Suryaa.co.in

Editorial

సిస్కో.. ఇప్పాల.. ఒక లోకేష్!

  • లోకేష్‌ను కలిసిన జగనాభిమాని ఇప్పాల రవీందర్‌రెడ్డి

  • సిస్కో బృందంలో కీలక సభ్యుడిగా వచ్చిన ఇప్పాల

  • ఆ విషయం తెలియని లోకేష్

  • గతంలో లోకేష్, బాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇప్పాల

  • వారి వ్యక్తిగత జీవితంపై బురదచల్లిన వైనం

  • కమ్మవారిపైనా బురదచల్లిన ఇప్పాల

  • ఇప్పుడు ఇప్పాల లోకేష్ దగర్గ ప్రత్యక్షం కావడంపై లొల్లి

  • సోషల్‌మీడియాలో విరుచుకుపడిన పసుపు సైన్యం

  • దానితో దిద్దుబాటుకు దిగిన లోకేష్ ఆఫీసు

  • సిస్కో ప్రాజెక్టు నుంచి ఇప్పాలను తప్పించాలని కంపెనీకి లోకేష్ ఓఎస్డీ మెయిల్

  • లోకేష్, బాబు, గంటాపై నాటి ఉప్పాల పోస్టులను మళ్లీ వైరల్ చేస్తున్న పసుపు దళాలు

  • ఉదయం ఉధృతమై సాయంత్రానికి సర్దుకున్న ఉప్పాల సెగ

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు కంటే.. మంత్రి, యువనేత లోకేష్ అపాయింట్‌మెంట్ చాలాకష్టం. ఎందుకంటే పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేది ఆయనే కాబట్టి. పైగా టీడీపీకి ఉత్తరాధికారి కూడా! మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, సీనియర్ జర్నలిస్టులు. ఇలా ఎవరైనా ఆయన అపాయింట్‌మెంట్ కోసం, నెలల తరబడి వేచిచూడాల్సిందే. అదే బాబు గారయితే.. వెళ్లే సమయంలోనో, వచ్చే సమయంలోనో కలసే ‘దర్మదర్శనాని’కి వీలుంటుంది. అక్కడే నిలబడి మాట్లాడి, వీలైతే ఒక ఫొటో తీసుకుని పోవాలి. అప్పట్లో మాదిరిగా కూర్చుని నింపాదిగా మాట్లాడే రోజులు పోయాయి.

కానీ లోకేష్ అపాయింట్‌మెంట్ సిస్టమ్ భిన్నంగా, కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. అపాయింట్‌మెంట్ తీసుకున్న వారి కారు నెంబరు తీసుకుంటారు. పది నిమిషాల ముందే ఎక్కడున్నారని వాకబుచేస్తారు. వచ్చిన తర్వాత కాఫీ, బిస్కట్లు ఇచ్చి సకల మర్యాదలు చేస్తారు. సమయపాలనలో లోకేష్‌కు మంచిపేరు. తండ్రిగా ఎక్కువసేపు వెయిటింగ్ చేయించకుండా, వచ్చిన వారు సూటు వేసుకున్నారా? లేక మామూలు డ్రస్సు వేసుకున్నారా అని చూడరు. అపాయింట్‌మెంట్ అంటే అపాయింట్‌మెంటే. ఠంచనుగా ఇచ్చిన సమయానికి వచ్చే లోకేష్ కూడా..చక్కగా అన్ని విషయాలూ మాట్లాడి, విజిటింగ్ కార్డు ఒకటిచ్చి ఫొటోలు దిగుతారు. ఇదీ.. బాబు అండ్ లోకేష్ అపాయింట్‌మెంట్ వ్యవస్థ కథా కమామిషు!

