Suryaa.co.in

Features

అపర శంకరులు ఆ పరమాచార్యులు!

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు.

నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కాలినడకనే దేశమంతా పర్యటించి తమ అనుగ్రహాన్ని వర్షింపజేశారు. ‘ఇలా నడవటం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలనూ కలుసుకోగలుగుతున్నాను. ఇంతకంటే కావల్సింది ఏముంది?’ అనేవారు. అందుకే భక్తులంతా ‘నడిచే దేవుడు’ అనేవారు ఆరాధనాభావంతో.

అప్పుడే లక్ష్మీకటాక్షం: ‘లోకంలో ఎందరో దుఃఖితులూ, దారిద్య్రం అనుభవిస్తున్న వారూ ఉన్నారు. కనీస అవసరాలైనా తీరని అలాంటివారిని చూస్తూ కూడా, మనం వృథాగా డబ్బు ఖర్చుచేయటం.. పాపంతో సమానం. దీనుల వేదనను కొంతైనా తగ్గిస్తే, మన సంపదకు సార్థకత లభిస్తుంది. సంపద ఉన్నంతలో సరిపోదు. అది పరోపకారానికి ఉపయోగపడుతోందా? అని ఆలోచించాలి. అలా సంపద సద్వినియోగం అయ్యే కొద్దీ లక్ష్మీకటాక్షం సమృద్ధిగా లభిస్తుంది’ అనేవారు పరమాచార్యులు.

దోషాలు ఎంచకూడదు: ఇతరుల్లో దోషాల్ని వెతికేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా పురోగమించలేరని చెప్పేవారు చంద్రశేఖరేంద్రులు. ‘ఈశ్వరుడు పాలసంద్రంలో పుట్టిన కాలకూట విషాన్నీ, చంద్రుణ్ణీ స్వీకరించాడు. చంద్రుని శిరస్సున ధరించి, విషాన్ని పైకి రానీయక కంఠంలోనే దాచుకున్నాడు. అలాగే ఉత్తములు పరుల సుగుణాలను అందరి ముందూ శ్లాఘిస్తూ, దోషాలను తమ మనసులోనే దాచుకుంటారు’ అన్నారు కంచి పరమాచార్యులు.

భగవద్భక్తితోనే దేశప్రగతి: భక్తిని మించిన పారమార్థిక పురోగమనం మరేదీ లేదనేవారు చంద్రశేఖరేంద్ర స్వామి. ‘మనకు కావలసింది సర్వరుగ్మతల నివారిణి అయిన భక్తే! ఈశ్వరభక్తి- అతడి బిడ్డలైన సకల జీవుల మీద ప్రేమగా పరిణమిస్తుంది. అప్పుడు సేవాభావం తప్ప మరి దేనికీ చోటుండదు. ఆ దయాగుణంతోనే సార్థకత. ఆ అన్నపూర్ణాదేవి ప్రేమస్వరూపమైన జ్ఞానాన్ని భిక్షగా వేయాలని ప్రార్థిద్దాం. ఆనాడు ఆదిశంకరాచార్యులు ఆ దేవిని అర్థించింది ఇలాంటి జ్ఞానాన్నే!’ అన్నారు పరమాచార్యులు.

మన పతాకానికి మహాస్వామి నిర్వచనం: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చంద్రశేఖరేంద్ర స్వామి కంచిపీఠంలో ప్రసంగిస్తూ ‘మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. కాషాయరంగు సౌభాగ్యాలనిచ్చే మహాలక్ష్మిది. తెలుపు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిది. ముదురుపచ్చ మనల్ని రక్షించే పరాశక్తి రూపమైన దుర్గాదేవిది. దేవీశక్తుల ప్రతీకలే మూడు చారలుగా కనబడటం విశేషం. అపార ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి కావలసిన శక్తిని ప్రసాదించాల్సిందిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. సముపార్జించుకున్న స్వాతంత్య్రాన్ని భగవదనుగ్రహంతోనే కాపాడుకోగలం. పరమాత్మ కృపతోనే సమస్త మానవాళీ ఆనందమయమైన జీవితాన్ని గడపగలదు’ అన్నారు.

రమణమహర్షిపై పూజ్యభావం వ్యక్తం చేసేవారు కంచి పరమాచార్యులు. వారి భక్తుల్లో ఒకరి పుత్రుడికి మతి భ్రమించింది. అప్పుడు చంద్రశేఖరేంద్ర ‘ఇతన్ని రమణుల సన్నిధిలో పది రోజులు ఉంచండి. అంతా సర్దుకుంటుంది’ అన్నారు. ఆ రమణుడి వద్దకు వెళ్లిన యువకుడు ‘నన్నందరూ పిచ్చివాడు అంటున్నారు’ అని విన్నవించుకున్నాడు.

రమణులు కరుణతో ‘అలాగా! నన్ను కూడా ఒకప్పుడు పిచ్చివాడనే అన్నారు. నువ్వు నాకు తోడు ఉన్నావన్న మాట! చాలా సంతోషం’ అన్నారు. అలా మహర్షి సన్నిధిలో పదిరోజులున్న అతడికి స్వస్థత చేకూరింది.
చంద్రశేఖరేంద్ర సరస్వతి 1994 జనవరి 8న, తమ 99వ ఏట భౌతికంగా ఈ లోకాన్ని విడిచినా, ఆధ్యాత్మిక గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

– సువర్చల

LEAVE A RESPONSE