-స్థానిక సంస్థల గొంతునొక్కడమే అభివృద్ధి వికేంద్రీకరణా జగన్ రెడ్డి?
-సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన నీచ చరిత్ర నీది
-కేంద్ర నిబంధనలకు తూట్లు పొడిచిన నిన్ను ప్రజలే గద్దె దించుతారు
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు
స్థానిక సంస్థలకు వచ్చిన కేంద్రం నిధులను స్వాహా చేసి, పల్లెల అభివృద్ధి గొంతునొక్కడమే అభివృద్ధి వికేంద్రీకరణ అని జగన్ రెడ్డి వక్రభాష్యాలు చెబుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…స్థానిక సంస్థలను నిర్వీర్యంచేస్తూ, గ్రామసర్పంచ్ లను ఉత్సవవిగ్రహాలుగా జగన్ రెడ్డి మార్చారు. పల్లెలను అభివృద్ధికి దూరంగా, అనారోగ్యానికి ఆలవాలంగా మార్చారు. ఇటువంటి వ్యక్తి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రూ.8,548.29కోట్లు స్వాహా..
14, 15వ ఆర్థికసంఘం గ్రామాలఅభివృద్ధికోసం విడుదల చేసిన రూ.8548.29కోట్ల నిధుల్ని దిగమింగింది.ఒకవైపు పల్లెలరూపురేఖలు మార్చడానికి కేటాయించిన నిధుల్ని స్వాహాచేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు, మరోపక్క అభివృద్ధి వికేంద్రీకరణ రాగం ఆలపిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రప్రభుత్వం పల్లెలను గాలికొదిలేసి గ్రామప్రథమ పౌరులైన సర్పంచ్ లను గతిలేని వాళ్లగా మార్చి, వారిని ఉత్సవవిగ్రహాలను చేసింది.పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులేదు, పారిశుధ్యకార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో 12,918 గ్రామపంచాయతీలున్నాయి.
మహాత్ముడు కన్న గ్రామీణ స్వరాజ్యానికి తూట్లు….
జగన్మోహన్ రెడ్డి తన దోపిడీవిధానంతో, మహాత్మగాంధీ కలలుగన్న గ్రామీణస్వరాజ్యానికి తూట్లుపొడుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గాంధీ జయంతినాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లు అందరూ గాంధీవిగ్రహాల ముందు నిరసనవ్యక్తంచేసి, బాపూజీప్రతిమలకు వినతిపత్రాలివ్వాల్సి రావడం దురదృష్టకరం.
5శాతం సర్పంచ్ లు కూడా వైసీపీకి అనుకూలంగా లేరు…..
సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు తమపై, తమప్రభుత్వంపై ఉన్న అభిమానంతో వైసీపీకి ఏకగ్రీవమయ్యాయని చెప్పుకున్నవారంతా, ఇప్పుడు జరుగుతున్నవాటిని చూసి నిజంగా సిగ్గుపడాలి. వైసీపీపై, జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఇప్పుడుగానీ సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తే 5శాతంపంచాయతీలు కూడా వారికి రావని ఘంటాపథంగా చెప్పగలం. పంచాయతీ నిధులు మింగిన నిన్ను పల్లె ప్రజలే గద్దె దించి తగిన గుణపాఠం చెబుతారు.
కేంద్ర నిబంధనలకు నీళ్లొదిలిన జగన్ రెడ్డి….
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని మూడురోజుల్లోగా స్థానిక పంచాయతీలకు జమచేయాలనే నిబంధనలకు జగన్ ప్రభుత్వం నీళ్లొదిలింది. ఉపాధిపని కూలీలకు వారంలో కూలీడబ్బులివాల్సి ఉండగా, 6నెలలైనా ఇవ్వని దుస్థితి. జగన్ ప్రభుత్వం రూ.8548.29 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని స్వాహా చేసింది. పల్లెల్లో ఉపాధికల్పన కోసం తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకంకింద పనికోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు వారంలో పనికల్పించాలనే నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. పనికోసం చేసుకున్న దరఖాస్తులకు నెలలు గడుస్తున్నా మోక్షం లభించడంలేదు.
ప్రభుత్వ, వ్యవస్థల నిర్లక్ష్యంతో నిర్ణీతవ్యవధిలోగా పనికల్పించకపోతే, దరఖాస్తుదారుడికి కూలీసొమ్ముతోపాటు పరిహారంగా ఇవ్వాల్సిన సొమ్మునికూడా ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదు. ప్రతిగ్రామంలో బడి, ఆసుపత్రి, మంచినీరు, రవాణా వంటి మౌలికవసతులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే వాస్తవం జగన్ ప్రభుత్వానికి తెలియదా? లేక కావాలనే ధనదాహంతో పల్లెలను గాలికొదిలేసిందా? ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీలకు కేటాయించాల్సిన నిధుల్ని తక్షణమే విడుదలచేయాలి.
పల్లెల అభివృద్ధి నిధులూ జగన్ జేబులోకే….
జగన్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికోసం తనవాటాగా ఇవ్వాల్సిన సొమ్ముని ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వమిచ్చిన నిధులను కూడా తనజేబులో వేసుకోవడం దుర్మార్గం. గ్రామస్వరాజ్యం అంటే ముందుగా పల్లెలుఅన్నివసతులతో అభివృద్ధిచెందడమనే వాస్తవాన్ని వైసీపీప్రభుత్వం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని సూచిస్తున్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యానికి నాందిపలుకుతుందనే వాస్తవాన్ని, పల్లెలఅభివృద్ధే అసలుసిసలైన అభివృద్ధి వికేంద్రీకరణ అనే నగ్నసత్యాన్ని ప్రభుత్వం, మంత్రులు గ్రహించాలని తెలియచేస్తున్నాం అని చెంగల్రాయుడు తెలిపారు.