రూ.20,000 కోట్ల సమీకరణకు అదానీ మెగా ఎఫ్‌పీఓ

60

దిల్లీ: మలి విడత పబ్లిక్‌ ఇష్యూ (FPO-ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) శుక్రవారం ప్రకటించింది.దీనికి కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా షేర్‌హోల్డర్ల ఆమోదం కూడా కోరనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ ఎఫ్‌పీఓ కార్యరూపం దాలిస్తే దేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఎఫ్‌పీఓగా రికార్డు సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2020లో యెస్‌ బ్యాంక్‌ సమీకరించిన రూ.15,000 కోట్లే ఇప్పటి వరకు అతిపెద్ద ఎఫ్‌పీఓగా ఉంది. ప్రస్తుతం ఏఈఎల్‌లో ప్రమోటర్ల వాటా 72.63 శాతం. మిగిలిన 27.37 శాతం వాటాల్లో 20 శాతం వరకు బీమా కంపెనీలు, విదేశీ మదుపర్ల వద్ద ఉన్నాయి. ఇలా వాటాలు కొంతమంది వద్దే కేంద్రీకృతమై ఉండటం వల్ల విమర్శలు వస్తున్నాయని ఇటీవల సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. ఎఫ్‌పీఓ ద్వారా రిటైల్‌ మదుపర్ల వాటా పెరగనుంది. తద్వారా ఆ అపవాదును తొలగించుకునే యోచనలో ఏఈఎల్‌ ఉందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

1988లో కమొడిటీ ట్రేడింగ్‌గా ప్రారంభమైన ఏఈఎల్‌ క్రమంగా అనేక రంగాల్లోకి విస్తరించింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు, విద్యుదుత్పత్తి, స్వచ్ఛ ఇంధనం, విద్యుత్తు సరఫరా, ఎఫ్‌ఎంసీజీ, స్థిరాస్తి, ఆర్థిక సేవలు తాజాగా మీడియా రంగంలోకీ ప్రవేశించింది. వీటిలో నౌకాశ్రయాలు, విద్యుదుత్పత్తి, విద్యుత్తు పంపిణీ, గ్రీన్‌ ఎనర్జీ, గ్యాస్‌, వంటనూనెల వ్యాపారాలు ప్రత్యేక నమోదిత కంపెనీలుగా కొనసాగుతున్నాయి.