‘ఛావా’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకి అయిన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి.
కానీ ‘ఛావా’ సినిమా వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింత తీవ్రతరం అయింది. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.
దీంతో నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు. దీంతో నాగ్‌పూర్ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
సోమవారం నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. విశ్వ హిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ సహా హిందూ సంస్థల సభ్యులు శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ నిరసన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు.
పరిస్థితి మరింత దిగజారిందని, శంభాజీ నగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని , ప్రజా ఆస్తులు దెబ్బతిన్నాయని, వాహనాలకు నిప్పు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు అల్లర్లకు పుకార్లే కారణమని తేల్చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ప్రజలు పుకార్లను నమ్మవద్దని ,అధికారులకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
ఈ ఘర్షణల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్పందించారు. నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. పుకార్ల కారణంగా,నాగ్‌పూర్‌లో మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని ఆయన అన్నారు. ఇటువంటి సమయంలో శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరూ పుకార్లను నమ్మవద్దని , శాంతిని కాపాడుకోవాలని ఆయన కోరారు. ప్రజలు బయటకు రావొద్దని , శాంతిభద్రతల వ్యవస్థకు సహకరించాలని గడ్కరీ అన్నారు.