ఠీవిగా బోధించిన రోజులు పోయి..
టి.వీలో బోధించే రోజులు వచ్చాయి..
నల్లబల్ల కాస్తా పచ్చబల్లగా మారింది..
అది కూడా మున్నాళ్ల ముచ్చటే అయ్యింది..
సమతల తాకే తెర గోడమీదకెక్కింది..
అంతవరకు అక్కడున్న నల్లబల్ల గోడు వెళ్లబోసుకుంది..
అంతర్జాల మాయాజాలం…మకుటం లేని మహారాజు అయ్యింది..
మన మెదడును (బై) జ్యూస్ చేసుకుని తాగింది..
ఇప్పడు వంగుని సుద్దముక్క తీయనక్కరలేదు..
పొడుగాటి పిల్లాడిని పిలిచి బోర్డ్ తుడవ మనక్కరలేదు..
నోట్స్ అంతా బోర్డ్ మీద రాయనక్కరలేదు..
బొమ్మలన్నీ వేయనక్కరలేదు..
పిరుడు పిరుడుకి చేతులు కడగనక్కర లేదు..
ఇప్పుడు ఉపాధ్యాయులంతా విద్యార్థులైపోయారు..
తాకేతెరను గూర్చి తెలుసుకోడానికి తలమునకలయ్యారు..
దీర్ఘదర్శులు దూసుకెళ్లిపోతున్నారు..
ప్రాప్తకాలజ్ఞులు పాకులాడుతున్నారు..
మందమతులు మతులు పోగొట్టుకుoటున్నారు..
కొంతమంది ఎందుకొచ్చిన గోలని గగ్గోలు పెడుతున్నారు..
నేర్చుకున్న జ్ఞానాన్ని కాదని గూగులమ్మని వేడుకుంటున్నారు..
ఆధునికతను అందిపుచ్చుకోలేని వారు ఆందోళన చెందుతున్నారు..
ఈ వయసులో మేము కూడా నేర్చుకోవాలా అని అమాయకంగా అడుగుతున్నారు..
కొంత కాలానికి గురువు కూడా తెరమరుగు అవుతాడేమో అని భయపడుతున్నారు
ఇదీ నేటి ఉపాధ్యాయుల పరిస్థితి
– వేణు. ఎస్