(కె. సహదేవ్ )
హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారమని మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తోందా? ఈ దేశంలో చర్చి చరిత్ర చూస్తే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతుంది.
“చర్చిలో మాపై చూపిస్తున్న అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష, మమ్మల్ని పాస్టర్లుగా నియమించకపోవడం, చర్చిలో మాపట్ల అంటరానితనం పాటించడం వంటి సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఇక్కడికి చేరుకున్నాం”
..తమిళనాడు రాష్ట్ర దళిత క్రైస్తవుల విముక్తి ఉద్యమ నాయకుడు మరియా జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే భారతదేశంలో చర్చి నిమ్నవర్గాలపై సాగిస్తున్న కులవివక్ష తీవ్రత అర్ధమవుతుంది.
2020 డిసెంబర్ 3న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి – కడలూరు ఆర్చిడయోస్ కేంద్ర కార్యాలయం వద్ద దళితులుగా పేర్కొనే షెడ్యూల్డ్ కులాలకు చెంది మతంమారిన క్రైస్తవులు భారీ నిరసన చేపట్టారు. కారణం? హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారిన తమకు సామాజికన్యాయం అందకపోవడం. పాస్టర్లు, బిషప్పుల నియామకంలో తమకు అగ్రకుల క్రైస్తవ సమాజం నుండి ఎదురవుతున్న వివక్ష. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ సామాజిక అన్యాయాన్ని ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఎస్సీ క్రైస్తవ సమాజం ఇక లాభంలేదనుకుని ఈ అణచివేతకు నిరసనగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించింది.
భారతదేశంలో చర్చి దృష్టి నిజంగా సామజిక న్యాయం మీదనే ఉందా? లేక కేవలం మతమార్పిడులే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందా? అసలు క్రైస్తవంలోకి మారిన వ్యక్తుల సామజిక అభివృద్ధికి చర్చి కనీసం ప్రయతిస్తోందా? అన్నవి కీలకమైన ప్రశ్నలు.
2008లో తమిళనాడులోని ఎరైయూర్ పట్టణంలో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన క్రైస్తవుల మధ్య జరిగిన గొడవ హింసాత్మక ఘటనలకు దారితీసింది. చర్చిలో అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష, అంటరానితనంతో విసిగిపోయిన ఎస్సీ క్రైస్తవులు తమకు తాము సొంతంగా చర్చి ఏర్పాటు చేసుకున్నారు. తమ చర్చిని అధికారికంగా గుర్తించాలని ఆర్చిడయాసిస్ ను అభ్యర్ధించారు. దీంతో మొదలైన గొడవ పోలీసుల కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఆ ప్రాంతంలోని అనేక చర్చిలకు ఎస్సీ క్రైస్తవులు తాళాలు వేసి మూసివేశారు.
2011లో చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని తాచూర్ గ్రామంలో క్రైస్తవుల్లోని అగ్రకుల, నిమ్న కులాల ప్రజల మధ్య తీవ్ర అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఎస్సీ వర్గానికి క్రైస్తవుడి పార్ధివదేహాన్ని అగ్రకుల క్రైస్తవుల శ్మశానవాటికలో ఖననం చేసేందుకు ప్రయత్నించగా రెడ్డి కులానికి చెందిన క్రైస్తవులు అడ్డుకున్నారు. ఈ అంశంపై ది ఫ్రంట్-లైన్ ప్రచురించిన కథనం ప్రకారం వారి చర్చి నిర్మాణం నక్షత్రాకారంలో ఉంది. ఇందులో మధ్య భాగంలో కూర్చునే అర్హత ఆ చర్చిని నిర్వహిస్తున్న రెడ్డి క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉండే కోణాల ఆకృతిలో ఉన్న మూలల్లో మాత్రమే అరుంధతీయార్లు, ఆది ద్రావిడర్లు మొదలైన వర్గాలకు చెందిన దళిత క్రైస్తవులు కూర్చుని ప్రార్ధనల్లో పాల్గొనాలి. వీరికి చర్చి నిర్వహణలో ఎలాంటి పాత్ర లేదు.తిరుచ్చిలోని ఇదే రీతిలో నిర్మింతమైన మరో శ్మశాన వాటికలో అగ్రవర్ణ, దళిత క్రైస్తవుల కోసం మధ్యలో ఓ విభజన గోడ ఏర్పాటు చేశారు.
