Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు

– ఏసీబీ కోర్టులో మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిరాశ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను నవంబర్ 1వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్టులో మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నిరాశ తప్పలేదు.

చంద్రబాబు రిమాండ్‌‌తో పాటు ఇతర కేసుల వ్యవహారంలో ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉండటంతో నవంబర్‌ 1వరకు రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు ఏసీబీ న్యాయమూర్తి ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నారు. నేటితో బాబు రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు వర్చువల్‌గా హాజరయ్యారు.

విచారణ సందర్భంగా సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలున్నాయని కోర్టుకు చంద్రబాబు తెలిపారు. జైల్లో పరిస్థితులపై ఏమైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా తెలియ చేయాలని జడ్జి సూచించారు. చంద్రబాబు లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు జడ్జి హిమబిందు ఆదేశించారు. గురువారంతో చంద్రబాబు రిమాండ్‌ 40 రోజులు ముగియడంతో బాబును విచారణ కోసం వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

చంద్రబాబు తరపున దమ్మాలపాటి, సిఐడి తరపున వివేకానంద వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ విచారణ జరుగుతున్నందున నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు చంద్రబాబుకు వివరించారు. మరోవైపు జైల్లో తన భద్రత విషయాలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన వ్యక్తినని జడ్జికి వివరించారు. చంద్రబాబు వ్యక్తం చేసిన అనుమానాలు, సందేహాలను రాత పూర్వకంగా తెలియ చేయాలని ఆమె సూచించారు.

వైద్యులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నారా లేదో ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యల విషయంలో చంద్రబాబుకు ఏమైనా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తే వాటిని కూడా రాతపూర్వకంగా తెలియ చేయాలని సూచించారు. చంద్రబాబు లేఖను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు పంపాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు.

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తెలిపారు. వైద్యులు సిఫార్సు చేసిన అంశాలను లూథ్రా కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును లూథ్రా కోరారు.

LEAVE A RESPONSE