– ప్రజల నుండి చంద్రబాబును దూరం చేయాలని వైసీపీ భావిస్తోంది
– కుట్రలో భాగంగానే చంద్రబాబు అక్రమ అరెస్టు
– మీ ప్రేమాభిమానాలే చంద్రబాబుకు శ్రీరామరక్ష
– కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన నారా భువనేశ్వరి
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన జీవితాన్ని త్యాగం చేశారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి దర్శి నియోజకవర్గ పర్యటనలో భాగంగా తూర్పు గంగవరం గ్రామానికి భువనేశ్వరి వెళ్లారు.
భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు మహిళలు పెద్దఎత్తున బాధిత కుటుంబం వద్దకు చేరుకున్నారు. వారినుద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నిరంతరం తపించేవారు. ఆయన్ను ప్రజా జీవితానికి దూరం చేయాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారు. ఆయన అక్రమ అరెస్టును తట్టుకోలేక పార్టీ బిడ్డలు మనస్తాపంతో మరణించారు. వారి కుటుంబాలకు నేను ఆర్థికసాయాన్ని బ్యాంకు అకౌంట్ల ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నా..దాన్ని కాదనుకున్నాను.
పార్టీ బిడ్డల కుటుంబాలను నేరుగా కలిసి, వారిని ఓదార్చాలనే ఉద్దేశంతో నేను నేరుగా బాధిత కుటుంబాల ఇళ్లకు వచ్చాను. నాకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్న మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు నా నిండు కృతజ్ఞతలు. టీడీపీ కార్యకర్తలను పార్టీ నుండి ఏ శక్తీ వేరు చేయలేదని నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సమయంతో సంబంధం లేకుండా నాకోసం రోడ్లపై నిలబడుతున్న కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది. గతంలో చంద్రబాబు ప్రజల గురించి ఎందుకు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నారు? కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అని అనుకునేదాన్ని.
కానీ…ఇప్పుడు ప్రత్యక్షంగా చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు చూశాక నా అభిప్రాయం తప్పు అని తెలిసింది. చంద్రబాబుపై పార్టీ కార్యకర్తలు చూపించే ప్రేమను కుటుంబ సభ్యులుగా మేము కూడా చూపించలేము ఏమో అనిపించింది. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోంది. వాటన్నింటి నుండి చంద్రబాబును పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలి. ఎవరికి కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు గురించి నాకు ఇక ఏ భయం లేదు. అక్రమ అరెస్టు గురించి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. మాకు, చంద్రబాబుకు కార్యకర్తలు ఉన్నారనే ధైర్యం, నమ్మకం నాకు కలిగింది. మీరు మాపై, పార్టీపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞులమే…అని భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి, ఆర్థికంగా ఆదుకుంటున్న భువనేశ్వరిని పార్టీ కార్యకర్తలు అభినందించి, కృతజ్ఞతలు తెలియజేశారు.