‘విభజించి పాలించడం’ అనేది నైజంగా కలిగిన చర్చి నిజానికి కులపరమైన వివక్ష, అంటరానితనం వంటి పద్ధతులను 400 ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ 400 ఏళ్లుగా భారతదేశంలో చర్చి సామాజిక అంశాలకు కాకుండా కేవలం మతమార్పిళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ‘కుల వివక్ష నుండి విముక్తి’ సాకుతో మతమార్పిళ్లు సాగిస్తూ నిమ్నవర్గాల వారిని మతపరంగా వంచనకు గురిచేస్తోంది.
భారతదేశానికి వచ్చిన తొలితరం క్రైస్తవ మతాధికారులు ఐరోపాకు చెందినవారు. 16వ శతాబ్దం నాటి ఐరోపా సమాజంలో సమతుల్యత అనేది ఉండేది కాదు. ఆనాటికే ఐరోపా సమాజంలోని అనేక వర్గాలు క్రైస్తవం కారణంగా బహిష్కరించబడ్డాయి. ఇందుకు 600-800 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన రోమా జిప్సీల చరిత్రే ఒక ఉదాహరణ. ఇప్పటికీ అక్కడ భారీ హింస, దాడుల ద్వారా వారిపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనీసం 15 లక్షల మంది రోమాలను జర్మన్ నియంత, రోమన్ క్యాథలిక్ అయిన హిట్లర్ నాజీ పాలనలో చంపారు.
యూరపులోని కాగోట్ వర్గ ప్రజలను బహిష్కృతులుగా పరిగణించేవారు. వారిని గ్రామాలలోకి రానివ్వకుండా ఊరి పొలిమేరలోనే ఉంచేవారు. దాదాపు 700 సంవత్సరాలుగా విద్వేషపూరిత వివక్షకు గురయ్యారు. వీరిని కుష్ఠురోగులు అనో, అన్యమతస్థులనో, నరమాంస భక్షకులుగా ముద్రవేసి దూరంగా ఉంచేవారు. వారికి వడ్రంగి, కసాయి లేదా ఉరితీసేవారి వృత్తులను మాత్రమే అనుమతించారు. అనేక సందర్భాల్లో వారిని చర్చిలో ప్రార్థనలకు అనుమతించేవారు కూడా కాదు. ఒకవేళ అనుమతిస్తే అందరితోపాటు కాకుండా చర్చిలోనే ఒక మూల దూరంగా కూర్చునేవిధంగా ఏర్పాటు చేసేవారు. ఒక పెద్ద కర్రకు తినుబండారం కట్టి దాన్ని వారికి అందించేవారు. వారు బాతు లేదా అటువంటి పక్షి పాదాన్ని పోలిన ఎరుపురంగు చిహ్నం మెడలో ధరించాలనే నియమం ఉండేది. చర్చిలోకి ప్రవేశించడానికి అందరితోపాటు కాకుండా వారికి వేరే ద్వారం ఉండేది.
భారతదేశంలో చర్చి క్రూర స్వభావం:
క్రైస్తవేతరులను బహిరంగంగా ఉరితీయడం అధికారిక శిక్షగా, క్రైస్తవులు కాని ప్రజల పట్ల వివక్ష పాటించి, క్రైస్తవేతర స్త్రీలను మంత్రగత్తెల నెపంతో కిరాతకంగా హతమార్చే శిక్షలవంటి హేయమైన దురాచారం నాటి యూరప్ సమాజంతో అధికారికంగా అమలులో ఉండేది. దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం ఓ మహిళను మంత్రగత్తె నెపంతో మరణశిక్ష విధించి చంపిన ఆఖరు ఘటన 1727లో స్కాట్ లాండ్ దేశంలో చోటుచేసుకుంది. అయితే క్రైస్తవేతరులను శిక్షల పేరిట అధికారికంగా చంపటం మాత్రం 1826 వరకూ కొనసాగింది.
తొలితరం యూరొపియన్ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో కాలుమోపే నాటికే అక్కడి సమాజంలో క్రైస్తవేతర విశ్వాసాల పట్ల తీవ్రమైన అసహనం, సామాజిక వివక్ష వంటి లక్షణాలు అంతర్భాగాలుగా ఉండేవి. భారతదేశంలో సమసమాజ స్థాపన లక్ష్యం అని నిత్యం ఊదరగొట్టే మిషనరీలు, తమ క్రైస్తవ సమాజం విషయంలోనే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు. తమ ఏకైక లక్ష్యమైన మతమార్పిడికి అనుకూలంగా హిందూ సమాజంలో కుల విభజనలను సృష్టించి, ఆ విభజనను తమకు అనుకూలంగా మలచుకున్నారు. అలాంటి ఒక క్రైస్తవ మిషనరీనే రాబర్ట్ డి నోబిలి.
