క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోనల్ ఇంఛార్జిలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జోన్-1 ఇంఛార్జి బుద్ధా వెంకన్న, జోన్-2 ఇంఛార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్-3 ఇంఛార్జ్ డోలా.బాలవీరాంజనేయస్వామి, జోన్-4 ఇంఛార్జ్ అనగాని సత్యప్రసాద్, జోన్-5 ఇంఛార్జ్ అమర్నాథ్ రెడ్డిలకు పలు ఆదేశాలు ఇచ్చారు. వీరితో పాటు ఈ సమీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రోగ్రామ్స్ కమిటీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..క్లస్టర్ ఇంఛార్జ్ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృట్టిసారించి, వారంరోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్ మరియు యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం నుండి 15వ తేదీ లోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జోనల్ ఇంఛార్జిలు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ధేషిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.