనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లు పెట్టారు

– పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు నాడు ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం ఇచ్చారు
– జగన్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు
– అన్నా క్యాంటీన్లు నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన జగన్ సర్కార్
– కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భువనమ్మ వ్యాఖ్య

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2018లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా గుడిపల్లి గ్రామంలో అన్నా క్యాంటీన్ ను భువనమ్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా భువనమ్మ మాట్లాడుతూ….కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పేదవాడికి మూడుపూటలా అతి తక్కువ ఖర్చుతో కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 364 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులో ఈ క్యాంటీన్లలో 2.25లక్షల మంది భోజనం చేసేవారు. ఒక్క సంవత్సరంలో అన్నా క్యాంటీన్లలో 7.50కోట్ల మంది తమ ఆకలిని తీర్చుకున్నారు.

అన్నా క్యాంటీన్ల వంటి గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూల్చేశారు…నిలిపేశారు. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తే వారిపై నిర్బంధాలు, దాడులకు వైసీపీ సర్కార్ దిగింది. జగన్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడా వెనకడుగు వేయకుండా రాష్ట్రంలో నేడు 150 క్యాంటీన్లను నడుపుతున్నారు…వారందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు.

మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ 4 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. వీటితో కలిపి కుప్పం కుటుంబ సభ్యులకు మొత్తం 4 అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి.

మీ అభిమానాన్ని, విశ్వాసాన్ని ఎప్పటికీ మరువలేం….
కుప్పం కుటుంబ సభ్యులు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం, అభిమానాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు. కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చంద్రబాబుతోనే కుప్పం ప్రజలు నిలుస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, కుప్పం ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబే సరైన వ్యక్తి అని చెబుతున్న కుప్పం ప్రజల నమ్మకానికి నా ధన్యవాదాలు.

చంద్రబాబు జైల్లో ఉన్న 53రోజులు కుప్పం కుటుంబ సభ్యులు పడిన బాధ, ఆవేదన వర్ణించలేనిది. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబుకోసం నిరాహారదీక్షలు, మౌనదీక్షలను వెనక్కి తగ్గకుండా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మా కుటుంబం కుప్పం ప్రజల ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు.

LEAVE A RESPONSE