వంచన, మోసపూరిత మార్గాల ద్వారా హిందువుల మతమార్పిళ్లు:
హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి, భారతదేశంలో క్రైస్తవ మతాన్ని విస్తరించడానికి రాబర్ట్ డి నోబిలి చేసిన ప్రయత్నాలు యూరోపియన్లు సాగించిన అనైతిక పద్ధతులకు ఒక ఉదాహరణ. 1577లో ఇటలీలో జన్మించిన రాబర్డ్ డి నోబిలీ 1605లో ‘సొసైటీ ఆఫ్ జీసస్’ తరఫున క్రైస్తవ మిషనరీగా భారతదేశంలో అడుగుపెట్టి, అనంతరం 1606లో మధురై ప్రాంతానికి చేరాడు. అప్పటికే హిందువులను మతం మార్చచడానికి పాటిస్తున్న పద్ధతులు ప్రభావవంతంగా లేవని గ్రహించి, నూతన మోసపూరిత మార్గాలను కనుగొన్నాడు. ఇందుకోసం కాషాయ వస్త్రాలు ధరించాడు. కేశఖండన చేయించుకుని, శిఖ ధరించాడు. పావుకోళ్ళు (సన్యాసులు ధరించే చెక్కతో చేసిన పాదుకలు) ధరించాడు. తనను తాను ‘తత్వ బోధగర్’ అని పిలుచుకున్నాడు. పవిత్ర యజ్ఞోపవీతం ధరించి తనను రోమన్ బ్రాహ్మణుడిగా ప్రచారం చేసుకున్నాడు. బైబిల్ వేదం అయ్యింది, చర్చి ‘కోయిల్’ (హిందూ దేవాలయానికి తమిళ పదం) అయింది, పాస్టర్ ‘గురువు’ అయ్యాడు. సంస్కృత, తమిళ, తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించిన రాబర్ట్ డి నోబిలి, తాను బోధించేది హిందూమతపు మరొక శాఖ అని అమాయక హిందువులను నమ్మించాడు. దీంతో హిందువులు పెద్ద సంఖ్యలో అతడి మోసాల బారినపడ్డారు. పరమేశ్వరుడు ఋషీశ్వరులకు కాకుండా దేవుని ఏకైక కుమారుని దూతకు మాత్రమే బోధించిన మరో వేదశాఖకు తాను ప్రచారకుడినని ప్రజలను నమ్మించాడు. క్రైస్తవ మతాన్ని ‘పరాంగుయ్ కులం’ (పరాంగుయ్ = ఫిరంగి లేదా విదేశీ)గా పరిచయం చేశాడు.
రోమన్ బ్రాహ్మణుడిగా నమ్మించే రాబర్ట్ డి నోబిలి తన మతమార్పిడి కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా కులవివక్షను పాటించడం మొదలుపెట్టాడు. ఎంతగా అంటే, ఒక పండారాస్వామి వర్గానికి చెందిన క్రైస్తవుడు అనారోగ్యానికి గురైతే, రాబర్ట్ డి నోబిలి అతడిని కనీసం చూడటానికి కూడా నిరాకరిస్తాడు. తన తోటి జెసూట్ మతాధిపతులు ఎవరూ చూడకుండా రాత్రి సమయంలో మాత్రమే కలుసుకునేవాడు.
రాబర్ట్ డి నోబిలి అనైతిక కార్యకలాపాలకు పోప్ ఆమోదం!:
కులాల ఆధారంగా మిషనరీ వ్యవస్థ, చర్చిలు ఏర్పాటు చేయడం, మతమార్పిళ్ల కోసం హిందూ ధార్మిక సాంప్రదాయాలు కాపీ కొట్టడం వంటి విషయాలు ఆనాటి చర్చి వర్గాల దృష్టికి వచ్చింది. ఈ విధానాలపై అతడికి వ్యతిరేకంగా న్యాయ విచారణ (ఇంక్విజిషన్) ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో అతడికి అప్పటి గోవా ఆర్చి బిషప్ మెంజెస్ నుండి మద్దతు లభించింది.
31 జనవరి 1623 నాడు అనూహ్యంగా రాబర్డ్ డీ నొబిలి అనైతిక క్రైస్తవ మతమార్పిళ్లకు క్రైస్తవ మఠాధిపతి అయిన అప్పటి పోప్ గ్రెగరీ XV నుండి అధికారిక ఆమోదం లభించింది. హిందువులను మభ్యపెట్టి క్రైస్తవంలోకి మార్చే పద్దతి ఊపందుకుంది. అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమిటంటే, పోప్ ఆమోదంతో చర్చిల్లో క్రైస్తవ ఉపనయనాలు పేరిట క్రైస్తవ యజ్ఞోపవీతధారణల ద్వారా మతం మార్చే ప్రక్రియ మొదలైంది.
ఈ అంశంలో పోప్ గ్రెగరీ XV తన అనుమతి పత్రంలో ఈ క్రింది నియమాలు పొందుపరిచాడు:-
– క్రైస్తవ ఉపనయనాలకు ఉపయోగించే యజ్ఞోపవీతాలు హిందూ పూజారుల నుండి స్వీకరించకూడదు. క్యాథలిక్ మఠాధిపతుల నుండే స్వీకరించాలి.
– క్రైస్తవ ఉపనయన సమయంలో బైబిల్ వాక్యాలు పఠించాలి.
– పాగన్ల మంత్రాలూ, శ్లోకాలు పఠించకూడదు, కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయకూడదు.
– క్రైస్తవంలోని తండ్రి, కుమారుడు, పవిత్రాత్మలను సూచించే విధంగా యజ్ఞోపవీతం కేవలం 3 దారపు పొరలనే కలిగివుండాలి.
– క్రైస్తవంలోకి మారకముందు అప్పటికే యజ్ఞోపవీతం ధరించినట్లైతే ఆ పాతదాన్ని కాల్చివేసి కొత్తది క్యాథలిక్ మఠాధిపతి నుండి స్వీకరించి, క్రైస్తవ ఉపనయన పద్దతిలో ధరించాలి.
..ఈ విధంగా, హైందవ గ్రంథాల్లో లేని, హిందూ ధర్మం ఏరూపంలోనూ ఆమోదించని, కేవలం ఆచారదోషమైన అంటరానితనానికి క్రైస్తవమత అత్యున్నత అధికారి, అధిపతి ఐన పోప్ ఆమోదముద్ర వేసి, సైద్ధాంతికంగా అంటరానితనాన్ని క్రైస్తవంలో అంతర్భాగం చేశాడు. కేవలం మతమార్పిడే ప్రధాన ఉద్దేశంగా పనిచేసే చర్చికి సామజిక న్యాయం, సమాజ సంస్కరణ అనేవి ప్రాముఖ్యత లేని అంశాలు అనటానికి ఇదే నిదర్శనం.
ఇంతకీ రాబర్డ్ డి నోబిలీ చర్యలపై ఏర్పాటైన క్రైస్తవ న్యాయవిచారణ (ఇంక్విజిషన్) కమిటీ నిర్ణయం ఏమిటో మనం తెలుసుకోలేదు కదూ! ఈ క్రింది వాక్యాలతో విచారణ ముగిసిపోయింది.
“మన పవిత్ర క్రైస్తవమతం భారతదేశంలో వ్యాప్తిచెందడానికి వీలుకల్పించే ప్రక్రియలో భాగంగా, మతప్రచారం, మతమార్పిడి కోసం అక్కడి బ్రాహ్మణులు మరియు ఇతరులు ధరించే హిందూ సాంప్రదాయ చిహ్నాలనే ఆధారం చేసుకోవడాన్ని మేము పూర్తిగా సమర్థిస్తాము.”
రాబర్ట్ డి నొబిలి రెండు భిన్నమైన క్రైస్తవ మతప్రచారకులు సృష్టించాడు. ఒకరు బ్రాహ్మణ వేషధారణ కలిగినవారు, మరొకరు పండార స్వాములు. పండార స్వాములు నిజానికి శైవ సిద్ధాంత ప్రచారకులు. మతం మారిన వీరి ద్వారా నిమ్నకులాల వారికి మాత్రమే క్రైస్తవ మత ప్రచారం చేయించేవాడు. ఈ పండార స్వాముల వరుసలో మొదటి మత ప్రచారకులు ఫాదర్ బల్తాజార్ డా కోస్తా, ఇమ్మానుయే అల్వారెజ్.
