Suryaa.co.in

Andhra Pradesh

ఏళ్ళ తరబడి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకు బైయిళ్ళు మంజూరు చేయండి

-పెరోల్ ఖైదీల పట్ల కనికరం చూపండి
-మానసిక ఖైదీలు, మహిళా ఖైదీల పట్ల కరుణ చూపండి
-న్యాయస్థానాల ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడేందుకే లేఖ రాస్తున్నా
-సుమోటోగా స్వీకరించి తక్షణం ఆదేశాలు ఇవ్వండి
-సుప్రీంకోర్టు సిజెకు, ఏపీ, తెలంగాణా హైకోర్టు సిజెలకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య లేఖ

రాష్ట్రంలోని పలు సెంట్రల్ జైళ్ళల్లో ఏళ్ళ తరబడి విచారణల పేరుతో జైళ్ళలోనే మగ్గుతున్న ఖైదీలు, ఏడేళ్ళు, 14 ఏళ్ళు గా శిక్షలు అనుభవిస్తన్న ఖైదీలు అందరికీ వెంటనే బెయిళ్ళు మంజూరు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య కోరారు. ఈమేరకు గురువారం సుప్రీంకోర్టు సిజెకు, ఏపీ,తెలంగాణ హైకోర్టుల సిజెలకు ఆయన లేఖలు రాశారు. కేవలం న్యాయస్థానాల ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడేందుకే లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తన లేఖను సుమోటుగా స్వీకరించి విచారించి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు, సాక్షాధారాలను తుడిచేసినట్లు, గూగుల్ టేక్ అవుట్, వాట్సప్ ఫోన్ కాల్స్ ఆధారాలు ఉన్నాయని, అప్రూవల్ గా మారిన నిందితుల వాంగ్మూలాలు వంటి పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని, విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, కోర్టులో పిటిషన్ పై పిటిషన్లు వేసి విచారణను అడ్డుకుంటున్నారని సిబిఐ పదేపదే న్యాయస్థానాల దృష్టికి తీసుకు వచ్చినా, అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బాలకోటయ్య ఈ లేఖను రాశారు.

ఖైదీలు అందరికీ బెయిల్ మంజూరు అంశంలో సమన్యాయం జరగాలని, చట్టం అందరికి సమానం అన్న సందేశాన్ని కోర్టులు ఇవ్వాలని ఆయన న్యాయాధిపతులను కోరారు. గతంలో కరోనా మహమ్మారి లోనూ రాష్ట్రంలోని దాదాపు 1200 మంది ఖైదీలు పెరోల్ కు ధరఖాస్తు చేసుకుంటే, ప్రభుత్వాలు వెనుకంజ వేశాయని, అందరికీ న్యాయం చేయలేదని గుర్తు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రుజు ప్రవర్తన కలిగిన ఖైదీలు కొందరిని ప్రభుత్వాలు విడుదల చేస్తే, న్యాయస్థానాలు తప్పుబట్టాయని తెలిపారు.

1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దగ్దం కేసులో 30 ఏళ్ళుగా జైలు జీవితం అనుభవిస్తున్న సాతులూరి చలపతిరావు, గంటెల విజయ్ వర్థన్ లకు, 1995లో జరిగిన ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో 28 ఏళ్ళుగా జైలు జీవితం అనుభవిస్తున్న పంత్తంగి వెంకట గణేష్ కు ఇప్పటికీ జైలు నుంచి విముక్తి లభించలేదని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హంతకులకు, రామానాయుడు స్టూడియో బాంబు సంఘటనలో 28 మంది ప్రాణాలు తీసిన వారూ బయటనే ఉన్నారని గుర్తు చేశారు. ఇలా కోర్టులు, ప్రభుత్వాలు ఆయా శిక్షల నిందితుల బల పరాక్రమాలను బేరీజు వేసి బెయిలు వగైరా సదుపాయాలు కల్పిస్తే, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని విచారం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఇప్పటికే రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థలు పూర్తిగా అప్రతిష్ట పాలయ్యాయని, ఈ దుస్థితి న్యాయస్థానానికి రాకూడదని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్క ఖైదీకి సమన్యాయం జరిగేలా చూడాలని, మానసిక ఖైదీలు, మహిళా ఖైదీల పట్ల కూడా అవినాష్ రెడ్డి పట్ల కోర్టులు చూపిన కరుణ విస్త్రతంగా నేరారోపణలు ఉన్న అందరికీ అందాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా పంపినట్లు బాలకోటయ్య వివరించారు.

LEAVE A RESPONSE