పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదలచేసిన ముఖ్యమంత్రి జగన్‌

అమరావతి: క్యాంపు కార్యాలయంలో ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌కు ప్రోత్సాహకాలు విడుదల కార్యక్రమం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…
ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు, అదేరకంగా స్పిన్నింగ్‌ మిల్స్‌ను ఆదుకునేందుకు ఇవాళ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్‌ఎంఈలు చేస్తున్నాయి: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 97,423 మంది ఎంఎస్‌ఎంఈలు నడుపుతున్నారు.వీరు చిన్న చిన్న పరిశ్రమలను పెట్టడమే కాకుండా, మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.ఇలాంటి రంగాన్ని ఆదుకోవడం అంటే…, ఇలాంటి వారికి రాష్ట్రం ప్రభుత్వం ఒక మాట చెప్తే.. చేస్తుంది అని నమ్మకం కల్పించడం అంటే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టానికి విశ్వాసం కల్పించమే అవుతుంది.ఎంఎస్‌ఎంఈలతోపాటు మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు… వీరందరినీ కాపాడగలిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబడగలుగుతుంది.
వ్యవయసాయం ఏరకంగా జీడీపీకి దోహదకారి అవుతుందో, పరిశ్రమలు కూడా అదేరకంగా తోడ్పాటును అందిస్తాయి. గతంలో చూస్తే.. హడావిడి ఎక్కువగా ఉండేది.పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, కాగితాల మీద అగ్రిమెంట్లు రాసుకునేవారు, ఆరోజుల్లో మీడియా కూడా పోలరైజ్డ్‌గా ప్రచారం చేసేది. ఇవాళ కూడా మీడియా అదే పోలరైజ్డ్‌గానే ఉంది. అక్కడ ఏమీ జరక్కముందే.. మైక్రోసాఫ్ట్‌వచ్చేసింది ఒకరోజు రాసేవారు, ఎయిర్‌బస్‌వచ్చేసిందని మరో రోజు రాసేవారు.


