– అమరవీరుల స్థూపం దగ్గరైనా సరే….లేదా లఘచర్ల దగ్గరైనా సరే….
– బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం దోచుకుంటే.. కాంగ్రెస్ పాలనలో డజన్ల కుటుంబాలు దోచుకుంటున్నాయి
– కలెక్టర్ పై దాడి చేసిన రోజే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సింది
– ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలి
– – కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై బిజెపి బహిరంగసభను నిర్వహించడం జరుగుతోంది. ఒక నియంత పాలనకు చరమగీతం పాడితే, తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని, ప్రజల బతుకుల్లో మార్పులొస్తాయని, జీవనవిధానంలో మార్పు వస్తుందన్నారు. విగ్రహాల రూపాలు, పార్టీల జెండాల రంగులు మారుతున్నాయి. కానీ, ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు.
రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లుగా బలిదేవత పుట్టినరోజున… హస్తం గుర్తు ఉండేలా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి, జనం నెత్తిన శఠగోపం పెడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం దోచుకుంటే.. కాంగ్రెస్ పాలనలో డజన్ల కుటుంబాలు దోచుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ పేరుతో కంపెనీలు పెట్టేందుకు భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారు. ఆనాడు ప్రజలు కలెక్టర్ పై దాడి చేసిన రోజే రేవంత్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సింది.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలి. 42 పేజీలతో కూడిన కాంగ్రెస్ మేనిఫెస్టోను ఒక్కసారైన రేవంత్ రెడ్డి చదవాలి. రైతులు, గిరిజన, దళితులు, నిరుద్యోగ యువకులకు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలే. అమరవీరుల స్థూపం దగ్గరకు లేదా లఘచర్ల దగ్గరైనా సరే…. కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించేందుకు సిద్ధమా లేదా..? అనేది రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలి.
కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండూ ఒకేతాను ముక్కలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నరు. ఆనాడు బీఆఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ లో రైతులు, ప్రజలపై లాఠీచార్జ్ చేయించి భూములు గుంజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం లఘచర్లలో ప్రజలపై లాఠీచార్జ్ చేయించి రైతులు, ప్రజల భూములు గుంజుకునే ప్రయత్నం చేసింది.
లఘచర్లలో ప్రజలు తిరుగుబాటు చేసినరోజే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది. 6 గ్యారంటీలు, 66 హామీల వైఫల్యాలను రాష్ట్రంలో వీధివీధినా తెలిపేలా ప్రచారం నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం.