Suryaa.co.in

Andhra Pradesh

నిజమైన.. అరుదైన ప్రపంచ పర్యావరణ మార్గదర్శి చంద్రబాబు

టబ్ నిండా తీసుకున్నాడు ఎర్రమట్టిని. అలవోకగా ఎత్తి పోస్తూ.. ఈ పర్యావరణ ప్రేమికుడు ప్రజలను భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.గ్లోబల్ వార్మింగ్ నుండి రెన్యువబుల్ ఎనర్జీ వరకు అనర్గళంగా ప్రసంగించే నాయకులలో, నిజమైన అరుదైన ప్రపంచ పర్యావరణ మార్గదర్శి ఈయన.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: చెట్లు పెంచకుండా స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమేనా? అని ఈయన వేసిన ఈ ప్రశ్న మనసుల్ని తాకుతోంది. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, అది మన ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగం కావాలని అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను స్పష్టంగా తెలియజేశారు.

2047 నాటికి సగం రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి!

“ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రంలో 5.58 కోట్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,421 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉందని, ఇది రాష్ట్ర విస్తీర్ణంలో 23 శాతమని చెప్పారు. అటవీయేతర ప్రాంతంలోని పచ్చదనంతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 30.05 శాతం పచ్చదనం ఉందని, దీన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

“పచ్చదనంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలి. గతంలో కొందరు కేవలం ఫోటోల కోసమే చెట్లు నాటే వారు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను సవాల్‌గా మారింది. వర్షాలు తగ్గుతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, సాగు ప్రమాదంలో పడుతోంది, ఫ్లోరైడ్ పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి” అని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నా మనసుకి దగ్గరైన శాఖ: పర్యావరణం!

“గత ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వస్తున్నారంటే కింద రోడ్ల పక్కనున్న చెట్లు నరికేసేవారు. మేము పర్యటనలకు వస్తుంటే ఎక్కడైనా చెట్లు నరుకుతున్నారా అని అడుగుతాను. చెట్లు పెంచడం మన బాధ్యత… నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే జైళ్లలో పెడతారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరక్కూడదు” అని సీఎం గట్టిగా చెప్పారు.

“వనజీవి రామయ్య గారు నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా మొక్క తెచ్చేవారు. ఆయన జీవితమంతా ఊరూరా తిరిగి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఆయన మనందరికీ స్ఫూర్తి. నా చిన్నతనంలో మా గ్రామంలో కేశవ నాయుడు అనే సామాజిక కార్యకర్త కూడా అడవులు నరక్కుండా తీసుకున్న చర్యలు నాలో స్ఫూర్తిని నింపాయి. అలాగే, నా మనసుకి అత్యంత దగ్గరైన పర్యావరణ శాఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించడం నాకు మరింత సంతోషాన్నిస్తోంది” అని ముఖ్యమంత్రి గారు తన హృదయపూర్వక భావాలను పంచుకున్నారు.

సీడ్ రాఖీతో పర్యావరణానికి ఆడబిడ్డల చేయూత!

“ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. అది ప్రకృతిని నాశనం చేస్తోంది. పశువులు ప్లాస్టిక్ తింటే… వాటి పాలు మనం తాగుతున్నాం. కుళ్లిన చికెన్‌ను చేపలకు మేతగా వేస్తున్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.

గుంటూరు, విశాఖపట్నంలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. “పట్టణాల్లో 90 శాతం పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ కంపోస్టు కేంద్రాలు నెలకొల్పాం. రీసైక్లింగ్ కింద ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 17 కార్పొరేషన్లు, వచ్చే ఏడాది జూన్ 5 నాటికి మొత్తం రాష్ట్రాన్ని ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా’ మార్చుతాం. 175 నియోజకవర్గాల్లోనూ నగర వనాలను ఏర్పాటు చేస్తాం. మీ అన్నదమ్ముల నక్షత్రాలకు చెందిన మొక్కల విత్తనాలతో తయారుచేసిన సీడ్ రాఖీలను ఆడబిడ్డలంతా కట్టాలి” అని సీఎం గారు పిలుపునిచ్చారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక సరికొత్త, హృదయపూర్వక ఆవిష్కరణ.

సుందర నగరంగా అమరావతి… మన భవిష్యత్తుకి దిక్సూచి!

“టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టించి నిన్నటికి ఏడాది పూర్తయింది. విధ్వంసం నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాం. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు వెళుతున్నాం. అమరావతి రాజధాని భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారుతుంది. దేవతల రాజధానిలో మనం ఉండటం అదృష్టం. సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. మియావాకీ తరహా గార్డెన్లు సహా అనేక దేశాల గార్డెన్లు అమరావతిలో పెంచుతాం” అని ముఖ్యమంత్రి రాజధానిపై తన ఆశలను వ్యక్తం చేశారు.

“ఒకప్పుడు కరెంటు లేని స్థితి నుంచి… ఇప్పుడు మీ ఇంటి పైనుంచి కరెంటు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్లు ఉచితంగా అమరుస్తాం. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలుపుతాం” అని పునరుద్ఘాటించారు.

అడవుల మనిషి అంకారావుకు అటవీ సలహాదారుగా బాధ్యతలు!

“ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. అక్కడ ఒకేరోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేస్తాం. యోగా మన జీవితంలో భాగం కావాలి.

యుష్ ద్వారా యోగాను ప్రతి ఒక్క ఇంటికి చేర్చేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం” అని యోగా ప్రాముఖ్యతను వివరించారు.
చివరగా, ముఖ్యమంత్రి ఒక శుభవార్త చెప్పారు. “నల్లమల అడవులను పరిరక్షిస్తున్న కొమెర అంకారావును అటవీ, పర్యావరణ శాఖ సలహాదారుగా నియమిస్తున్నాం” అని ప్రకటించారు. ఈ నియామకం పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పర్యావరణ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. రాష్ట్రం పచ్చదనంతో, స్వచ్ఛతతో కళకళలాడేందుకు ప్రజలందరి సహకారం తప్పనిసరి.

LEAVE A RESPONSE