Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు

-జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి
-ఆడపిల్లలను చదివించాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్
-ప్రతి ఇంటికి మహిళే ఆర్థిక మంత్రి
-కూటమి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
-ఆడపిల్లలను చదవించి..నైపుణ్యం పెంచితే ప్రపంచాన్ని శాసిస్తారు
-జగన్ పాలనలో నిత్యవసర వస్తువల ధరలన్నీ పెరిగాయి
-జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి.
-ఆడబిడ్దల మధ్య నా జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది
-గూడూరు మహిళల ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు

గూడూరు :- ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఆడబిడ్డను చదవించాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశానికి ఆర్థిక మంత్రిగా మహిళే ఉన్నారని…ప్రతి ఇంటికీ మహిళ ఆర్థిక మంత్రే అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడురులో శనివారం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….‘‘నా జీవితంలో చాలా సార్లు ఆడబిడ్డలతో మాట్లాడాను కానీ ఈ రోజు ఆడబిడ్డల జోరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా పుట్టిన రోజు మీ మధ్యలో జరుపుకోవడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. పుట్టినరోజు వేడుకలు జరుపుకోడానికి నేను పెద్దగా ఇష్టపడను. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేనేమీ కోరుకోలేదు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నా.

తిరుపతి ఎంపీగా వరప్రసాద్, గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ ను గెలిపించాలి
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి వరప్రసాద్, గూడూరులో టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ని గెలిపించాలని కోరుతున్నా. పుట్టిన రోజు నాడు నా ఆడబిడ్డలు, ఆడపడుచులతో కొంత సమయం గడపాలని వచ్చాను. నేను మీ కోసం ఏం చేయబోతున్నానో మీకు తెలియజేయాలని వచ్చా. 14 ఏళ్లు సీఎంగా చేశాను. కష్టాలు, సుఖాలన్నీ తెలిసిన వ్యక్తిని. సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా నా ధ్యేయం పేదలను పైకి తీసుకురావడమే. నేను బతికేది పేదల కోసం…తెలుగుజాతి కోసం.

ఆడబిడ్డలను చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు
చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న సిలికాన్ ను ఎలా దోచుకోవాలో ఆలోచిస్తున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుకను కొట్టేసి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తురు. నా ఆలోచన మాత్రం ఇక్కడ పరిశ్రమలు రావాలి…యువతకు భవిష్యత్తు ఉండాలి. స్వర్ణముఖి నదిలో ఎక్కడికక్కడ చెక్ డ్యామ్‌లు కట్టి, భూగర్భజలాలు పెంచి ఇసుక దోపిడీ జరక్కుండా చేయాలి.

ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో లారీలతో ఇసుకను మాయం చేస్తున్నారు. నా తపనంతా ఆడపిల్లలు, యువత అందరినీ చదివించి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచాలి. ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే విధంగా ఉండాలన్నదే నా కల. భవిష్యత్తులో నా కోరిక ఒకటే. ప్రపంచంలోనే తెలుగు జాతి నెం.1 గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది చూపిస్తా.

నా పుట్టిన రోజున హామీ ఇస్తున్నా
5 సంవత్సరాలు జే‘గన్’ రెడ్డి మోసపు పాలనలో అందరినీ మోసం చేసి తను ఒక్కడే ఉండాలనుకుంటున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీలేదు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, మద్యం షాపులు, భూములు మీద జగన్ రెడ్డి పెత్తనమే. మళ్లీ జగన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మనమందరం బానిసలుగా బతకాల్సిన పరిస్తితి. భవిష్యత్తులో నాకున్న ఒకే ఒక కోరిక అది జీరో పోవర్టీ ఆంధ్రప్రదేశ్ చేయడం. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని నా జన్మదిన సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. దేశంలో ఒకప్పుడు సంపద ఉండేది కాదు పేదరికమే ఎక్కువ ఉండేది. కానీ, ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం. పేదవాళ్లను పైకి తెచ్చి జన్మభూమి స్ఫూర్తిని ఇచ్చాను.

ఆడపిల్లలను చదివించాలని పిలుపునిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్
మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఒకప్పుడు ఆడబిడ్డలు ఇంట్లోనుంచి బయటకు వచ్చేవారు కాదు. ఆ సమయంలోనే చదివించాలి, ఆడబిడ్డలకు చదువు ముఖ్యం అని మొదటి సారిగా ఎన్టీఆర్ నిర్ణయించారు. పద్మావతి మహిళా యూనివర్సటీని స్థాపించారు. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదు…చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నా ఆకాంక్ష.

2029లోగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆడబిడ్డలు కూడా మగవారితో సమానంగా ఉండాలని సంకల్పించింది ఎన్టీఆర్. దేశంలోనే మొట్టమొదటిం సారిగా స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ లుగా 8 శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ కల్పించారు. జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారు. మహిళలు చదువుకోకపోతే సమాజంలో గౌరవం ఉండదు. ఆత్మగౌరవం లేకపోతే మంచిది కాదని నేను డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను.

పొదుపు ఉద్యమం నేర్పించి మీరు రూపాయి పొదుపు చేస్తే పది రూపాయలు వచ్చేలా నేను రుణసదుపాయం కల్పించాను. పసుపు-కుంకుమ ద్వారా రూ.10 వేలు అందించాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. గతంలో కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టి మహిళలు చదువుకునేలా చేశాం. చదువుకోవడం వల్లే మగవాళ్లు ఆడబిడ్డలకు ఎదరుకట్నం ఇచ్చేపరిస్థితి వచ్చింది.

మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాలని….
ఒకప్పుడు ఆడబిడ్డలు కట్టెల పొయ్యిపై వంట చేయడం వల్ల పొగ వెళ్లి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. అది గమనించి ఇబ్బందులు పడకూడదని వంట గ్యాస్ ఇచ్చాం. ఇళ్లల్లో కనీసం మరుగుదొడ్డి కూడా ఉండేది కాదు. దానివల్ల ఇబ్బందులు పడేవారు. అది చూసి నేను చాలా బాదపడ్డా. నా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని ‘ఆత్మ గౌరవం’ కింద అందరికీ మరుగు దొడ్లు కట్టించా.

కాలేజీల్లో కాస్మొటిక్ అందించి తోడుగా ఉన్నా. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికీ ఆర్థిక మంత్రి నా ఆడబిడ్డలే. ఒకప్పుడు మగవాళ్లు డబ్బులు సంపాదించి ఆడవాళ్ల చేతికిస్తే వాటిని అన్నింటికీ సరిపోయేలా ఒక బడ్జెట్ తయారు చేసేవారు. వచ్చే ఎన్నికల్లో ఆడబిడ్డలందరూ తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలి. ఆడబిడ్డలకు పుట్టినిళ్లు తెలుగుదేశం.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం
2029లో ఒక దేశం…ఒకే ఎన్నిక విధానం అమలవుతుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. అప్పుడు ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు అమలవుతాయి. అది అమలు చేసేది ఎన్డీయేనే. ‘మహాశక్తి’ కార్యక్రమం ద్వారా తిరుగులేని శక్తి వంతులుగా చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 లు ఇస్తాం.

ఇంట్లో చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ‘తల్లికి వందనం’ పేరిట సంవత్సరానికి రూ.15,000 లు ఇచ్చే బాధ్యత టీడీపీది. ‘దీపం’ పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తాను. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం. రూ.10 ఇచ్చి రూ.100 రూపాయిలు జగన్ దోచేస్తున్నారు ఆడబిడ్డల కోసం ఆసరా, పెన్షన్ అని మహిళలను మోసం చేశాడు. పెన్షన్ రూ.200 నుంచి రూ.2000కు పెంచాం.

జగన్ నొక్కిందెంతో…బొక్కిందెంతో చెప్పాలి
జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు చార్జీలు, గ్యాస్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. మద్యం ధరలు, ఆర్టీసీ ఛార్జీలు పెట్రోలు, డీజిల్ అన్నింటిపైనా రేట్లు పెంచి ప్రజల్ని దోచుకున్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కి దోచుకున్నదెంతో, బొక్కేసిందెంతో సమాధానం చెప్పాలి. సిలికాన్ పోయింది, స్వర్ణముఖి నదిలో ఇసుకంతా పోయింది. అనకొండల్లాగా తయారయ్యి కొండలను తవ్వేసి మాయం చేశారు.

అందరికీ టీడ్కో ఇళ్లు పూర్తి చేసి చేతికిచ్చే బాధ్యత టీడీపీది. టీడీపీ ప్రభుత్వంలో పేదవారి కోసం ఇళ్లు, వెడల్పయిన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, కరెంటు, కమ్యూనిటీ భవనాలు కట్టించాం. జగన్ రెడ్డి ఇచ్చిన సెంటు పట్టా ఇళ్లను కొనసాగిస్తాం. మన ప్రభుత్వం రాగానే రెండు సెంట్లలో ఇంటి నిర్మాణం చేస్తాం.

జాబ్ నోటిఫికేషన్ పేరుతో జగన్ మోసం
టీడీపీ హయాంలో యువత కోసం 11 డిఎస్సీలు నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా యువతను మోసం చేశారు. సీఎం అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెడతాను. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 వేలు అందిస్తాం. రైతులకు ప్రత్యేక కార్పొరేషణ్ ఏర్పాటు చేస్తా. ‘అన్నదాత’ పథకం ద్వారా ప్రతి రైతుకు యేడాదికి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి, వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొచ్చి రైతే రాజుగా ముందుకు తీసుకెళ్తా.

ప్రతి ఇంటికి 1వ తేదీనే రూ.4 వేల పెన్షన్
ప్రతి నెలా 1వ తారీఖున ఇంటి వద్దకే తీసుకెళ్లి వృద్దులకు రూ.4000 లు పెన్షన్ ఇస్తాం. పెంచిన పెన్సన్ ను ఏప్రిల్, మే, జూన్ నెలలవి కూడా కలిపి జూలైలో ఇస్తాం. దివ్యాంగులకు రూ.6000 లు, వాలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత టీడీపీది. రాష్ట్రంలో ఎటు చూసినా నాశిరక మద్యం, గంజాయితో నిండిపోయింది. ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. మన బిడ్డలు వాటికి అలవాటు పడితే మన చేతికి దొరకరు.

దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి.డశాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఆడబిడ్డలు బయటకు రావాలంటే భయపడేలా చేశారు. ‘దిశా’ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించాలనని జగన్ చెప్తున్నాడు అసలు ఈ చట్టమే లేదు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా’’ అని చంద్రబాబు విజ్ణప్తి చేశారు.

LEAVE A RESPONSE