Suryaa.co.in

Andhra Pradesh

దార్శనికత గ‌ల ముఖ్యమంత్రి చంద్రబాబు

– అద్భుత‌మైన ప‌వ‌ర్ పాయింట్ , ఏవీ ప్ర‌జంటేష‌న్
– బాబు దూరదృష్టిపై అర‌వింద్ ప‌న‌గారియా ప్రశంస
– రాష్ట్రాల‌ వాటా సిఫార్సు 41 శాతానికి పరిమితం కాదు
– నోవాటెల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గారియా

విజ‌య‌వాడ‌: అయిదేళ్ల‌కోసారి ఏర్పాట‌య్యే ఆర్థిక సంఘం భార‌త రాజ్యాంగం నిర్దేశించిన విధుల‌ను నిర్వ‌ర్తిస్తోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌న్నుల రాబ‌డిలో రాష్ట్రాల‌కు ఏ విధంగా పంపిణీ చేయాల‌నే దానిపై సిఫార్సులు చేస్తుంద‌ని 16వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ డా. అర‌వింద్ ప‌న‌గారియా అన్నారు.

16వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ అర‌వింద్ ప‌న‌గారియా బుధ‌వారం నోవాటెల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్రం నుంచి 28 రాష్ట్రాలకు ప‌న్నుల నిక‌ర రాబ‌డి పంపిణీ అవుతుందన్నారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు గ్రాంట్లకు సంబంధించి కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు చేయాల్సి ఉంటుంద‌న్నారు. అదేవిధంగా విప‌త్తు ఉప‌శ‌మ‌నంతో పాటు రాష్ట్ర‌, రంగాల వారీగా నిర్దిష్ట గ్రాంట్లను కూడా ప‌రిశీలిస్తుంద‌న్నారు.

అర‌వింద్ ప‌న‌గారియా ఆర్థికప‌ర స్థితిగ‌తుల‌ను వివ‌రిస్తూ.. రాష్ట్ర జీఎస్‌టీ, మ‌ద్యంపై ఎక్సైజ్‌, పెట్రోలుపై రాష్ట ప‌న్నులు వంటివి నేరుగా రాష్ట్రాలకు వెళ్తాయన్నారు. కొన్ని ప‌న్నులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వానికి వెళ్తాయ‌ని, అదేవిధంగా కొన్ని సుంకాలు, స‌ర్‌ఛార్జీలు కూడా కేంద్రానికి నేరుగా వెళ్తాయ‌న్నారు.

అయితే ప్ర‌ధాన ప‌న్ను వ‌న‌రుల నిక‌ర‌రాబ‌డితో కూడిన విభజించదగిన పూల్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య ఎలా విభజించాల‌నే దాంతో పాటు వివిధ ప‌రామితుల ఆధారంగా 28 రాష్ట్రాల మధ్య ప‌న్నుల వాటాను ఎలా పంపిణీ చేయాలో ఆర్థిక కమిషన్ సిఫార్సు చేస్తుందని వివ‌రించారు.

15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల‌కు 41 శాతం వాటాను సిఫార్సు చేసింద‌ని, అన్ని స్థానిక గ్రాంట్లు లేదా విపత్తు ఉపశమనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి రావాల్సి ఉంటుంద‌ని, అంటే వాటా కేవలం 41 శాతానికి పరిమితం కాదని పేర్కొన్నారు.

11వ ఆర్థిక సంఘం (2001-05) కేంద్ర ప‌న్నుల్లో 29.5 శాతం వాటాను సిఫార్సు చేసింద‌ని, 12వ ఆర్థిక సంఘం 30.5 శాతం వాటాను సిఫార్సు చేసింద‌ని, అదే విధంగా 14వ ఆర్థిక సంఘం స‌మ‌యంలో ఇది గ‌ణ‌నీయంగా 42 శాతానికి పెరిగింద‌న్నారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘంలో 41 శాతంగా ఉంద‌ని ఆయన అన్నారు.

