Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఒక అపరిచితుడు…తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్

-రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన….అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంథకారం
-ప్రాజెక్ట్ లో నాడు జగన్ చేసిన పాపాలే పోలవరానికి నేడు శాపం
-నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తం
-పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు
-ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో నష్టం పోని వర్గం అంటూ ఏదీ లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఇందుకు సాక్ష్యం అని ఆయన చెప్పారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందని ఆయన అన్నారు.

తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని, ప్రజల జీవితాలను రివర్స్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక అపరిచితునిలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వైసీపీ పాలన అరిష్టంలా దాపురించిందని…. పన్నులు, చార్జీల పెంపుతో ప్రజల
babu2 కష్టాలకు ప్రభుత్వ నిర్ణయాలు కారణం అవుతున్నాయని అన్నారు. జగన్ ఎంత బలహీనుడో అతని క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థం అవుతోందని చంద్రబాబు అన్నారు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడిందని…బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.

ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కూడా కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా రూ.100 కోట్లు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అందజేశారు.

పోలవరం విషయంలో మొదటి నుంచి జగన్ తీసుకున్న తప్పుడు, రివర్స్ నిర్ణయాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయని చంద్రబాబు అన్నారు.
రివర్స్ టెండర్ల నిర్ణయం, పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా 2020 లో పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. రివర్స్ టెండర్లలో ప్రజాధనం ఆదా అని గొప్పలు చెప్పిన జగన్… ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్ల జరిగిన నష్టానికే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు అని చంద్రబాబు అన్నారు.

స్ట్రాటజీ కమిటీలో చర్చించిన అంశాలు:-
నెల్లూరు కోర్టులో దొంగలు పడిన అంశంలో ముమ్మాటికీ మంత్రి కాకాని ప్రమేయం ఉందని పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. దొంగతనం విషయంలో పోలీసు ఉన్నతధికారులు ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని, నిజాలను దాస్తున్నట్లు ఉందని స్ట్రాటజీ కమిటీలో నేతలు అభిప్రాయపడ్డారు. కోర్టులో దొంగలు పడిన వ్యవహారంపై పోరాటం చెయ్యాలని నిర్ణయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరును నేతలు తప్పు పట్టారు. జగన్ ను ఆరాధించాలి అని సమాచార శాఖా మంత్రి వేణగోపాలకృష్ణ చెప్పడాన్ని తప్పు పట్టారు. కళ్యాణదుర్గంలో మంత్రి తన ఆర్భాటంతో పసిబిడ్డ ప్రాణం తియ్యడమే కాకుండా…నిరసన తెలిపిన తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని నేతలు ఖండించారు.

ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న సాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమే అని నేతలు విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నిత్యం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టాను అని చెప్పిన జగన్…. ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నేతలు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకలో బాలికపై వాలంటీర్ అత్యాచారం చేసిన ఘటనను నేతలు ఖండిచారు.

బాదుడే బాదుకు కార్యక్రమం సందర్భంగా పల్లెల్లో చేస్తున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని నేతలు వివరించారు. పన్నుల భారం, చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల వంటి విషయాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలు ఉంటాయని చంద్రబాబు నేతలకు వివరించారు. త్వరలోనే వీటిని ప్రారంభిచనున్నట్లు వివరించారు.

ఇకపోతే వచ్చే మహానాడు ఎక్కడ నిర్వహించాలి అనే అంశంలో నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరోలో కూడా చర్చించిన తరవాత మహానాడు నిర్వహణ ఎక్కడ అనేది ప్రకటించనున్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE