-మోసం చేయడం కెసిఆర్ నైజం
-కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి సీఎం
-జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో గత ఆరు రోజులుగా తొమ్మిదిన్నర వేలమంది కార్యదర్శులు ఆందోళన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి కి చీమకుట్టినట్టైనా లేదని సంగప్ప పేర్కొన్నారు.
జేపీసీలను నాలుగు సంవత్సరాలుగా ప్రొబేషనరీ పేరుతో పని చేయించుకోవడం అన్యాయం అని ఆయన అన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు… అందరూ రెగ్యులర్ ఉద్యోగులే ఉంటారు అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని సంగప్ప చెప్పారు. మోసం చేయడం, మాయమాటలతో వంచించడం కేసీఆర్ నైజం అని ఆయన విమర్శించారు. అందరిలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తానని కేసిఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అమలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు ఎంతో శ్రమిస్తున్నారని, కానీ వారి శ్రమకు తగ్గ వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆయన అన్నారు. వెంటనే జేపీసీ, ఓపీసీలను రెగ్యులరైజ్ చేస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంగప్ప డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నేతలు సాయిరాం, సంజు పాటిల్, అనిల్ రెడ్డి, సగనాకర్ తదితరులు పాల్గొన్నారు.