చినజీయర్ స్వామి నేడు విజయనగరం జిల్లాలోని గంట్యాడలో ఓ దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయనున్నారు. గ్రామానికి చెందిన చేపల గణేశ్ అంధుడు. చినజీయర్ స్వామి ట్రస్టు ఆధ్వర్యంలోని అంధుల పాఠశాలలోనే చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న గణేశ్ 100 మంది చిన్నారులకు భగవద్గీత కూడా నేర్పించాడు.
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం చినజీయర్ స్వామి గంట్యాడలో గీతా పారాయణం నిర్వహించారు. కాగా, గణేశ్‌కు ఇటీవల ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ఆయన చినజీయర్ స్వామికి చెప్పడంతో శంకుస్థాపన చేసేందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నేటి సాయంత్రం 5 గంటలకు స్వామి తన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు గణేశ్ తెలిపాడు.