ఉత్తరాంధ్రలో వైసీపీ భూకబ్జాల్ని ప్రశ్నిస్తున్నారనే అయ్యన్న పాత్రుడిపై కక్ష్యసాధింపులు
-సీఐడీ పోలీసులు వైసీపీ వాలంటీర్లులా మారారు
-అయ్యన్న ఒంటిపై ఒక్క దెబ్బపడినా వేలాదిమంది కార్యకర్తలతో రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లన్నీ ముట్టడిస్తాం
– కావలి గ్రీష్మ
ఉత్తరాంధ్రలో వైసీపీ భూకబ్జాలు, అరాచకాల్ని ప్రజల తరపున అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నారనే వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ద్వజమెత్తారు. శుక్రవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…….
సీఐడీ పోలీసుల పేరుతో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో 200 మంది అర్దరాత్రి మద్యం తాగి వచ్చి తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యుల్ని బెదిరించి అయ్యన్నపాత్రుడిని బలవంతంగా తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యన్న పాత్రుడు అరెస్టు ఉత్తరాంధ్ర బీసీలపై జరుగుతున్న దమణకాండకు నిదర్శనం. వైసీపీ భూ కబ్జాలపై గొంతెత్తి బలంగా ప్రశ్నిస్తున్నారనే అయ్యన్న కుటుంబాన్ని వేధిస్తున్నారు. చింతకాయల విజయ్ పై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ నేతల్ని చూసి జగన్ రెడ్డి పిల్లిలా భయపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి రోజూ బ్లాక్ డే నే.
వివేకా హత్యపై సీఎం చెల్లెలు షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అయ్యన్నను అక్రమంగా అరెస్టు చేశారు. సీఐడీ రోజు రోజుకీ దిగజారి వ్యవహరిస్తోంది, వైసీపీ వాలంటీర్లులా పోలీసులు మారారు. వైసీపీ పాలనలో రేపిస్టులు, శాడిస్టులు, ఎర్ర చందనం స్మగ్లరు, దొంగలు ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.
అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? రాత్రి పూట కార్యకర్తలు, ఎవరూ ఉండరనే అరెస్టులు చేస్తున్నారు. సీఐడీ, పోలీసు వ్యవస్ధలను తమ గుప్పిట్లో ఉంచుకోవటం తాత్కాలికమన్న విషయం అని జగన్ రెడ్డి, వైసీపీ నేతలు గ్రహించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి అండ్ కో, జగన్ రెడ్డికి తొత్తుల్లా మారిన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు. అయ్యన్న పాత్రుడి మీద, ఆయన కుమారుడు రాజేష్ ఒంటిపై ఒక్క దెబ్బపడినా ఊరుకునే ప్రసక్తే లేదు. వేలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లన్నీ ముట్టడిస్తాం. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుడిని, రాజేష్ ని వెంటనే విడుదల చేయాలని కావలి గ్రీష్మ డిమాండ్ చేశారు.