– ప్రజా రాజధాని అమరావతి సాధన కోసం ఉధ్యమిస్తున్న రైతులపై జగన్ రెడ్డి ఉక్కుపాదం
– వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని హింసించడమే సీఐడీ అజెండానా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్రంలోని సీఐడీ కార్యాలయాలు అండమాన్ జైలుల్లా మారాయి. వెయ్యి రోజులుగా అకుంఠిత దీక్షతో అమరావతి సాధన కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోంది. అమరావతి నుండి అరసవిల్లి వరకు రైతులు, మహిళల మహా పాదయాత్ర సఫలీకృతం కావాలి. రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోంది. ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతలు ముఖ్యమంత్రిలో అసహనాన్ని పెంచుతున్నాయి. ప్రజల పక్షాన నిలబడే నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని వ్యవస్థల్ని ఉపయోగించి ప్రజాపక్షాన నిలబడేవారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
ఈ మూడున్నరేళ్లల్లో ఒక ఎత్తైతే.. ఈ మధ్య కాలంలో అధికమైంది. పదింతలు పెరిగింది. కక్ష సాధింపుకు పాల్పడుతూ పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. పబ్లిక్ డొమైన్ లో ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రజల పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడినా వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. గతంలో అరెస్టులు మాత్రమే చేసేవారు. ప్రస్తుతం అరెస్టులు చేసి భౌతిక దాడులకు దిగుతున్నారు. సీఐడీ కార్యాలయంలో భౌతిక దాడులు అధికమయ్యాయి. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మొదలుకొని టీడీపీ నాయకుడు వెంగళరావు వరకు ఇదే పంథా కొనసాగిస్తున్నారు. కేసులకు భయపడడం లేదని భౌతిక దాడులకు తెగబడుతున్నారు. కొట్టి నోరు మూయించాలనే ప్రయత్నాలు అధికమయ్యాయి. ఎంత హింసించినా పసుపు సైనికులెవరూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోపై నారా లోకేష్, చింతకాయల విజయ్ పై ఎందుకు కేసులు పెడతారో చెప్పాలి. టీడీపీ, ఇతర పార్టీ మహిళలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖకు ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు చర్యలు లేవు.
డర్టీ పిక్చర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ను విచారించిన దాఖలాలు లేవు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లు అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తుంటే టీడీపీ అడ్డుకోవడం తప్పా? వైసీపీ హయాంలో మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించడం షరా మామూలైంది. కేసులు పెట్టి సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి హింసించే కుట్రలు జరుగుతున్నాయి. స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ పాలకులపై గట్టిగా ఉద్యమించేవారిపై అండమాన్ జైలుకు తీసుకెళ్లి బ్రిటీష్ పాలకులు చిత్రహింసలకు గురి చేసేవారు. నేడు అదే విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కార్యాలయం ఒక అండమాన్ సెల్యూలార్ జైలులా మారిపోయింది.
ప్రభుత్వాన్ని ఎవరు గట్టిగా నిలదీస్తున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతున్నారో వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదో ఒక రకంగా వారిని అదుపులోకి తీసుకొని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి భౌతికదాడి చేసి హింసిస్తున్నారు. సీఐడీ డిపార్టుమెంటు ఇదే అజెండాగా పెట్టుకుంది. ఇలాచేస్తే వారి ప్రతిష్ట పెరగదు. మమ్మల్ని కూడా అరెస్టు చేసి సీఐడీ కార్యాలయాలకు తీసుకెళ్లొచ్చు, మాపై కూడా భౌతికంగా దాడులు చేయొచ్చుకానీ వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఎన్ని కుట్రలు పన్ని మా నాయకులపై దాడులు చేసినా ఎవరూ నోరు మూసుకొని కూర్చొనే పరిస్థితి ఉండదు. ఎవరూ వెనకడుగు వేసేదిలేదని పోలీసులకు, సీఐడీ డిపార్టుమెంటుకు తెలియజేస్తున్నాం.
సెంట్రల్ ఫోర్నసిక్ ల్యాబ్ కు పంపాల్సిన గోరంట్ల మాధవ్ డర్టీ వీడియోను పంపలేదు. మేం ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయిస్తే అందులో ఎటువంటి ఎడిటింగ్ జరగలేదని రిపోర్టులు వచ్చాయి. ఏ ఆధారంతో ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పగలరు? ఇది తెలుగుదేశం కుట్ర అని ఎలా చెబుతారు? అడిషనల్ డీజీపీ ఆ రోజు ప్రెస్ మీట్ లో వారికి మెయిల్ లో పంపిన రిపోర్టును ఎందుకు బట్టబయలు చేయలేదు? రిపోర్టును పబ్లిక్ డొమైన్ లోకి ధైర్యంగా రిలీజ్ చేశాం. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఆ వీడియో ఎడిటింగ్ జరగలేదని ఉంది. మేం అడిగినవాటికి మీ వద్ద సమాధానం ఉండదు, మీరు మాపై కేసులు పెడతారు. మేం వాస్తవాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నాం. చట్ట విరుద్ధంగా, అక్రమంగా ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. వెనక్కి తగ్గేదిలేదు.
ఎవరైతే ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతున్నారో 5స్టార్ కేటగిరిలో ఉన్న వ్యక్తులను అంతమొందిస్తారంట, ఫోర్ స్టార్ వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టులు చేసి భౌతికంగా వారిని హింసిస్తారు, త్రీస్టార్ వ్యక్తులపై కేసులు పెట్టి హింసిస్తారు అని మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు మీడియా సమావేశంలో చెప్పారు. సీఐడీ దీనిపై దర్యాప్తు చేయరా? అధికార పార్టీకి కొమ్ముకాయడం తప్ప వేరే పనేమీ లేదా? ప్రతిపక్ష పార్టీ నాయకుల ప్రాణాలంటే పోలీసులకు విలువే లేదు. లిస్టులు సర్క్యులేట్ అవుతున్నాయి.
పట్టాభిరామ్, చింతకాయల విజయ్, నాదెండ్ల బ్రహ్మం, బండారు వంశీకృష్ణ, బొబ్బూరి వెంగళరావు ఇలా అనేకమంది మా పార్టీ నాయకుల పేర్ల లిస్టు వెలువడింది. దీనిపై పోలీసులు దర్యా్ప్తు చేయరా? చర్యలు తీసుకోరా? ఇలా జాబితాలు విడుదల చేస్తే మేం భయపడం. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. వెనకడుగు వేసేదిలేదు. పెట్టిన సెక్షన్ లు చాలక మనీ ఎగ్జార్స్ మెంట్ సెక్షన్లు పెడతారట. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. మనీ ఎగ్జార్స్ మెంట్ సెక్షన్లు ఎందుకు? డబ్బుకు లొంగేవారమైతే ఇన్నాళ్లు ప్రాణాలకు తెగించి పోరాటం చేసే వాళ్లం కాదు. టీడీపీ నాయకులు చిల్లర పైసలకు అమ్ముడుబోయే వ్యక్తులు కాదు. ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తాం. యాంటీ కరప్షెన్ బ్యూరోను తీసుకొస్తాంటున్నారు.
వైసీపీ నాయకులు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం పొరపాటు. మనం యూనిఫారం ఎందుకు వేసుకున్నాం, మనం ఎలాంటి పనులు చేస్తున్నామని పోలీసులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ప్రజల్లో గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదు. చట్టబద్దంగా ఎదుర్కొని తీరుతాం. వైసీపీ సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను బేస్ గా చేసుకొని ఒక అసభ్యకరమైన వీడియో మార్ఫింగ్ చేశారు. నా గౌరవానికి భంగం కలిగేలా వీడియో తయారుచేశారు. చిన్న పిల్లవాడిని అడిగినా ఇది మార్ఫింగ్ వీడియో అని చెబుతాడు. దీనిపై చర్యలు తీసుకోరా? వైసీపీ వారికేనా గౌరవ ప్రతిష్టలు? మాకు ఉండవా? ఇలాంటి పనులతో సీఐడీ డిపార్టుమెంటు, రాష్ట్ర డీజీపీల ప్రతిష్ట దిగజారుతుందే తప్ప, గౌరవం పెరగదు. సీఎం ఒత్తిడికి తలొగ్గి వైసీపీ నాయకులు, అధికారులు తమ పంథా మార్చుకోవాలి. పోలీసుల ఇలాంటి చర్యల వల్ల మాలో పట్టుదల పెరుగుతుందే తప్ప తరగదు.