రాష్ట్రాల‌తో విస్తృత సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాం:
నిధుల వాటా పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేసేందుకు వీలుగా రాష్ట్రాల‌తో విస్తృత సంప్ర‌దింపుల‌తో పాటు వివిధ వ‌ర్గాల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే 22 రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌డం జ‌రిగింద‌ని, 23వ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ఇంకా అయిదు రాష్ట్రాలు మిగిలిఉన్న‌ట్లు తెలిపారు.

ముఖ్య‌మంత్రి చంద్రబాబు ను ప‌నాగ‌రియా ప్ర‌శంసించారు. దార్శనికత గ‌ల ముఖ్యమంత్రి అని, అమరావతి నిర్మాణం ప్రారంభం నుండి ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరం, దాని చరిత్ర గురించి అద్భుత‌మైన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్, ఏవీ ప్ర‌జంటేష‌న్ ఇచ్చార‌న్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు, భీమ్ అప్లికేషన్, యూపీఐ వ్యవస్థ అభివృద్ధికి దారితీసిన డిజిటలైజేషన్‌పై కమిటీకి అధ్యక్షత వహించినప్పుడు, 2015 నుండి నీతి ఆయోగ్‌లో ఉన్న స‌మ‌యంలో ముఖ్యమంత్రితో తనకున్న అనుబంధాన్ని ప‌నాగ‌రియా గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి క్రియాశీల‌, ఆచరణాత్మక నాయకత్వాన్ని పనగారియా ప్రశంసించారు. వ‌చ్చే 20-25 సంవత్సరాలలో భారతదేశం ఎలా ఉండబోతోందో, 2047 విక‌సిత్ భార‌త్ దార్శనికత గురించి మరియు స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక‌త‌ను వివ‌రించార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై విభ‌జ‌న ప్ర‌భావం, వ‌న‌రుల ల‌భ్య‌త‌, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌జెంటేష‌న్‌లో క‌వ‌ర్ చేశార‌ని పేర్కొన్నారు.

ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాల‌ని ముఖ్య‌మంత్రి కోరిన‌ట్లు తెలిపారు. రాష్ట్రాల మ‌ధ్య వాటా పంపిణీకి సంబంధించి జనాభాకు ఇచ్చే వెయిటేజీని 15 శాతం నుంచి 5 శాతానికి, విస్తీర్ణానికి ఇచ్చే వెయిటేజీని 15 శాతం నుంచి అయిదు శాతానికి త‌గ్గించాల‌ని రాష్ట్రం కోరింద‌న్నారు.

ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫ‌ల్య రేటు (టీఎఫ్ఆర్‌) ప‌డిపోయిన నేప‌థ్యంలో ఒక నిర్దిష్ట స్థాయికి మించి జనాభా పెరుగుదలకు ప్రోత్సాహం అవసరమని గుర్తించే మరింత సమగ్ర విధానాన్ని తీసుకురావాలన్న ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి గురించి వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక సంఘం ఎలాంటి నిర్ణ‌యాలూ తీసుకోలేద‌ని.. విస్తృత సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు.

ఇంకా చాలా చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉంద‌ని తెలిపారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ప్ర‌త్యేక‌త గురించి ప‌నాగ‌రియా వివ‌రించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఎటువంటి షరతులు విధించ‌క‌పోవ‌డం ఇదే మొదటిసారి అని అన్నారు. ప‌న్నుల వాటాపై సిఫార్సులు చేయ‌డంలో ఆర్థిక సంఘానికి పూర్తిస్థాయిలో స్వాతంత్ర్యం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

భవిష్యత్ సిఫార్సులకు సంబంధించి రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను అంగీకరిస్తూ ఛైర్మ‌న్ సానుకూల‌తను వ్య‌క్తం చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు, భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో చర్చలు పూర్తిచేసిన తర్వాతే ఆర్థిక సంఘం సిఫార్సుల నివేదిక‌ను స‌మ‌ర్పిస్తుంద‌ని తెలిపారు. స‌మావేశంలో ఆర్థిక సంఘం స‌భ్యులు డా. మ‌నోజ్ పాండా, అన్నే జార్జ్ మాథ్యూ, రాష్ట్ర ఆర్థిక శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి జె.నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE