చంద్రయాన్ -3 లాంచ్‌ప్యాడ్‌ను సిద్ధం చేసిన జార్ఘండ్‌లోని రాంచీలో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లు, ఇతర సిబ్బందికి గత 18 నెలల నుంచి జీతాలు ఇవ్వక పోవడాన్ని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ తప్పు పట్టారు.
ఐదేళ్లుగా కీలకమైన సీఎండీ పదవి ఖాళీగా ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని, దాదాపు రూ.1500 కోట్ల విలువైన ఆర్డర్లు ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్ ఇండియా నుంచి వచ్చినప్పటికీ నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు హెచ్‌ఈసీలో నిలిచిపోవడం బాధాకరమని అన్నారు.
హెచ్‌ఈసీ ఉద్యోగుల, ఆఫీసర్ల సంఘాలు పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తూ ఆధునీకరణ ప్రతిపాదనలు సమర్పించి వర్కింగ్ క్యాపిటల్ రూ.1000 కోట్లు సమకూర్చాలని ఎన్నోసార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2023- 24 సంవత్సరానికి బడ్జెటరీ సపోర్ట్ గా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడాన్ని 321వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శించిందని పేర్కొన్నారు.
జాబిల్లిపై పరిశోధనల కోసం, భారత రోదసీ యాత్రలో మరో ముందడుగు వేసేందుకు ల్యాండర్‌ను ప్రయోగించడంతో మనదేశం చంద్రునిపై అడుగుపెట్టే దేశాలలో ప్రపంచంలో అమెరికా, సోవియట్ యూనియన్(రష్యా), చైనా తరువాత ఇండియా నాలుగో స్థానంలో నిలవబోతుందని, ఇంతటి అద్బుత విజయం వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఇతర కార్మికుల శ్రమ ఎంతో ఉందని,18 నెలలుగా జీతాలు లేకున్నా ఇంజినీర్లు, ఇతర సిబ్బంది చంద్రయాన్ -3 కోసం పనిచేశారని తెలిపారు.
దేశం సాధించబోయే విజయం కోసం అన్నిటిని దిగమింగుకుని రేయనకా, పగలనకా పనిచేశారని, వారి బాధలను పట్టించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమయాన్ని కేటాయించక పోవడం దుర్మార్గమని, ఎన్నోమార్లు వేతనాల కోసం ఇంజినీర్లు,సిబ్బంది అర్జీలు పెట్టుకున్నా కనికరించలేదని వాపోయారు.
ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టిందని, జీతాల చెల్లింపుల్లో సమస్య ఉన్నా లాంచ్‌ప్యాడ్ సహా ఇతర కీలక సామాగ్రిని గడువుకు ముందే హెచ్‌ఈసీ 2022 డిసెంబర్‌లోనే ఇస్రోకు అందజేసిందని పేర్కొన్నారు.
చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడదామని అహోరాత్రులు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇతర సిబ్బంది వేతనాల్లోనూ ప్రభుత్వం కోత పెట్టిందని,ఇస్రో ప్రయోగానికి ముందు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వేతనాన్ని కట్ చేసి శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని లేకుండా చేసిందని తెలిపారు.
ప్రయోగ కేంద్రాలను, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అదాని లాంటి ఆశ్రిత పెట్టుబడుదారులకు అప్పజెప్పేందుకే ప్రభుత్వం ఆధునీకరణకు నిధులు కేటాయించటం లేదని తెలిపారు.
సైన్స్ పరంగా చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇచ్చే 392 సైన్సు అవార్డులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసిందని, ఉపయోగం లేని వాటికి కోట్ల రూపాయలు కట్టబెడుతూ దేశానికి పనికొచ్చే రంగాలకు నిధులివ్వడం లేదంటే దేశం పయనం ఏ దిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చునని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, అదే విధంగా స్వయం శక్తితో ఎదిగేందుకు ఇస్రోకు యావత్ జాతి మద్దతు కొనసాగాలని, శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది కృషికి ప్రోత్సాహము ఉండాలని వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.