బుల్లెట్‌ రైలు వచ్చేసిందని ఇంకోసారి హెడ్‌లైన్స్‌లో వార్తలు చూశాం. ఏమీ జరక్కపోయినా, ఏమీ రాకపోయినా మీడియా హడావిడిని గతంలో బాగా చూశాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకుండా, నిజంగానే పరిశ్రమలను తీసుకురావడానికి చిత్తశుద్ధితోడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది. వచ్చిన పరిశ్రమలు ఏంటో.. మన కళ్లముందే కనిపిస్తున్నాయి.
స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా వారి కళ్లముందే కనిపిస్తున్నాయి. ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి.ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెప్తే, ఆ ఇన్సెంటివ్‌లను ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలమీద ఉండాలి. అప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను గమనిస్తే.. ఆర్థిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది. వస్తువులకు, సేవలకు డిమాండ్‌ తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇలాంటి అనుకూలతలేని పరిస్థితులనుంచి కూడా ఒకవైపున ప్రజలను కాపాడుకోవాలి. ఇంకోవైపున వస్తువులకున్న డిమాండ్‌ తగ్గకుండా, మరోవైపున పరిశ్రమలను కూడా నిలబెట్టే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం మనకు ఉంది.
ఇదే దిశగా అడుగులు వేస్తూనే ముందుకు పోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే పరిశ్రమలను రప్పించడమే కాదు, ఆ పరిశ్రమలు ఉత్పత్తిచేస్తున్న వస్తువులను కొనుగోలుచేసే శక్తి ప్రజలకు ఉన్నప్పుడే అప్పుడు పరిశ్రమలు కూడా నిలబడతాయి. ఆ కొనుగోలు శక్తి అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకు లేకపోతే ఆ సైకిల్‌ దెబ్బతింటుంది, అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా దెబ్బతింటారు. కొనుగోలు చేసే సామర్థ్యం ప్రజలకు లేనప్పుడు పరిశ్రమలు కూడా మూతబడే పరిస్థితి వస్తుంది. కోవిడ్‌లాంటి విపత్తు నెలకొన్న ఈ పరిస్థితుల్లో… అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకునేందుకే వైయస్సార్‌ రైతు భరోసాకాని, వైయస్సార్‌ ఆసరా కాని, వైయస్సార్‌ చేయూత కాని, జగనన్న అమ్మ ఒడి కాని, జగనన్న విద్యా దీవెన కాని, జగనన్న వసతి దీవెన కాని.. ఇలా దాదాపు 25 సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకుని రావడమే కాకుండా… ఎక్కడా కూడా వివక్షకు, అవినీతికి తావులేకుండా ప్రతి పేద లబ్ధిదారుడికీ కూడా చేతిలో డబ్బును అందించాం.
ఒక బటన్‌ నొక్కగానే ఎలాంటి అవినీతికి తావులేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ల ఖాతాల్లోకి వేయడంద్వారా మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి దయతో నిలబెట్టగలిగాం.
ఈ 27 నెలల కాలంలో మన అందరి ప్రభుత్వం అందించిన ఈడబ్బు రాష్ట్రంలోని కుటీర, మధ్యతరహా పరిశ్రమలు అన్నింటినీ కూడా నిలబెట్టగలిగాం. అంతే కాదు ఉపాధిని కూడా నిలబెట్టగలిగాం.కాబట్టే ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా పరిశ్రమలను నిలబెట్టగలిగాం.
ఇవన్నీ చేయడంద్వారానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు మైనస్‌5.2శాతం ఉన్న ఈసమయలోకూడా, మన రాష్ట్రంలో అలాంటి వెనుకబాటుకు ఆస్కారం ఇవ్వకుండా మన రైతును, మన పరిశ్రమను, మన పేద సామాజిక వర్గాలను మాన రాష్ట్రంలో మనం నిలబెట్టుకోగలిగాం.చిన్న గ్రోత్‌రేటు అయినప్పటికీ కూడా మిగతా వాళ్లంతా మైనస్‌ల్లో ఉన్నా ఎంతో కొంత పాజిటివ్‌గానే అడుగులు ముందుకేశాం.
ఇలాంటి కష్టకాలంలో కూడా పేదల చేతికి ప్రభుత్వం అప్పో, సప్పో చేసైనా సరే పేదలకు అందించిన ఆ డబ్బే ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా సంజీవని అవుతుందని అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు ఈ సమయలో గట్టిగా చెప్తున్నారన్న విషయాన్ని గమనించాలి.ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన ఖర్మ కొద్దీ ఒక ఎల్లోమీడియా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 ఉన్నాయి.
వీళ్లు ఒకవైపున ఉంటే, వీళ్లకి కొమ్ముకాస్తూ తెలుగుదేశమనే అన్యాయమైన పార్టీ కూడా ఉంది.
ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసప్పో తెచ్చే కార్యక్రమాన్ని చేస్తే దానిని కూడా వక్రీకరించి, పెడదోవ పట్టించేలా ప్రచారం చేసి, నెగెటివ్‌ లైన్లో చూపించే అధ్వాన్న పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తున్నాయి.
పళ్లుపండే చెట్టుమీదే రాళ్లు పడతాయన్న సామెతను నేను గట్టిగా నమ్ముతాను.వీళ్లు ఏం చేసినా సరే.., ఎంత నిరుత్సాహపరిచే కార్యక్రమాలు చేసినా సరే దేవుడి దయతో మంచి చేయాలనుకున్నాం, చేస్తాం కూడా. మన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాటిమీద ఆధారపడ్డ కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తున్నాం. 12 లక్షలమందికి ఉపాధినిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్‌ స్పిన్నింగ్‌మిల్స్‌కు ఊతమిస్తూ రూ.1124 కోట్ల ప్రోత్సహకాలు విడుదల చేస్తున్నాం.

Leave a Reply