– నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వలేదు
ఏం ఒరగబెట్టిందని కాంగ్రెస్ విజయోత్సవాలు, సంబురాలు?
– కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో.. గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు కూడా సరిగ్గా తిరగడం లేదు. డిసెంబరు 9న సోనియమ్మ పుట్టినరోజున రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, సంవత్సరం గడిచినా పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలేదు ?
కౌలు రైతులకు రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేల చొప్పున ఇస్తమన్నరు. ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామంలో కూడా ఇవ్వలేదు. రైతు భరోసా ఇయ్యలేదు. సంక్రాంతికి రైతు భరోసా పేరుతో, ఇండ్లు కట్టిస్తామని చెబుతూ మరోసారి మాయమాటలు చెబుతోంది. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున సాయం ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తమని చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇయ్యలేదు. నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.
ప్రజలకు ఏం ఒరగబెట్టిందని కాంగ్రెస్ విజయోత్సవాలు, సంబురాలు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషతీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. రేవంత్ రెడ్డి లక్కీ లాటరీతో ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో రాష్ట్రాన్ని ఒక కుటుంబం పాలిస్తే, ఈరోజు మరో కుటుంబం పాలిస్తున్నది. ప్రజలు కోరుకుంటున్నది ఇటువంటి మార్పు కాదు.
గతంలో నియంత పాలన వద్దని, తెలంగాణ సంపదను కొల్లగొట్టి అప్పులపాల్జేసిన కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్ ను గెలిపిస్తే లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నడు. కాంగ్రెస్ పాలన చేసేది ప్రజలను దోచుకోవడానికా..? ప్రజల కోసం పనిచేసేందుకా..?
రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని గెలిపించాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంతవరకు బిజెపి పోరాటం చేస్తుంది.