-యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్థంతికి నివాళులు
-కథానాయకునిగా….మహానాయకునిగా వెలిగిన తారక రాముని చరిత్ర నిత్య స్ఫూర్తి దాయకం
-ఎన్టీఆర్ 26 వ వర్థంతికి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళి
అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయాలు సాధించవచ్చు అని నిరూపించిన వారు ఎన్టీఆర్. ఒక చిన్న రైతు కుటుంబలో పుట్టి తెలుగు జాతికే గుర్తింపు తెచ్చిన వ్యక్తి రామారావు గారు. సినిమా రంగంలో మకుటం లేని మహరాజుగా….రాజకీయ రంగంలో తిరుగు లేని నేతగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఆయన సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం.
పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం చేపట్టడం ఒక రికార్డు అయితే…. అధికారం అనేది అనుభవించేది కాదు…ప్రజల తలరాతలు మార్చేది అని చేసి చూపిన ఘనత ఎన్టీఆర్ ది. కొన్ని వర్గాలకే పరిమితం అయిన అధికారాన్ని బడుగు వర్గాలకు చేరువ చేసిన నాయకత్వం ఆయనది. సంక్షేమ పథకాలకు నాంది ఆయనే…..ప్రజలను దేవుళ్లుగా కొలవాలనే పిలుపు ఆయనదే. అందుకే ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా ఎన్టీఆర్ ఎల్లడలా కీర్తింపబడుతున్నారు.
ఈ ఏడాది మార్చి నాటికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి అవుతుంది. 2023 మే 28 న ఎన్టీఆర్ శత జయంతి జరుపుకోబోతున్నాం. ఈ రెండు సందర్భాలు తెలుగు దేశం పార్టీకే కాకుండా….. తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన రోజులుగా ఉండబోతున్నాయి. ఎన్టిఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల అభివృద్దికి పునరంకితమవుదాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం శ్రమించే పార్టీగా ప్రజా సమస్యలపై తెలుగు దేశం తరపున మరింత పోరు జరపుదాం. ప్రస్తుత పాలకుల వైఫల్యాలతో రాష్ట్రం ఆథోగతి పాలవుతున్న వేళ దూకుడుగా తెలుగు దేశం పోరాడాల్సి ఉంది. ఎంతటి పెను సవాళ్లనైనా… సోపానాలుగా మార్చుకునే ఎన్టిఆర్ ప్రస్థానం గుర్తు చేసుకుని…ప్రజల పక్షాన తెలుగు దేశం ప్రయాణం కొనసాగిద్దాం.