Suryaa.co.in

Features

జీయరుకు జేజేలు

ఆధ్యాత్మికతకే జీవితాన్ని
అంకితం చేసిన
ఓ సమతామూర్తి..
తను దైవంగా..
గురువుగా..
సర్వస్వంగా నమ్మి కొలిచిన
రామానుజుని భువిపై
మరోసారి సజీవంగా
అవిష్కరించాలన్న సంకల్పానికి దివ్య రూపం
అదిగదిగో భాగ్యనగరిలో
108 అడుగుల మహారూపంలో..
కట్టెదుట మరో దివ్యక్షేత్రమై..
మనకు తెలిసిన హైదరాబాదు ఇప్పుడు
ఆధ్యాత్మిక జగతిన జిందాబాదుగా..!

ఈ మహక్రతువు సామాన్యులకు సాధ్యమా..
చినజీయరు స్వామి
తానే ఒక సైన్యమై..
మహాశక్తి స్వరూపమై..
దరణిలో దైవత్వానికే
మరో రూపమై..
సంకల్పించి వికల్పం ఎరుగక
అవిశ్రాంత యోధుడై..
సాధించిన ఈ విజయం
కలియుగంలో
ఆధ్యాత్మికతకు పట్టాభిషేకం!

పంచభూతాలకు
ప్రతీకలన్నట్టు
పంచలోహాలతో
నిండైన మూర్తి..
జీయరు పదేళ్లకు మునుపు
కన్న కల..
స్వప్నంలో స్వర్గపురి..
ఎన్నెన్ని ప్రక్రియలు..
ఇంకెన్ని ప్రయోగాలు..
అవిశ్రాంత యాగాలు..
అణువణువూ
జీవం ఉట్టిపడేలా..
కరుణ కురిపించే ఆ కళ్ళు..
ఆశీస్సులు అందించే అభయహస్తం..
అక్కడే రామానుజ సమస్తం..
మెరుస్తూ ఆపాదమస్తకం..
నిజంగా ఉందా
యజ్ఞోపవీతం..
సాక్షాత్తు రామానుజుడే
పునరుజ్జీవుడై..
మానవాళి ఉద్దరణకు
మరోసారి కార్యోన్ముఖుడైనట్టు..!

అక్కడితో అయిందా..
అచ్చోటనే 108 ఆలయాలు..
ఆధ్యాత్మిక నిలయాలు…
జీయర్ వజ్రసంకల్పానికి
నిలువెత్తు సాక్ష్యాలు..
భక్తిరాజ్యస్థాపనే లక్ష్యాలు…
సామాన్యులకు
సాధ్యం కానిది..
దైవాంశసంభూతునికే చెల్లినది..
జీయర్ స్వామి తన చిత్తంతో
తానే శిల్పిగా..
తనదే శైలిగా…
తన హృదయఫలకమే
తొలి వేదికగా..
తన మనోరధమే
ప్రాతిపదికగా..
తానే పధికుడై..రధికుడై..
ఆవిష్కరించిన అద్భుతం..
జగద్గురువుకు అనువైన
గుడి కట్టిన జీయరుకు
ఈ మహత్కార్యంతో
ప్రతి భక్తుని గుండె
ఓ గుడై..
ఆ మహనీయుడు
మరోసారి చరితార్ధుడై..!

భాగ్యనగరిలో
శ్రీ రామానుజస్వామి
విగ్రహస్థాపన
మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా
నిర్వహించిన
శ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ..

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE