Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగాన్ని జగన్‌రెడ్డి అజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. రాంకీ, హెటిరో సహా బినామీ కంపెనీల్లో వేల కోట్ల బ్లాక్‌మనీ ఉందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలోని సాగునీటి రంగంపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకుండా పోయింది. నదీ జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన హక్కులు కోల్పోతూ.. మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం, నదుల అనుసంధానం లాంటి ప్రాజెక్టుల్ని కూడా కమిషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారు. గోదావరిపై పట్టిసీమ నిర్మించి సముద్రం పాలవుతున్న జలాలను కృష్ణాకు మళ్లించి సద్వినియోగం చేసుకుంటున్నాం. కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల రూ. 1000 కోట్లతో మరో ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు జగన్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారు. రెండున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు నీరుగార్చి, విద్యుత్ కేంద్రం పనులు అటకెక్కించి.. ఎత్తిపోతలు అంటూ ప్రజల్ని మోసం చేస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడమైనది. జగన్ రెడ్డి పాలనలో నిలిచిపోయిన, నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అప్పులపాలైతే.. జగన్ రెడ్డి, అతని బంధువులు, బినామీల ఆస్తులు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. జగన్ కేసుల్లో సహ నిందితులుగా ఉన్న రాంకీ, హెటిరో సంస్థల్లో గుట్టల కొద్దీ బ్లాక్ మనీ లభించింది. కరోనా సమయంలో రెమిడెసివర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ దాచుకున్న వేల కోట్ల బ్లాక్ మనీ హెటిరోలో బయటపడింది. జగన్ రెడ్డి జేట్యాక్స్, అవినీతి, భూ మాఫియాలో దోచుకున్న సొమ్మును హెటిరోలో దాచుకున్నారు. ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టి కోట్లు దోచుకుంటున్నారు.
విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లపై నల్గొండ పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేస్తే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు.? పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి ఏపీలో స్మగ్లర్లను అరెస్టు చేయడం ఏపీ పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు కాదా.? ఏపీ పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఏపీలో అసలు గంజాయి సాగు లేదని చెబుతున్న పోలీస్ బాస్ ఇప్పుడేం సమాధానం చెబుతారు.? విశాఖ, తూర్పు గోదావరి జిలాల్లో 25 వేల ఎకరాల్లో రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సాగు జరుగుతోంది. చిత్తూరు, అనంతపురంలో ఓపియం సాగు అవుతోంది. డ్రగ్స్, కల్తీ లిక్కర్ వలన జాతి నిర్వీర్యం అవుతోంది. అయినా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ, గంజాయి ఫ్రీగా తయారు చేస్తే నేడు గంజాయికి, డ్రగ్స్ కు నిలయం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ అయిన యువతను నాశనం చేస్తున్నారు. పాడేరు ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి, ఐస్ క్రీం, చాక్లెట్ల రూపంలో గంజాయి తరలించే మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. లారీలు, బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు.
జగన్ రెడ్డి గత రెండున్నరేళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సాధిస్తే.. ఇప్పుడు విద్యుత్ లేక అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. లోటు విద్యుత్ నుండి.. టీడీపీ మిగులు విద్యుత్ సాధిస్తే.. ప్రస్తుతం తిరిగి విద్యుత్ లేక చీకటి రోజులు ఎదుర్కొంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. (2020 ఫిబ్రవరిలో యూనిట్ పై 90పైసలు పెంచి రూ.1300 కోట్లు, ఏప్రిల్-మే నెలల్లో స్లాబులు మార్చి రూ.1500 కోట్లు, 2021లో కొత్త టారిఫ్ ద్వారా 20శాతం పెంచి రూ.2600 కోట్లు, జులై నుండి కాస్ట్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో రూ.700 కోట్లు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.6211 కోట్లు (రూ.2542 కోట్లు+రూ.3669 కోట్లు) పవర్ ఫైనాన్స్ కార్పేషన్ ద్వారా రూ.24,491 కోట్లు మొత్తంగా రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం వేశారు.యూనిట్ కు రూ. 20 చొప్పున విద్యుత్ కొనుగోలు చేయడం, పీపీఏల సమీక్ష పేరుతో కమీషన్లు దండుకోవడం వంటి చర్యలతో విద్యుత్ రంగాన్ని రివర్స్ లో నడుపుతున్నారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్ధిక సంఘం ద్వారా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి.. పల్లెలను సమస్యలకు నిలయంగా మార్చారు. నిధుల లేమితో పరిశుభ్రత లోపించి డెంగ్యూ, మలేరియా సహా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ భూముల్ని ఆక్రమించుకుని మైనింగ్ చేస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతూ గ్రావెల్ సహా ఇతర ఖనిజాలు తవ్వుతున్నారు. విశాఖపట్నం గ్రామీణ జిల్లా పరిధిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రైతుల భూములు ఆక్రమించి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విధంగా మొత్తం 80కి పైగా నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ అంశాలను ఎండగట్టి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించడం జరిగింది.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు ప్రజలను రక్షించడం మాని భక్షించే వ్యవస్థగా మారింది. నిందితులపై కేసులు నమోదు చేయకపోగా.. బాధితులపై కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రైవేటు కేసులు వేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించారు. ఈనెలలో 20 మంది పోలీసు అధికారులు ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని బాధితుల్ని హింసించారో వారిపై ప్రైవేట్ కేసులు వేయడమైంది.
రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో అన్యమత ప్రచారం చేశారు. తిరుమలలో జగన్నామస్మరణ చేశారు. దేవాలయాలపై వందలాది దాడులు జరిగాయి. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాలి. మత విశ్వాసాలను దెబ్బతీయడాన్ని ఎండగట్టాలి. అలాగే కుల చిచ్చు పెట్టే కుట్రల్ని వైసీపీ చేస్తోంది.
దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ పై పన్నులు బాదుతున్నారు. అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. సామాన్యుడిపై మోయలేని భారం వేస్తూ పస్తులుండే పరిస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించింది. విమానాల్లో వాడే ఫ్యూయల్ కంటే.. సామాన్యుడు వాడే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరు దశల్లో పరిశీలన పేరుతో పెన్షన్, రేషన్ కార్డులు కోత పెడుతున్నారు. పథకాల్లో లబ్దిదారుల సంఖ్య తగ్గించుకోవడం కోసం రేషన్ కార్డులు అడ్డగోలుగా తీసేస్తున్నారు. విద్యుత్ బిల్లుల పేరుతో, అధిక ఆదాయం పేరుతో సంక్షేమ పథకాలు దూరం చేస్తున్నారు. బాధితుల తరఫున తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు నారా లోకేశ్, వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామశేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కాలవ శ్రీనివాసులు, టి.డి.జనార్ధన్, బీసీ జనార్ధన్ రెడ్డి, పర్చూరు అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, బండారు సత్యన్నారాయణమూర్తి, , కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE