-కాంగ్రెస్ మంత్రిగా టీడీపీ ఆవిర్భావాన్ని తప్పు పట్టిన చంద్రబాబు
-ఎంపీ విజయసాయిరెడ్డి
సుమారు 40 ఏళ్ల క్రితం నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలను చూసిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన అవకాశవాద స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేశాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.
నిజానికి ఆసమయంలో రాష్ట్రాన్ని పరిపాలస్తున్న కాంగ్రెస్ ఐ ప్రభుత్వంలో చంద్రబాబు సభ్యుడు, కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రి కూడా అని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా గురువారం ఆయన ప్రజలకు పలు వాస్తవాలు తెలియజేశారు.
1983 జనవరి మొదటి వారంలో జరిగిన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కేబినెట్ మంత్రిగా ఉన్న చంద్రబాబు తన మామ స్థాపించిన టీడీపీ పార్టీలో వెంటనే చేరకపోగా, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్దమని ప్రకటించిన సందర్బాన్ని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ఎన్టీఆర్ సీఎం కావడంతో చంద్రబాబు టీడీపీలో తెర వెనుక కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారని అన్నారు.
తాను సహాయ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారనీ, అందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రారంభించారని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు మరి అప్పుడు అలాంటి దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎందుకు వైదొలగలేదో చెప్పకపోవడం విడ్డూరమని అన్నారు. టీడీపీ స్థాపన ద్వారా తెలుగు ప్రజలను ఎన్టీఆర్ కాపాడారని చెబుతున్న చంద్రబాబు ఆసమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెంటనే రాజీనామా చేసి టీడీపీ లో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు.
నాలుగు దశాబ్దాల క్రితం తెలుగుదేశం పార్టీ స్థాపన చరిత్రాత్మక సందర్భం అని ఇప్పుడు టీడీపీ చివరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్ణించడం అవకాశవాదానికి పరాకాష్ట అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన సమయంలో దానిపై అవాకులు చెవాకులు పేలిన చంద్రబాబు ఇప్పుడు ఈ పరిణామాన్ని గొప్పగా ప్రశంసించడం ఏపీ రాజకీయ చరిత్ర తెలిసిన వారెవరైనా విస్మయానికి గురి కాక తప్పదని అన్నారు.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం, ఆ పార్టీకి వెంటనే రాజీనామా చేయకుండా కొనసాగడం తప్పేనని ఇప్పుడైనా చంద్రబాబు ఒప్పుకుంటే జనం ఆయనను క్షమిస్తారని అన్నారు. తాను 40 సంవత్సరాల క్రితం విమర్శించిన పార్టీ ఆవిర్భావాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు పొగడడం ఆయన అవకాశవాదం ఏ మాత్రం మారలేదని రుజువుచేస్తోందని అన్నారు.
ప్రస్థుత నవ్యాంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందైనా టీడీపీతో మొదటి నుంచి తనకు ఉన్న సంబంధాలు, ఆ పార్టీలో చేరిన పద్ధతి గురించి చంద్రబాబు వెల్లడిస్తే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని అయితే అతి తీరని కోరిక గానే మిగిలిపోతుందేమోనని విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.