– వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఫైర్
తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన 9 నెలలుగా మహిళల భద్రతను గాలి కొదిలేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా స్పందించడం లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివ శంకర్ రెడ్డి ఆక్షేపించారు. జగన్‌కి పేరొస్తుందనే కుట్రతో విజయవంతంగా పని చేసిన దిశ యాప్ను నిర్వీర్యం చేసిన చంద్రబాబు, కొత్తగా సురక్షా యాప్ తీసుకొస్తామని చెప్పడం మహిళలను వంచించడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రయోగాలు ఆపేసి, గతంలో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న దిశ యాప్‌నే కొనసాగించాలని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
వైయస్ జగన్ సీఎంగా ఉండగా మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం డిసెంబర్ 15, 2020న దిశ యాప్ రూపొందించారు. స్మార్ట్ ఫోన్లో ఇన్సా్టల్ చేసుకుని ఎలా ఉపయోగించా? మహిళల భద్రతకు యాప్ ఎలా పని చేస్తోందో వివరిస్తూ పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు.
అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మహిళలు తమను తాము రక్షించుకునేలా రూపొందించిన దిశ యాప్‌లో ఎస్‌ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే, లేదా స్మార్ట్ ఫోన్‌ను మూడుసార్లు ఊపినా సరే, వెంటనే పోలీసులకు సమాచారం అందే వ్యవస్థ ఏర్పాటు చేశారు. దాంతో బాధితులున్న ప్రదేశానికి జీపీఎస్ ద్వారా పోలీసులు నిమిషాల వ్యవధిలోనే చేరుకుని రక్షణ కల్పించే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. అందుకే దిశ యాప్ చాలా ఆదరణ పొందింది. గత ఏడాది ఎన్నికల నాటికి ఏకంగా 1.56 కోట్ల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం.
కేవలం దిశ యాప్ రూపకల్పనతోనే సరిపెట్టకుండా ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. వీటితో పాటు సత్వర న్యాయసహాయం అందించేలా ప్రత్యేకంగా 19 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించడం జరిగింది.
వీటన్నింటికి తోడు, దిశ వ్యవస్థ మరింత సమర్థంగా పని చేసేలా పెట్రోలింగ్ కోసం మహిళా ఉద్యోగులకు 900 ద్విచక్ర వాహనాలు, రక్షణ సిబ్బందికి 163 బొలేరో వాహనాలు, నేర పరిశోధన వేగంగా జరిగేలా ప్రత్యేకంగా 18 క్రై ం మేనేజ్‌మెంట్ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు.
దిశ వ్యవస్థ పక్కాగా పని చేయడంతో, 3 కేసుల్లో మరణ శిక్ష పడింది. 86 కేసుల్లో దోషులను శిక్షించారు. 31,607 మందికి ఎస్‌ఓఎస్ ద్వారా రక్షణ కల్పించడం జరిగింది. నేరాల రేటు 27శాతం తగ్గిపోయింది. దిశ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 19 జాతీయ అవార్డులతో గౌరవించింది.
కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే, జగన్‌పై కోపంతో దిశ యాప్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు టీడీపీ, జనసేన నాయకులకు వంత పాడుతున్నారు. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారిపోయింది. ఈ 9 నెలల చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు, అత్యాచారాలు మామూలైపోయాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో నేరస్తులు పేట్రేగిపోతున్నారు.
సాక్షాత్తు డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతిపై అత్యాచారం జరిగినా స్పందించిన పాపాన పోలేదు. సీఎం బావమరిది బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడళ్ల మీద అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 48 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందంటే, పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో, మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆఖరుకి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని సాక్షాత్తు డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు.
9 నెలల తర్వాత, వందల మంది మహిళలు, విద్యార్థినిలను బలి తీసుకుని సురక్షా యాప్ తీసుకొస్తామని హోం మంత్రి అనిత చెబుతున్నారు. గత ప్రభుత్వంలో విజయవంతంగా పనిచేసిన దిశ యాప్ను నిర్వీర్యం చేసి 9 నెలల తర్వాత సావధానంగా సురక్షా యాప్ను తీసుకొస్తామంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అని పుత్తా శివశంకర్‌రెడ్డి నిలదీశారు.