Suryaa.co.in

Telangana

కొండగట్టు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి

– కొడిమ్యాల అటవీ ప్రాంతం పునరుద్దరణ, ఆలయం, భక్తులకు కనీస అవసరాల కల్పన

జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సంకల్పించారు. ఈ నేపథ్యంలో అటవీ- పర్యావరణం, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు.

ఆలయ అభివృద్ది, పునర్ నిర్మాణం సీఎం ప్రకటించిన తర్వాత రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున కొండగట్టును ఆనుకుని ఉన్న కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని తెలిపారు. అటవీశాఖ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంయుక్తంగా ఈ కొడిమ్యాల అటవీ పునరుద్దరణ పనులు చేపట్టనున్నాయి. కొండగట్టు ఆలయానికి అనుకునే విస్తారమైన ఈ కొడిమ్యాల అడవి ఉంది. ఈ రోజు సందర్శించిన ప్రధాన అటవీ సంరక్షణ అధికారి అటవీ ప్రాంతం పునరుద్దరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాలలో గల రెండు అటవీ బ్లాకులలో చేయవల్సిన అభివృద్ధి పై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

ముందుగా అటవీ ప్రాంతం చుట్టూ అవసరం అయిన చోట రక్షణ కంచె ఏర్పాటు చేయనున్నారు. సుమారు 5 కిలోమీటర్లు కాలినడక మార్గం (వాకింగ్ ట్రాక్) మట్టితో ఏర్పాటు చేయటం, వెయ్యి ఎకరాలలో ఔషద, సుగంధ మొక్కల పెంపకం, అందుకోసం అవసరమైన తగిన నర్సరీ ల ఏర్పాటు, వాచ్ టవర్ నిర్మాణం, భక్తులు సేద తీరేందుకు వీలుగా గజేబో నిర్మాణం తొలి దశలో చేపట్టనున్నారు. ఆలయ పరిసరాల్లో విస్తారంగా తిరిగే కోతుల ఆహారం కోసం అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పీసీసీఎఫ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో శరవణన్, ముఖ్య అటవీ సంరక్షణాధికారి, బాసర సర్కిల్, వెంకటేశ్వరావు, జగిత్యాల జిల్లా అటవీ అధికారి, లత, రేంజ్ ఆఫీసర్, మౌనిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, శ్రీ సాయిరాం, బీట్ ఆఫీసర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE