– కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: ఒడ్డు ఎక్కేదాక ఓడమల్లప్ప.. ఓడ్డెక్కినంక బోడి మల్లప్ప అనేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఆటోడ్రైవర్లకు రూ. 12 వేలు దేవుడెరుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 50 మంది ఆటోడ్రైవర్లు సూసైడ్ చేసుకున్నరు. మహిళలకు రూ. 2500 సాయం అందలేదు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇయ్యలేదు. ప్రభుత్వమంటే సమస్యలు తీరుస్తదని భావిస్తారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో సంవత్సర కాలంగా డ్రామా చేస్తున్నడు.
ఏ బస్తీలో ఎప్పుడు బుల్డోజర్లతో ఇండ్లు కూలగొడుతారేమోననే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలకు బిజెపి అండగా నిలబడింది. రేవంత్ ప్రభుత్వం తీరుతో కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించింది. రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా హైడ్రా, మూసీ, లఘచర్ల.. ఇలా రోజుకో కొత్త నాటకంతో కాలం వెల్లదీసిండు.
సీఎం రేవంత్ రెడ్డికి.. దళితులు, కూరగాయలు పండిస్తూ, వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములు గుంజుకోవాలని ఆలోచనే తప్పితే.. కొత్త ఇండ్లు కట్టించే సంకల్పం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన ఆయనకు లేదు.
పది నెలల్లోనే ప్రజల్లో రేవంత్ ప్రభుత్వం అభాసుపాలైంది. రేవంత్ రెడ్డి.. కేవలం మాటలతో, మీడియా మేనేజ్ మెంట్ తో, అబద్ధపు ప్రచారాలతో బుకాయించే ప్రయత్నిస్తున్నడు తప్పితే ప్రజలకు ఇచ్చిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుంది.