షర్మిల సవాలుకు జగన్ జవాబేదీ?

– పాదయాత్రను భారతి నుంచి హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి
-జైలు సూపరెంటెడెంట్ సాక్షి అని వెల్లడించిన కొండా

– తనకు రాఘవరెడ్డి బావ కాదన్న డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి ఆ సమయంలో తాను అక్కడ లేనన్న వెంకటేశ్వరరెడ్డి
– జగన్ భార్యగా భారతమ్మ పాదయాత్ర చేయాలనుకున్నారట
– దానిని షర్మిల హైజాక్ చేశారన్న కొండా రాఘవరెడ్డి
– జగన్ చెబితేనే పాదయాత్ర చేశానన్న షర్మిల
– భారతమ్మ చేస్తే తానెందుకు వద్దంటానని షర్మిల ప్రశ్న
– బిడ్డపై ప్రమాణం చేసి జగన్ ను ఇరికించిన షర్మిల

– ధైర్యం ఉంటే మీరూ ప్రమాణం చేయాలని జగన్ విధేయులకు సవాల్
– సజ్జల, సుబ్బారెడ్డి, సోషల్ మీడియా దాడితో షర్మిల మనస్తాపం
– పాదయాత్రపై తల్లి విజయలక్ష్మి సాక్షి అని వెల్లడించిన షర్మిల
– తల్లితో ఆ మాట చెప్పించాలని సవాల్ విసిరిన షర్మిల
– ఇప్పటిదాకా పెదవి విప్పని వైసీపీ నాయకత్వం
– చెల్లిని తిడుతుంటే జగనన్న ఖండించకపోవడంపై ఎంపి రాజు ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తన పాదయాత్రకు సంబంధించి.. అన్న జగన్పై చెల్లి షర్మిల విసిరిన సవాలుకు, వైసీపీ విధేయుల నుంచి ఇప్పటిదాకా జవాబు లేదు. జగన్ జైలులో ఉన్నప్పుడు జరిగిన పాదయాత్రను.. వైసీపీ విధేయ నేతలు, ఇప్పుడు వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమయింది. షర్మిల స్థాపించిన వైఎస్సార్టీపీలో కీలకపాత్ర పోషించిన కొండా రాఘవరెడ్డి, పాదయాత్ర క్రెడిట్ను షర్మిలకు కాకుండా… భారతి చేయాల్సిన పాదయాత్రను షర్మిల హైజాక్ చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిల విరుచుకుపడ్డారు.

“ఆరోజు జగన్ సహా కుటుంబం ఒత్తిడి చేస్తేనే నేను పాదయాత్ర చేశా. దీనికి విజయమ్మ సాక్షి. కాదని విజయమ్మతో చెప్పించండి. నేను నా బిడ్డలపై ప్రమాణం చేస్తా. మీకు ప్రమాణం చేసే ధైర్యం ఉందా? భారతమ్మ చేస్తానంటే నేను వద్దన్నానట. ఈ రాఘవరెడ్డి అక్కడ ఉండి చూసినట్లు చెబుతున్నాడు. పోనీ ఇది నిజమని ఆ సూపరెంటెండెంట్ను చెప్పమనండి. ఒక మహిళపై ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నారు” అంటూ సవాలు విసిరి, వైసీపీలోని జగన్ విధేయ బృందాన్ని నైతిక సంకంటంలోకి నెట్టడం ఆసక్తికరంగా మారింది.

పైగా ఒక మహిళపై షర్మిల సవాల్ చేసి నాలుగురోజులవుతున్నా.. ఇప్పటివరకూ ఆమె సవాలుపై జగన్ విధేయ బృందమైన సజ్జల, సజ్జల, విజయసాయిరెడ్డి, చివరకు ఆ విషయాన్ని ప్రస్తావించిన కొండా రాఘవరెడ్డిలో ఒక్కరు కూడా స్పందించలేదు. దీన్ని బట్టి.. కొండా రాఘవనరెడ్డి, నాటి పాదయాత్రపై చేసిన ఆరోపణలో పస లేదని రుజువయిట్టయింది. పైగా ఈ ఫ్యామిలీ వార్ ఎలాంటి సంబంధం లేని కొండా రాఘవరెడ్డి అనే పాత్రను తెరపైకి తీసుకువచ్చి, ఆమె ద్వారా షర్మిలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారన్న విషయం వైఎస్ అభిమానులకు సులభంగా అర్ధమవుతుంది. ఫలితంగా కొత్త పాత్ర వల్ల వైసీపీకి ఎలాంటి లాభం చేకూరలేదని స్పష్టమవుతుంది.

పోనీ నాటి చంచల్గూడ జైలు డిప్యూటీ సూపరెంటెండ్ వెంకటేశ్వరరెడ్డి కూడా, రాఘవరెడ్డి ఆరోపణలపై స్పందించారా అంటే అదీ లేదు. నిజానికి ఆ సమయంలో కేశవనాయుడు సూపరెంటెండ్ ఉన్నారు. ఆయన పైన ఉంటే, కింద ఫ్లోర్లో వెంకటేశ్వరరెడ్డి, జైలర్లు ఉండేవారు. జగన్ తన ములాఖత్కు వచ్చిన వారితో వెంకటేశ్వరరెడ్డి గదిలోనే కూర్చుని మాట్లాడేవారు. ఆయన గదిలో టీవీ కూడా ఉండేది.

