Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నోట ఓటమి మాట ఇన్నిసార్లా!

2024లో మీరోడిపోతే కొంపలేమీ మునగవవు, భయ్యా!
( వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

కర్నూలు జిల్లాలో గురువారం నుంచి మొదలైన తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడి ‘ఓటమి మాటలు’ తన కలల రాజధాని అమరావతి తీరానికి చేరుకున్నాక కూడా ఆగలేదు. టీడీపీ ‘జాతీయ అధ్యక్షుల వారు’ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే…’ అంటూ మళ్లీ ఓటమి పాట ఎత్తుకున్నారు. దాంతో, ‘ఎమ్మిగనూరు హుషారు’తో తమలో ఉత్సాహం రగిలిస్తాడనుకున్న చంద్రబాబు పోకడ చూసిన ఆయన పార్టీ కార్యకర్తలు ‘ఇదెక్కడ ఖర్మరా, బాబూ!’ అంటూ జావగారిపోయారు.

ఈ ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి కొత్త కొత్త రాజకీయ సూత్రాలను కార్యకర్తలకు నూరిపోసే ప్రయత్నం చేశారు. ‘ప్రజల్లో రాజకీయ చైతన్యం నిరంతరం ఉండదు. అది వారిలో కనిపిస్తే–ఏ నాయకుడికైనా ‘కిక్‌’ వస్తుంది. ఇప్పుడు నాకు అది జనంలో కనిపిస్తోంది. మనం అంతటితో తృప్తిపడ కూడదు. ఈ ప్రజాచైతన్యాన్ని ‘తదుపరి స్థాయికి’ తీసుకుపోవాలి,’ అంటూ తన జనానికి పూర్తిగా అర్ధంకాని రీతిలో బాబు గారు దిశా నిర్దేశం చేశారు. తన రోడ్‌ షోలకు వచ్చే ప్రజలందరినీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం ఓటర్లుగా మార్చాలనేది బాబు గారి ఉద్దేశం.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ సర్కారు జన సంక్షేమ పాలన ఆ అవకాశం ఇవ్వదని తెలిసి మరీ ఆయన ఈ చలికాలంలో బొంకడం విశేషం. సరిగ్గా 19 ఏళ్ల క్రితం చలికాలంలోనే (2003 అక్టోబర్‌ చివర్లో) అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడిని చూసుకుని ఇలాగే జనంలో తనపై సానుభూతి ఉందని భ్రమపడ్డారు బాబు. ఇప్పుడు కూడా ఆయన అదే మానసిక స్థితికి చేరుకుని…‘నేను ఓడిపోతే ఆంధ్రులకు అంతా అరిష్టమే..’ అనే రీతిలో మాట్లాడుతున్నారు.

ఇక్కడ మరో విశేషమేమంటే తన పర్యటనల్లో జనం నిరసనలు తెలిపితే తనకు పట్టరాని కోపం వస్తోందని, తనకు కూడా చెప్పు చూపించాల్సినంత పిచ్చి కోపం వచ్చినాగాని తమాయించుకుంటున్నానని కర్నూలులో చెప్పడం బాబు గారి ‘రాజకీయ ఉన్మాదాని’కి మరో మచ్చుతునక. కర్నూలులో చేసిన ప్రసంగంలో మరో గొప్ప విషయం తెలుగు ప్రజలకు వెల్లడించారు ఈ ‘మహా మాజీ ముఖ్యమంత్రి’. తనతో పెట్టుకోవడానికి అప్పట్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారే వెనకడుగు వేశారని చెప్పిన చంద్రబాబు దానికి కారణం మాత్రం చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నారు. ఈ 72 ఏళ్ల నవ యువకుడు ఈ చలికాలంలోనైనా ఈ నాటకాలు లేదా హరికథలకు స్వస్తి పలికితే అఖిలాంధ్ర ప్రజానీకం సంతోషిస్తారు.

LEAVE A RESPONSE