మరి అంత ఆచితూచి అపాయింట్‌మెంట్ ఇచ్చే లోకేష్- ఆయన ఆఫీసు.. జగనాభిమాని, అదే లోకేష్- బాబు- గంటా శ్రీనివాస్- కమ్మకులంపై ఇష్టారీతిన, వ్యక్తిత్వహసనం చేసిన ఇప్పాల రవీందర్‌రెడ్డి అనే వైసీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టుకు అపాయింట్‌మెంట్ ఎలా ఇచ్చారు? అతగాడున్న బృందంతో కలసి ఫొటో ఎలా దిగారు? పార్టీ కోసం రాళ్లెత్తిన కార్యకర్త కూలీలు, నాయకులకు ఇవ్వని అపాయింట్‌మెంట్.. తనను అత్యంత దారుణంగా తిట్టిపోసిన ఇప్పాలకు ఎలా ఇచ్చారు? అంటే మీరూ మీరూ ఒకటేనా? మేమేనా పనికిమాలిన వాళ్లం? ఇదేం బలిపశువుల రాజకీయం?.. ఇదీ ఉదయం నుంచి సోషల్‌మీడియాలో లోకేష్-ఇప్పాల ఫొటోలపై పసుపుసైనికుల అక్షర గర్జన.

అయితే అసలేం జరిగింది..? ఎవరీ ఇప్పాల రవీందర్‌రెడ్డి? ఇతగాడు లోకేష్‌ను ఎందుకు కలిశాడు? ఎలా కలిశాడు? దానిపై పసుపు సైనికులు ఎందుకు పళ్లు నూరుతున్నారు? ఆ తర్వాత ఎలా సర్దుకున్నారో ఓసారి చూద్దాం.

సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం-సిస్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సందర్భంగా సహజంగానే మంత్రి-కంపెనీ ప్రతినిధులు ఒక ఫొటో దిగుతారు. దానిని పీఆర్‌ఓ మీడియాకు విడుదల చేస్తారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరిగింది. అంతవరకూ బాగానే ఉంది.

కానీ లోకేష్‌ను కలిలిన సిస్కో ప్రతినిధి బృందంలో మాజీ సీఎం జగన్ వీరాభిమాని, వైసీపీ సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే ఇప్పాల ర వీందర్‌రెడ్డి అనే జగనాభిమాని ఉండటం, పసుపు సైనికులకు ఎక్కడో మండేందుకు కారణమయింది. ఇంకేముంది? గతంలో బాబు-లోకేష్-గంటా వ్యక్తిగత జీవితాలపై బురదచల్లతూ ఇదే ఇప్పాల పెట్టిన పోస్టులను, సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.

పార్టీ కోసం పనిచేసే వారికి ఇవ్వని అపాయింట్‌మెంట్లు పార్టీని తిట్టిన వాడికి ఎలా ఇస్తారు? చివరకు మీరూ మీరూ ఒకటే.. ఊళ్లలో రోడ్లమీద పార్టీ కోసం వేరే పార్టీవాళ్లతో కొట్టుకుని చచ్చే మేమే పిచ్చోళ్లమా? ఇదేం రాజకీయం? మీకు వాళ్లే ముఖ్యమా? అని తమ్ముళ్లు అగ్గిరాముళ్లయ్యారు. ఈ వీరావేశం అంతా సోషల్‌మీడియాలో సాయంత్రం వరకూ విజయవంతంగా నడిచింది.

జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన లోకేష్ ఆఫీసు దిద్దుబాటుకు దిగింది. సదరు ఇప్పాల రవీందర్‌రెడ్డిని సిస్కో ఏపీ వ్యవహారాల నుంచి తప్పించాలని కోరుతూ, ఆగమేఘాలపై లోకేష్ ఓఎస్డీ చైతన్య పేరుతో మెయిల్ వెళ్లింది. అతనిని ప్రతినిధి బృందంలో చేర్చినందుకు నిరనన వ్యక్తం చేసింది. ఈలోగా అసలు ప్రతినిధి బృందంలో సదరు ఇప్పాల పేరు లేనేలేదని, మరి ఎవరి ప్రమేయంతో అతగాడు లోకేష్‌ను కలిశాడన్న మరో చర్చకు తెరలేచింది.

