ఈ తీర్పు ఏ సిరాతో..!?

భగవద్గీత
పట్టుకుని చెప్పేది
నిజమా..నీ నైజమా..
కోర్టులో నువ్వు పలికేది
సాక్ష్యం కాదు..
నీ అంతరంగ ఆవిష్కరణ..
నీ అంతఃకరణ..త్రికరణ..
నీ బుద్ధి…చిత్తశుద్ధి..!

అక్కడ గీత
ఓ పుస్తకం కాదు..
నీ సంస్కృతి..
నీ జాతికి ఆకృతి..
నీ ప్రకృతి..
నీ ప్రతి కృతి..
నీ దేశానికి శ్రుతి..
నీ జీవితానికి నీతి..
నీ ధర్మనిరతి..
నీ వ్యక్తిత్వ రీతి..!

దేవుని ఎదుట ప్రమాణం చేసి
అంతా నిజమే చెప్తాను..
అబద్ధం చెప్పను..
ఈ మాటలు చెప్పేటపుడు
నీ చేయి గీతపై..
చూపు ఓ నల్లకోటుపై..
వాస్తవం ఏదైనా గాని అసలేం చెప్పాలో ముందే
నీకు తర్ఫీదు
అదే చెప్పక నీకు తప్పదు…
ఇచ్చేసావు వకాల్తా..
ఇక వాస్తవం బోల్తా..!

వ్యవహారంలో ధనం
ఉండదేమో అంతర్మథనం..
నువ్వు చెప్పేది
నిజమో కాదో
నీకు తెలుసు ..
వినే న్యాయమూర్తికీ తెలుసు..
యదార్థం అక్కడ బ్రహ్మపదార్థం..
నిజమేదైనా కావలసింది ఆధారం..
సప్తశత శ్లోకాలను
నిక్షిప్తం చేసుకున్న గీత
మార్చలేదు కోర్టులో రాత..
అక్షరసత్యాలు..
ఆణిముత్యాలను
ఉటంకించే ఆ ఉద్గ్రంధం
కోర్టులో నిజం చెప్పలేదు..
దానికి నోరు లేదు..
అక్కడ కొలువైన ధర్మదేవతకు
కళ్ళు లేవు..
ఆమె చేతిలో త్రాసు
సత్యాసత్యాల నిగ్గు తేల్చలేని మైకంలో
వేస్తోంది తూకం..
గీతలో పార్థాయ ప్రతిబోధితాం..
కోర్టులో న్యాయ్యదేవత
కబోధినాం..
నోరు జారే ప్రమాణం..
కాలు జారే ప్రయాణం..
ఆ సాక్ష్యాన్ని నమ్మి
ఇచ్చే తీర్పు
ఏ సిరాతో..
మారేది ఎవరి తలరాతో..!?

ఇ.సురేష్ కుమార్
9948546286