- కేంద్రంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి అంగీకారం
- 4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి స్ట్రామ్ వాటర్ నిధులను అధిక భాగం కేటాయించేలా చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై నగర పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలం చర్చించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళామని అన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎల్ ఐసీ కాలనీలో నెల్సన్ మండేలా పార్కు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ సమస్యతో పాటుగా స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎస్ఐసీ కాలనీ, క్రీస్తురాజపురం పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే వర్షం నీరు నిల్వ ఉంటున్నాయని చెప్పారు. రోడ్లపై వర్షం నీరు నిల్వ ఉండకుండా తమ ప్రభుత్వ హయాంలో స్ట్రామ్ వాటర్ నిధులను కేంద్రం నుంచి తెచ్చి పనులు చేపట్టామన్నారు. నగర పరిధిలో చాలా వరకు పనులను కూడా ప్రారంభించామన్నారు. 2019వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో స్ట్రామ్ వాటర్ నిధులను ఆ పనులకు ఉపయోగించకుండా ప్రక్కకు మళ్ళీంచారన్నారు. దీనివల్ల స్ట్రామ్ వాటర్ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని అన్నారు.
అందువల్లనే ఇప్పుడు కొద్దిగా వర్షం పడినా నీరు రోడ్లపై చేరుతుందని అన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి పక్కా ప్రణాళికతో ఎంపీ కేశినేని శివనాథ్ సహాకారంతో కేంద్రంతో మాట్లాడి స్ట్రామ్వటర్ నిధులను అధిక భాగం కేటాయించుకుని నగరంలోని పనులు మళ్ళీ ప్రారంభిస్తామని అన్నారు. నగర పరిధిలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చించామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళామని ఆయన కూడా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.
స్థానికంగా ఉన్న నెల్సన్ మండేలా పార్కులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అందువల్ల స్థానికంగా ఉంటున్న యువత కూడా ఈ పార్కులో జరుగుతున్న కార్యక్రమాలపై నిఘా పెట్టి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పారు. పార్కు ఆవరణలో ఉన్న వోవర్హెడ్ ట్యాంక్ వాచ్మెన్ కూడా కేవలం ట్యాంక్కే పరిమితం కాకుండా పార్కు ఆవరణలో జరుగుతున్న పరిణామాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. కార్పోరేషన్ అధికారులు, పోలీసులను కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదేశించారు.
డాక్టర్ వసుంధర మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పార్కులో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తీసుకువచ్చి ఇక్కడ సేవించి పార్కు ఆవరణలో పడవేస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న వాచ్మెన్లను కూడా యువకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న వారందరూ ఐక్యంగా ఉంటేనే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని అన్నారు. కాలనీలో నాటిన మొక్కలను స్థానికంగా ఉంటున్న వారు పరిరక్షించాలన్నారు.
కార్పోరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ డివిజన్లోని పార్కుల పరిస్థితిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించారన్నారు. పార్కులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. కొంచెం వర్షానికే రహదారులు జలమయంగా మారుతున్నాయన్నారు. కార్పోరేషన్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పాలకపక్షం అసమర్థత వల్లనే ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.