అయితే ఇక్కడ తెలుసుకోవలసిన అంశం ఒకటి ఉంది. సహజంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లే క్రమంలో.. వన్ ప్లస్ ఫైవ్ అనో, వన్ ప్లస్ త్రీ అనో చెప్పి అనుమతిస్తారు. అంటే ఎవరైతే ముఖ్య వ్యక్తి ఉంటారో అతని పేరు, కారు నెంబరు మాత్రమే అందులో ఉంటుంది. మిగిలిన వారి పేర్లు సహజంగా ఎవరూ అడగరు. వారంతా ఆ ముఖ్యమైన వ్యక్తి వెనుక వెళతారు. ఇది సహజంగా జరిగే అపాయింట్‌మెంట్ ప్రక్రియ.

సిస్కో ప్రతినిధి బృందంలో వచ్చిన ఇప్పాలదీ సరిగ్గా అదే పద్ధతి. ఆయనేమీ లోకేష్ దగ్గర సింగిల్‌గా అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే, అందుకు లోకేష్ నిస్సందేహంగా విమర్శలకు అర్హులయ్యేవారు. కానీ ఇప్పాల వచ్చింది సిస్కో ప్రతినిధి బృందం సభ్యుడిగా మాత్రమే. కాబట్టి తన వ్యక్తిగత జీవితంపై మరక వేసేలా పోస్టులు పెట్టిన ఆ ఇప్పాల ఎవరో.. లోకేష్‌కు ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం లేదు. నిజంగా తెలిస్తే ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారా? అన్న వాదన మరో పసుపు దళాలది.

సాయంత్రానికి ఈ వాదన బాగా బలంలో పార్టీ వర్గాల్లోకి వెళ్లింది. ఫలితంగా.. అవును కదా? తనను తిట్టిన ఆ ఇష్పాలనే, ఈ ఇప్పాల అని ఆ క్షణంలో తెలిసినా.. లోకేష్ ఉగ్రరూపం దాల్చేవాడు కదా? కాబట్టి.. తనకు సంబంధం లేని వ్యవహారాన్ని ఆయనకు ముడిపెట్టి, లోకేష్‌ను విమర్శించడం భావ్యం కాదు కదా అన్న నిర్ణయానికి వచ్చారు. దానితో పసుపు సైనికుల ఆగ్రహాగ్ని సాయంత్రం తర్వాత చల్లారింది. అయితే చివరకు.. మరి ఆ ఇప్పాల అప్పుడు పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసులు పెట్టవచ్చు కదా అన్న మరో ప్రశ్నను తెరపైకి తెచ్చారు. ఇదండీ.. సిస్కో..ఇప్పాల.. ఒక లోకేష్ కథ!

Subject: Concern Regarding Coordination of Andhra Pradesh Projects
Dear [CISCO Leadership Team],
We sincerely appreciate the partnership between CISCO and the Government of Andhra Pradesh, and we look forward to working together on transformative initiatives for the state’s development. The MoU signed today marks an important step in this collaboration, and we remain committed to ensuring its success.
However, we would like to bring to your attention a concern regarding Mr. Ravindra Reddy Ippala, Territory Sales Manager, Public Sector Business, who coordinated today’s meeting. While we respect personal political affiliations, Mr. Ippala’s public statements on social media (attached for reference) reveal a pattern of demeaning language and character attacks against our leadership and party. His views and expressions go beyond political alignment and raise concerns about his ability to maintain neutrality and professionalism while engaging in projects related to the state.
Given the nature of our collaboration and the need for an unbiased and constructive working relationship, we request that Mr. Ippala be kept away from all CISCO-led projects in Andhra Pradesh. We believe this step will help foster a more conducive and professional environment for our partnership.
We appreciate your understanding and look forward to your positive response.
Best regards,
Vinayaka Sai Chaitanya
OSD to Minister of ITE&C and RTG
Government of Andhra Pradesh

LEAVE A RESPONSE