– ప్రైవేటు స్కూళ్లకంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే
– విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి వ్యసనాలకు దూరంగా ఉండాలి
– కొంతమంది డ్రగ్స్ ను కూరగాయల్లా సాగు చేస్తున్నారు
– రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడకుండా ఉండేందుకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశాం
– మెగా పేరెంట్స్ –టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి
– బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో తరగతులను సందర్శించి విద్యార్థులతోముచ్చటించిన ముఖ్యమంత్రి
– విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు
బాపట్ల: పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరం నేర్చుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించగలమని, విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బాపట్ల మున్సిపల్ స్కూల్ లో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి సమావేశాలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి. ఒకేరోజు రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఈ సమావేశాల్లో దాదాపు 1 కోటి 20 లక్షల మంది తల్లిదండ్రులు ,విద్యార్థులు పాల్గొనడం సంతోషకరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ,విద్యార్థులు ,ప్రభుత్వం సమన్వయంతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలకడం శుభ పరిణామం. అందరం కలిసి పని చేస్తే అద్భుతమైన లక్ష్యాలను సాధించవచ్చు.
ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఈ ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తాము. మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. చిన్నప్పుడు విద్యను నేర్పించిన గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఇప్పటికీ చిన్నప్పుడు విద్య నేర్పించిన గురువులను గుర్తుచేసుకుంటూ ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 లక్ష్యంతో హైదరాబాదు ను అభివృద్ధి చేసి చూపించాను. ఇపుడు స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాను.
విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలి
విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత ఉన్నత స్థాయికి చేరుకోవాలి. బాగా చదువుకుంటే సంపదను సృష్టించవచ్చు. టెక్నాలజీని ఉపయోగించుకుని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్ కార్డులు , ప్రోగ్రెస్ కార్డులతో పాటు విద్యార్థుల అటిండెన్స్ సమాచారాన్ని ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తాము. తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండాలి.
తల్లిదండ్రులు పిల్లల చదువును పర్యవేక్షించాలి. మీ పనుల్లో మీరు ఉండి పిల్లల చదువును నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు స్మార్ట్ ఫోన్ లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులే చూసుకోవాలి. అలాగే సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులకు సెల్ ఫోన్లలో ద్వారా సందేశాలు పంపడం, ఫోన్లలో అశ్లీల దృశ్యాలు చూడడం ద్వారా యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి.
డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే ప్రారంభం కావాలి
గంజాయిని కొంతమంది ఇంట్లోనే సాగు చేస్తున్నారు. పెరట్లో కూరగాయ మొక్కల్లా పండిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ,గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశాము. గంజాయి వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తాము. మానవ సంబంధాలను నాశనం చేసే డ్రగ్స్ అనే మాట రాష్ట్రంలో వినబడకుండా చేస్తాము. మన
దేశ గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ
కుటుంబ వ్యవస్థ మనదేశానికి లభించిన అద్భుతమైన సంపద. జపాన్, అమెరికాలాంటి దేశాలలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలు సంపాదించుకొనే చదువుకోవాలి. పిల్లలు బాగా చదువుకుని వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి చేరుకోవాలి. మాతృదేవోభవ –పితృదేవోభవ- ఆచార్యదేవోభవ అని పెద్దలను మనం గౌరవిస్తాము. విద్యార్థులు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు ఆటపాటలతో పాటు ఆనందంగా చదువుకోవాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనడం ద్వారా మానసిక దృఢత్వం, శారీరక దృఢత్వం కలుగుతుంది.
గతంలో 11 డీఎస్సీ నిర్వహించి 1.50 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాము. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి భవనాలను పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీలు, డిజిటల్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తాము. వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికే అన్ని పనులు పూర్తిచేస్తాము.
విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. క్లాస్ రూమ్ లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు.