ఏంటో..ఈ సినిమా నటుల వెంట పడటం…!?
భారతీయ జనతా పార్టీ..
గత రెండు ఎన్నికలలో జాతీయ స్థాయిలో మునుపు ఏ పార్టీ కూడా సాధించలేనంత స్థాయిలో విజయభేరి మ్రోగించి ఎనిమిదేళ్ళ అప్రతిహత పాలన పూర్తి చేసుకుని మరో రెండేళ్లలోపు జరగబోయే ఎన్నికల్లో మూడో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న పెద్ద పార్టీ కేవలం కొన్ని చిన్న ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ ఇలా సినిమా నటుల వెంటపడటం ఏమిటో..ఎంత కాదనుకున్నా వెగటుగా..ఎబ్బెట్టుగా అనిపించడం లేదూ..!
మొన్న చిరంజీవిని మోడీ కలిశారు..ఎక్కడ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపై.. అది ఓకే..నిజానికి ఆ వేదికపై ఉండాల్సింది సూపర్ స్టార్ కృష్ణ..ఎందుకంటే అల్లూరి జీవిత చరిత్ర ఆధారంగా 1973..74 లోనే సినిమా నిర్మించి కొన్ని తరాలకు ఆ మహావీరుని కథని తెలియజెప్పిన ఘనత కృష్ణది..ఆయనను ఆ సభకు పిలిచారో లేదో తెలియదు. పిలిచి ఉంటే అనారోగ్యం.. వయోభారం కారణంగా కృష్ణ హాజరు కాలేకపోయినా కొడుకు మహేష్ బాబునైనా పంపి ఉండేవారేమో.. సరే..కృష్ణని పక్కన పెట్టి చిరంజీవిని పిలవడం.. ఆయన వచ్చి వేదికపై హంగామా చేయడం జరిగింది… చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి పదవిని కూడా నిర్వహించారు.కనుక చిరంజీవితో మోడీ భేటీ అన్నది ‘కర్టసీ’ అని సరిపెట్టుకుందాం.
బిజెపి అక్కడితో ఆగలేదు..
సినిమా నటుల్ని కలిసే పరంపరను కొనసాగిస్తూనే ఉంది..అందులో భాగంగానే పార్టీ అత్యున్నత వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ నటన నచ్చి..మెచ్చి షా ఆయన్ని కలిసారన్నది బిజెపి వివరణ. అది సామాన్యుడికి కూడా నమ్మశక్యం కాని విషయం. అదే ఆర్ ఆర్ ఆర్ లో అంతే బాగా నటించిన రామ్ చరణ్ ను హోం మంత్రి ఎందుకు పిలవలేదో మరి.ఆయన ఎన్టీఆర్ అంత బాగా నటించలేదని అనుకోవాలా.. ఆయన అభినయం హాం మంత్రిని మెప్పించలేదని భావించాలా..!
ఆ చర్చ పక్కన బెడితే షా చేసిన ఈ ప్రయత్నంలో రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు..మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడు. ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీ తరపున కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి.అయితే జూనియర్ రామారావు సినీ ప్రయాణం ఇంకా చాలాకాలం సాగాల్సి ఉంది.. ఆ ఉద్దేశంతోనే ఆయన రాజకీయ ప్రవేశం వార్తల్ని కూడా ముందు నుంచి ఖండిస్తూ వస్తున్నారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తన తాత పార్టీకి మళ్లీ పూర్వ వైభోగం తెచ్చే బాధ్యతను తలకెత్తుకుంటారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన బిజెపిలో చేరడం అనేది అంత సులువుగా సాధ్యపడే విషయం కాదు..మరి బిజెపి ఆలోచనలు ఎలా ఉన్నాయో..! ఇక్కడి వరకు బానే ఉందనుకున్నా ఇంకా చాలా మంది హీరోలు..చిన్న నటులు కూడా బిజెపి ప్రాధాన్యతా జాబితాలో ఉండడం మరీ ఆశ్చర్యకర సమాచారం.జనాల్ని ఆకర్షించే హీరోలను ఆకర్షించే ప్రయత్నాలు బిజెపి వంటి పార్టీ చెయ్యడం ఆ పార్టీ చతురత అనుకోవాలా.. దక్షిణాదిలో పట్టు కోసం చేస్తున్న దిగజారుడు ప్రయత్నమని సరిపెట్టుకోవాలా..!
పవనాలు చాలవా..?
నిజానికి..ఇప్పటికే బిజెపి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంతటి పెద్ద హీరో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వరకు బిజెపి..పవన్ పార్టీతో కలిసి పని చేస్తుందనేది ఇంచుమించు ఖరారైన విషయం..ఇంకా కొంత మంది చోటా మోటా సినిమా నటులు కూడా బిజెపి సాహచర్యంలో ఉన్నారు. మరింత మంది నటులను తెచ్చుకునే ప్రయత్నంలో బిజెపి తలమునకలై ఉంది. ఈ జాబితా వచ్చే ఎన్నికల నాటికి ఎంతకు పెరుగుతుందో మరి..!
నటభారతం!
కథ మరీ పొడుగైపోతున్నా దేశ రాజకీయాల్లో సినిమా నటుల పాత్ర గురించి టూకీగా ప్రస్తావించక తప్పడం లేదు.
భారతదేశ రాజకీయ యవనికపై సినిమా తారల వెలుగుజిలుగుల గురించి మాటాడాలంటే ప్రధానంగా ముగ్గురే సూపర్ స్టార్లు..
మొదట ఓ వెలుగు వెలిగింది తమిళ సూపర్ హీరో ఎం జి ఆర్..తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు..పిదప జయలలిత..!
వారి విజయ పరంపర అందరికీ తెలిసిందే..
ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించదలచకోలేదు.
కానీ ఆ ముగ్గురి తర్వాత భారత రాజకీయాల్లో సినిమా నటుల ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.
ప్రధానంగా ఆ ముగ్గురి ప్రభావంతో అటు తమిళనాడులో..ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే గాక దేశంలో చాలా రాష్ట్రాల నుంచి నటులు రాజకీయాల్లో తమ లక్కును పరీక్షించుకున్నారు.ఎన్టీఆర్ ఒక వెలుగు వెలిగిన సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఇంచుమించు రెండుగా చీలిపోయినంత పరిస్థితులు దాపురించాయి.
ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ..జమున వంటి వారు కాంగ్రెస్ లో చేరారు.
అదో సీజన్..
నిజానికి ఎన్టీఆర్ ప్రయోగం తర్వాత మళ్లీ ఏ నటుడూ కూడా అంత స్థాయికి వెళ్ళలేదు.ఒకరకంగా చెప్పాలంటే దేశం మొత్తం మీద అప్పటికి అంత పలుకుబడి ఉన్న ముగ్గురు..
హిందీలో అమితాబ్..
తమిళంలో రజనీకాంత్..
తెలుగులో చిరంజీవి..!
వీరిలో అమితాబ్ కాంగ్రెస్ లో చేరి ఎంపి పదవి నిర్వహించి కొన్ని నిందలు కూడా మోసి రాజాకీయాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకుని గౌరవంగా తప్పుకున్నారు. ఇక చిరంజీవి ఎన్టీఆర్ వలె ప్రకంపనలు సృష్టిస్తారని భావించినా దారుణంగా విఫలం కావడం సినిమా నటులకే చెంపపెట్టు అయింది..రజనీకాంత్ దక్షిణాది మొత్తంలో అంతులేని క్రేజ్ ఉన్నా గాని ముందే సైడైపోయారు.
హిందీ నుంచి ఇంకా రాజేశ్ ఖన్నా..వినోద్ ఖన్నా.. జయబాధురి..శతృఘ్నసిన్హా, రాజ్ బబ్బర్..ఇలా ఒక పెద్ద ఊరేగింపే జాతీయ రాజకీయాల్లోకి సాగినా ఎవ్వరూ కూడా ప్రత్యేక ముద్ర వేసింది లేదు. అలాగే తమిళనాడు నుంచి కమల్ హాసన్..శరత్ కుమార్..విజయకాంత్.. విశాల్..అంతకు ముందు తరంలో చో రామస్వామి.. ఎం ఆర్ రాధ..కర్ణాటక నుంచి అంబరీష్ తో పాటు కొందరు…టాలీవుడ్ నుంచి మోహన్ బాబు.. మురళీమోహన్.. కృష్ణంరాజు..శివాజీ..మొత్తంగా భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి కోకొల్లలుగా రాజకీయ ప్రవేశం చేసినా కం అండ్ గో.. బ్యాచ్ గానే మిగిలిపోయారు.
మన తెలుగు చిత్రసీమ నుంచి అన్న చిరంజీవి విఫలమైనా, తమ్ముడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి 2019లో చెయ్యి కాల్చుకున్నా గాని పక్కకి తప్పుకోకుండా మరో పోరాటానికి సిద్ధ పడుతున్నారు.వచ్చే ఎన్నికలలో కూడా ఆయనేదో అద్భుతం సాధిస్తారనే సీన్ లేకపోయినప్పటికీ నిర్ణాయక శక్తిగా ఉంటారనేది మాత్రం పక్కా..!
ఇదీ కొందరి సినిమా రాజకీయ సమ్మేళనయాత్రా విశేషం..పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు బిజెపి మరింత మంది నటులను తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది..వీటి ప్రభావం పెద్దగా ఉండదని తెలుస్తున్నా కథ కొంత ఆసక్తికరంగా ఉండబోతోందని పరిశీలకుల విశ్లేషణ..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286