బ్రాహ్మణ వేషధారణలో ఉన్న క్రైస్తవ మత ప్రచారకులు జంధ్యం, శిఖ ధరించి హిందువులలో అగ్రకులాల వారి మధ్య క్రైస్తవ ప్రచారం చేసేవారు. ఈ కోవలో మొదటి క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ ఎస్ మాయా. రాబర్ట్ డి నొబిలి ఎప్పుడు రాజ కుటుంబీకులు, సంస్థానాధిపతులు, బ్రాహ్మణులను కలవటానికి వెళ్లినా ఫాదర్ ఎస్ మాయాని వెంటపెట్టుకెళ్ళేవాడు. ఇలాంటి సందర్భాలలో రాబర్ట్ డి నొబిలి జంధ్యం, కాషాయ వస్త్రాలు ధరించి, శిష్యులు కమండలం, ఛత్రం (గొడుగు), జింక చర్మం మోసుకొచ్చేవారు. పండార స్వామి వర్గానికి చెందిన మత ప్రచారకులను వెంట తీసుకెళ్లేవాడు కాదు.
అత్యంత విస్మయకరమైన రీతిలో రాబర్ట్ డి నొబిలి ప్రత్యేకంగా రూపొందించి నిర్మించిన చర్చి నిర్మాణ నమూనా చూస్తే మానవత్వం సైతం తలదించుకుంటుంది. ఆరోజుల్లోనే చర్చిలోని అంటరానితనం, కులం ఎంత బలంగా వేళ్ళూనుకున్నాయో అర్ధమవుతుంది. చర్చి ప్రధాన ద్వారం గుండా అగ్రవర్ణ క్రైస్తవులు మాత్రమే ప్రవేశించాలి. నిమ్నవర్గాల క్రైస్తవులు ప్రవేశించేందుకు మరో ఇతర మార్గం ఉంటుంది. కేవలం ప్రవేశం విషయంలోనే కాదు, చర్చిలో కూర్చునే ప్రదేశం, పాపక్షమాపణ గది, వంటగది నుండి చివరికి చనిపోయినవారిని పూడ్చిపెట్టే శ్మశానంలో కూడా కులాలవారీగా విభజించి, అత్యంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేశాడు. చర్చిలోని ప్రధాన హాలులో అగ్రవర్ణ క్రైస్తవులు, నిమ్నవర్గ క్రైస్తవులకు మధ్య ఒక గోడ ఏర్పాటు చేసి, అక్కడ ఫాదర్ చెప్పే బైబిల్ వాక్యాలు, వ్యాఖ్యానాలు ఆ గోడకు ఏర్పాటు చేసిన జాలీ ద్వారా నిమ్నవర్గ క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొనాలి. ఎదురుగా కూర్చుని వినటానికి కూడా అనుమతి ఉండేది కాదు. ఇంకా అతిదుర్మార్గమైన పద్ధతిలో నిమ్నవర్గాల క్రైస్తవులను రాత్రిపూట చీకటిలో చర్చి వెలుపల నిలబెట్టి ప్రార్ధనలు జరిపించి, మహాప్రసాదవినియోగము చేసి పంపించేసేవారు.
కుల వ్యవస్థ పట్ల, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల పట్ల కువిమర్శలు చేయడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రపంచ దేశాల క్రైస్తవులు.. కులం, విభజనవాదం, అంటరానితనం వంటి హేయమైన పద్ధతులకు తమ మతాధిపతి అయిన పోప్ అధికారికంగా ఆమోదముద్ర వేసిన విషయం మాత్రం గుర్తించరు. కొన్నితరాల క్రితమే హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారినప్పటికీ క్రైస్తవులు తమ పేర్ల చివర ఇప్పటికీ హిందూ కులపేర్లను కలిగి ఉండటాన్ని చర్చి అడ్డుచెప్పకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ, 4వ తరాల క్రైస్తవులు కూడా తమ పేర్ల చివర రెడ్డి, చౌదరి వంటి కులాల పేర్లు కలిగివుండటం గమనించవచ్చు.
ఈ 21వ శతాబ్దంలో కూడా పైన పేర్కొన్న మరియా జాన్ వంటి దళిత క్రైస్తవులు సమానహక్కులు, అవకాశాల కోసం వీధికెక్కి పోరాటం చేస్తున్నారంటే కారణం సామాజిక న్యాయం ముసుగులో సామాజిక రుగ్మతలను అవకాశంగా తీసుకుని చర్చి జరుపుతున్న మతమార్పిళ్లే.
(రచయిత సామజిక కార్యకర్త మరియు ఆధునిక భారతీయ చరిత్ర పరిశోధకులు)
– విఎస్‌కె తెలంగాణ సౌజన్యంతో