Suryaa.co.in

Editorial

చంద్రబాబును దాటిపోయిన చంద్రశేఖరుడు

– ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కేసీఆర్‌ దే
– ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుదే రికార్డు
-చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం 13 ఏళ్ల 247 రోజులు
– ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 256 రోజులు
– సీఎంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 5 ఏళ్ల 111 రోజులు
– ఆ తర్వాత రికార్డు కాసు బ్రహ్మానందరెడ్డిదే
– ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి 7 ఏళ్ల 221 రోజులు
– తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన ఘనత కేసీఆర్‌
– ఇప్పట్లో ఆ రికార్డు బద్దలు కొట్టడం కష్టమే
– రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన చంద్రశేఖరుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వారి పేర్లు చెప్పమంటే .. చాలామంది చంద్రబాబునాయుడు అని ఠక్కున చెబుతారు. కానీ ఇది ఈరోజు వరకూ మాత్రమే ఉన్న రికార్డు. జూన్‌ 2న ఆ రికార్డు బద్దలయి, చంద్రబాబు స్థానాన్ని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ఆక్రమించనున్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో.. తొమ్మిదేళ్లు ఏకబిగిన ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఇప్పుడు రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన సీఎంగా, తన పేరిట రికార్డు నమోదు చేశారు. బహుశా ఈ రికార్డును తెలంగాణ రాష్ట్రంలో బద్దలు కొట్టడం, ఇప్పట్లో బద్దలు కొట్టడం కష్టమన్నది రాజకీయ పండితుల అంచనా.

ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు నమోదు చేసుకున్నారు. ఆ విషయాన్ని అసెంబ్లీలో, బయట ఆయన సగర్వంగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు జరిగిన తర్వాత 1995 సెప్టంబర్‌ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్లీ 2004 మే దాకా సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు, మొత్తం 8 ఏళ్ల 256 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ఒక రికార్డు. అయితే తెలుగు రాష్ట్రాలు కలిపి రికార్డు చూసుకుంటే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం 13 ఏళ్ల 247 రోజులని రికార్డులు చెబుతున్నాయి.

అంతకుముందు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కూడా, ఏడేళ్లకుపైగానే సీఎంగా పనిచేశారు. అయితే ఎన్టీఆర్‌ రెండోసారి సీఎం అయేందుకు ఒక ఎన్నికల తేడా వచ్చినప్పటికీ, చంద్రబాబు మాత్రం వరసగా రెండుసార్లూ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. విభజిత రాష్ట్రంలోనూ ఐదేళ్లు సీఎంగా పనిచేశారు. మొత్తం మీద చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఇద్దరికీ తేడా అదే.

అయితే అంతకుముందు కాంగ్రెస్‌లో, ఇలాంటి రికార్డు సొంతం చేసుకున్న ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కింది. ఆయన 7 ఏళ్ల 221 రోజులు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై తన ముద్ర వేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 5 ఏళ్ల 111 రోజులు సీఎంగా పనిచేశారు. ఇక మిగిలిన వారిలో ఎక్కువమంది ఏడాది, 15 నెలలు సీఎంగా పనిచేసిన వారే. నాదెండ్ల భాస్కరరావు అయితే నెలరోజులే సీఎం చేసి రికార్డు సృష్టించారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏకబిగిన తొమిదేళ్లు సీఎంగా కొనసాగుతూ.. రికార్డు సృష్టించిన కేసీఆర్‌, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. జూన్‌ 2 నాటికి కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించి తొమిదేళ్లు. ఇది చంద్రబాబు రికార్డును అధిగమించడమే. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం బహుశా ఈ శతాబ్దిలో కష్టమేనన్నది రాజకీయ పండితుల అంచనా.

ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌-బీజేపీ జాతీయ పార్టీలే. జాతీయ పార్టీలేవీ ఒక ముఖ్యమంత్రిని, దీర్ఘకాలం అన్నేళ్లు కొనసాగించడం కష్టం. ఇక మిగిలిన పార్టీలకు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ రేపటి ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలిచి, కేసీఆర్‌ సీఎం అయితే.. కేసీఆర్‌ రికార్డును తెలంగాణ ఉన్నంతవరకూ, బద్దలు కొట్టడం అసంభవమన్నది సుస్పష్టం.

LEAVE A RESPONSE