రాఘవరెడ్డి చెప్పినట్లు పాదయాత్ర భారతితో ప్రారంభించాలన్న చర్చ, డిప్యూటీ జైలు సూపరెంటెండ్ గదిలోనే జరిగి ఉండాలి. అప్పుడు అక్కడ జగన్తోపాటు.. విజయమ్మ, భారతి, షర్మిల మాత్రమే ఉండాలి. పాదయాత్రకు సంబంధించిన అంశంపై చర్చ వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో జరిగి తీరాలి. మరి ఆ లెక్కన షర్మిల చెప్పిన ప్రకారం ఆ సమయంలో రాఘవరెడ్డి లేరు. నిజానికి వారి కుటుంబంతో రాఘవరెడ్డికి.. కుటుంబ అంతర్గత సంభాషణల్లో భాగస్వామి అయేంత స్థాయి ఉన్న వ్యక్తి కాదని, అటు షర్మిల సన్నిహితులు కూడా చెబుతున్నారు.

ఈ విషయం రచ్చగా మారిన నేపథ్యంలో.. తెలంగాణలో ఉన్న మాజీ డిప్యూటీ సూపరెంటెండెంట్ వెంకటేశ్వరరెడ్డికి, అసలు రాఘవరెడ్డి వ్యాఖ్యలు తెలియకపోవడం ప్రస్తావనార్హం. అసలు రాఘవరెడ్డి తనకు బావ కాదని, వెంకటేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘ఆయన నాకు బావ కాదు, బావమరిది కాదు. ఎక్కడో దూరపు బంధువు. జైలు విషయాలను మేం సొంత కుటుంబసభ్యులతో కూడా చర్చించం. అలాంటిది బయట వారితో ఎందుకు మాట్లాడతాం? జైలులో ఉన్నప్పుడు ములాఖత్ కోసం అనేక మంది వస్తుంటారు. వారు ఏం మాట్లాడుకున్నారో వినాల్సిన అవసరం మాకు ఉండదు. పైగా కుటుంబసభ్యుల మాట్లాడుకుంటే అవన్నీ మేమెందుకు వింటాం. మా డ్యూటీ మాకు ఉంటుంది కదా? కొండా రాఘవరెడ్డి మాకు ఎక్కడో దూరపు బంధువు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో మీరు చెప్పేవరకూ నాకు తెలియదు. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టకండి” అని వెంకటేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కొండా రాఘవరెడ్డి, షర్మిల పాదయాత్రకు సంబంధించి షర్మిలపై చేసిన ఆరోపణ అబద్ధమని స్పష్టమయింది.

నిజానికి జగన్, గాలి జనార్దన్రెడ్డి, సత్యం రామలింగరాజు, విజయసాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బీపీ ఆచార్య, సునీల్, నూకారపు సూర్యప్రకాష్ రావు వంటి ఖైదీలు – విచారణ ఖైదీలు చంచల్గూడ జైలులో ఉన్నారు. ఆ సమయంలో సూపరెంటెండెంట్గా కేశవనాయుడు, డిప్యూటీ సూపరెంటెండెంటగా వెంకటేశ్వరరెడ్డి ఉండేవారు. తర్వాత కేశవనాయుడు స్థానంలో సైదులు వచ్చారు. వీరి హయాంలో పెద్దగా ఆరోపణలు ఏమీ ఉండేవి కాదు. మానవతా దృక్పథంతో వ్యవహరించేవారన్న పేరుంది.

పేరుకు చాలామంది సూపరెంటెండెంట్లు ఉన్నా, పర్యవేక్షణ భారం వెంకటేశ్వరరెడ్డిపైనే పడేది. సహజంగా చాలా జైళ్లలో అధికారులు, ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు వినిపిస్తాయి. కానీ చంచల్గూడ జైలులో నాటి అధికారులు, ఖైదీల పట్ల మర్యాదగా వ్యవహరించేవారు.

ప్రధానంగా కుటుంబసభ్యులు ములాఖత్కు వచ్చినప్పుడు, వారికి స్వేచ్ఛ ఇచ్చేందుకు తాము బయటకు వచ్చేవారు. ఈ నేపథ్యంలో కొండా రాఘవరెడ్డి, షర్మిల పాదయాత్రపై చేసిన ఆరోపణలన్నీ ఉత్తిదేనన్న విషయం.. తన బంధువునని చెబుతున్న నాటి జైలు అధికారి వెంకటేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

కాగా సొంత చెల్లి షర్మిలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జగన్ ఖండించకపోవడం, వైఎస్ సన్నిహితుడిగా తనను బాధిస్తోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. “సొంత చెల్లిపై ఎవరైనా మాటల దాడి చేస్తుంటే ఏ అన్నయినా ఏ తమ్ముడయినా ఊరుకుంటారా? పైగా జగన్ సింహం అని చెబుతుంటారు. పులివెందుల పులి అంటారు. చెల్లిని తిడుతున్న వారిని ఏమీ అనని అన్నయ్యలు పులులు, సింహాలు ఎలా అవుతారు”అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

Leave a Reply