ఆయన జీవితమే వాయు”లీనం”..!

సప్తస్వరాలు పలికించే సంగీతంలో
ద్వారం నాయుడు వాయులీనమై..
స్వరాలలో తాను లీనమై..
సంగీత ప్రపంచంలో
తాను నిరంతరం వినిపించే గేయమై..లయమై..
తన హృదయమే సంగీతాలయమై..!

సరిగమల అనుపానులు
తెలియని లేత ప్రాయంలోనే
ఆ మధురిమలు ఆస్వాదించి..
వేలికొసలతో
మధుర స్వరాలు
పలికించిన మేధావి..
ఒకనాటికి
సంగీత ప్రపంచంలో
వెలిగిపోయిన రవి..
ఆనందభైరవి..!

నాయుడు వచ్చే వరకు
వాయులీనం పక్కవాయిద్యమే..
ఆ శ్రష్ట ఆగమనంతో
అదయింది శ్రేష్ట..
సంగీతానికి పరాకాష్ట..
ఆయనే చేసారు
వయొలిన్ను సోలో..
ఆయన చేతి వాయులీనానికి
ఎన్ని సొగసులో..
ఆయనతో ఎన్నెన్ని ఉసులో!

సంగీతమంటే
వినిపించే తపస్సు..
ఇది నాయుడి మాట..
ఆయన అనుసరించిన బాట
అందుకే ఆయన మది
అయింది రాగాల తోట..
ఒక్క రోజు సాధన మానేస్తే
నీ తప్పులు నీకు తెలుస్తాయి..
రెండ్రోజులు మానేస్తే
ఆ తప్పులు
శ్రోతలకూ తెలిసేను..
అది నాయుడి సీను..
అలాగే విరాజిల్లింది
ఆయన కమాను..
ఉత్కృష్ట విన్యాసాలకు కొలమాను..!