Suryaa.co.in

Andhra Pradesh

విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు విధానాలు

– గవర్నమెంట్‌ స్కూళ్లు నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వ చర్యలు
– విద్యార్ధులకు బకాయిల చెల్లింపులోనూ చంద్రబాబు దుర్మార్గం
– పేద విద్యార్ధుల భవిష్యత్తుపై విషం చిమ్ముతున్న చంద్రబాబు
– ఇన్నీ చేస్తూ ఇప్పుడు మరో డ్రామా. నానా హంగామాతో షో
– విద్యార్ధుల పేరెంట్స్‌తో మెగా మీట్‌ అంటూ ‘దగా మీట్‌’
– వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున

తాడేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళను సర్వనాశనం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున మండిపడ్డారు. పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగు రావాలని గత ప్రభుత్వంలో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసిన పలు కార్యక్రమాలను నిలిపివేస్తూ, పేద విద్యార్ధుల జీవితాల్లో చంద్రబాబు విషం చిమ్మతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థులకు వేల కోట్ల ఫీజు బకాయి పడిన కూటమి ప్రభుత్వం, ఈరోజు విద్యార్దుల తల్లిదండ్రులతో మెగా మీట్‌ అంటూ కొత్త నాటకానికి తెర తీసిందని స్పష్టం చేశారు.

జగన్‌ అభివృద్ధి చేసిన స్కూళ్ళలో కూర్చుని, సీఎం చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. మూడు సార్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడైనా విద్యా రంగాన్ని ఆధునీకరించాలని అనుకున్నారా? కనీస వసతులకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించారా?.

మెగా పేరెంట్స్‌ మీట్‌లో చంద్రబాబు ఏం చెబుతారు? జగన్‌ హయాంలో మీ పిల్లలకు అందించిన ఇంగ్లీష్‌ మీడియంను నిలిపివేశాను అని, సిబిఎస్‌ఈ విధానానికి మంగళం పాడానని, గోరుముద్దను పక్కన పెట్టి నాసిరకం భోజనం పెడుతున్నామని పేరెంట్స్‌కు వివరిస్తారా?.

కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే విద్యార్థులకు రూ.3900 కోట్ల బకాయి పడింది. విద్యార్థులకు ఫీజు చెల్లించడం లేదు. వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు. విద్యాదీవెన కింద రూ.2800 కోట్లు, వసతిదీవెన కింద మరో రూ.1100 కోట్లు బకాయి పడ్డారు. పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహిస్తూ అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చిన చంద్రబాబు, దాన్నీ అమలు చేయడం లేదు.

ఇన్ని దుర్మార్గ పనులతో విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబుకు ఈ రోజు విద్యార్ధుల తల్లిదండ్రులతో మెగా మీట్‌ పెట్టే అర్హత ఉందా?

LEAVE A RESPONSE