Suryaa.co.in

Features

రెండు దశాబ్దాలు.. బద్ధలైన నిశ్శబ్దం..!

ఒక పీడకల..
ఇప్పటికీ ఒళ్ళు
గగుర్పొడిచే విధ్వంసం..
మానవాళి
మునుపెన్నడూ చూడని
భయానక వాస్తవం..
ఆధునిక ప్రపంచంలో
అతి దారుణ తీవ్రవాదం..
ఆల్ ఖైదా ముష్కరుల రాక్షసానందం..
నిట్టనిలువునా కూలిన
జంట భవనాల సముదాయం
గుండెలవిసేలా
విలపించిన
మానవ హృదయం!

ఇదే రోజున
న్యూయార్క్ నగర నడిబొడ్డున
జరిగిందా ఘాతుకం..
అప్పటి వరకు
స్టాట్యూ ఆఫ్ లిబర్టీలా
సగర్వంగా నిలబడిన
రెండు సౌధాలు..
చూస్తుండగానే
కుప్పకూలిన వైనం…
ఇప్పటికీ కనుల ముందు కదలాడే దృశ్యం..
భవంతుల్లోకి దూసుకెళ్లిన విమానాలు..
బిన్ లాడెన్
కర్కశ హస్తాల ఆయుధాలు..
కట్టెదుటే కుదేలైన ఆకాశహర్మ్యాలు..
లిప్తకాలంలో
శవాలతో నిండిన స్మశానాలై..
శాపనార్థాలై..అనర్థాలై..
మానవతకే పెడర్థాలై!

అంతకు పదేళ్ల మునుపు మనిషే బాంబుగా ముస్తాబై..
శాంతి కాముకతను పరిహసించే
వికృత జవాబై
రాజీవుని నిర్దాక్షిణ్యంగా బలిగొంటే తీవ్రవాదానికి
ఇది కొత్త పుంత..
ఎల్టీటీఇ కనిపెట్టిన
వింత అంటూ
విస్తుపోయింది జగతి..
అంతకు మించిన కర్కోటం.. మృత్యుదేవత కోలాటం..
గగనాల ఎగిరే విమానాలు
భవనాల్లోకి దూసుకుపోతుంటే
ప్రత్యక్షంగా చూస్తూ జనం..
నివ్వెరపోయె జగం..!

గుట్టలుగా మృతదేహాలు..
ఉనికిపైనే సందేహాలు..
అగ్రరాజ్యంపై ఉగ్రదృష్టి..
పురాణాల నాటి రక్కసుల ముష్కర కాండకు పునఃసృష్టి..
లాడెన్ పధకరచనతో హడ్సన్ నదీప్రాంతంలో
రుధిరవృష్టి…!

అయితే..కలవరపడినా అమెరికా..
కోలుకుంది చకాచకా..
ఓ వైపు
ఆర్ధికపునర్నిర్మాణం
మరోవైపు లాడెన్ నిర్యాణం..
ఈ రెండూ లక్ష్యాలుగా అలుపెరుగని రణం..
గెలిచిన తీరు జగతికే గర్వకారణం..!

అక్కడ..ఇక్కడ..
ఎక్కడ జరిగినా..
ఇలాంటి విధ్వంసం..
పరిమార్చేందుకు కలవాలి చేయి చేయి..
కావాలి దుర్మార్గంపై
మంచిదే పైచేయి!
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల కూల్చివేత జరిగి ఇరవై ఒక్క సంవత్సరాలు..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE