– విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం!!
– చదువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీధిన పడుతున్న కుటుంబాలు!!!
రాష్ట్రంలో దేశంలో విద్య ఒక పెట్టుబడి లేని వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే మిగిలిన గొర్రేలన్నీ అదే బావిలో దూకి చచ్చినట్లు ..విద్యార్థులు వారి తల్లిదండ్రులు … వీరిలో చదువుకున్న వారు సైతం ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఊబిలో కూరుకు పోతున్నారు .కొంత అయినా బుర్రపెట్టి ఆలోచించకుండా.. కార్పొరేట్ విద్యాసంస్థల పబ్లిసిటీ పిచ్చిలో పడి అదే గొప్ప అనుకొని లక్షలాది రూపాయల డబ్బులు పోగొట్టుకొని… తమ పిల్లల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు అధికంగా ఈ జాబితాలో ఉంటున్నారు. ఇక వీరిని చూసి ఏమీ తెలియని చిన్న, మధ్య తరగతి కుటుంబాలు …విద్య అనే సంపద కోసం తాము సంపాదించిన ఖరీదైన భూములను ఇళ్లను వస్తువులను ఖర్చు చేసి అది చాలకపోతే అప్పు చేసి సంసారాలు గుల్ల చేసుకుంటున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల మాయ మాటలు నమ్మి విద్యార్థులు ఎందుకు ఉపయోగపడని వారుగా తయారవుతున్నా… తల్లిదండ్రులలో ఏం మార్పు కనిపించడం లేదు. ఇక కార్పొరేట్ సంస్థల పథకం కింది విధంగా ఉంటుంది…
జనవరి నుంచి మే నెల దాక కార్పొరేట్ విద్యా సంస్థలకు బయట విద్యార్థులపై అమిత ప్రేమ కనిపిస్తుంది. కరోనా కాలంలో తమ సొంత టీచర్లను జాబ్ నుంచి తీసేసి , వారు కాయగూరలు అమ్ముకునేలా, కూలి పనులు చేసుకునేలా చేస్తున్నారు. సగంమంది టీచర్ లను మాత్రం డ్యూటీ లో ఉంచి, వారికి కూడా సగం జీతాలు ఇచ్చి… పంతుళ్ళ పొట్టలు కొట్టిన కార్పొరేట్ విద్యా సంస్థలు…. కోట్లాది రూపాయలు ఎలా ఆడ్ చేస్తున్నాయో ఒక్కసారి గమనించండి.
లక్షలాది రూపాయల పబ్లిసిటీకి ఖర్చు చేసి మాయ మచ్చింద్ర ప్రకటనలతో… స్కాలర్షిప్ టెస్ట్ లు నిర్వహిస్తారు ? ఈ టెస్ట్లో పాస్ అయితే మీ పిల్లలకు ఫ్రీ సీట్లు పేపర్లలో టివిలలో ఊదర కొడతారు… పబ్లిసిటీ మోజులో విద్యార్థులు వారి తల్లిదండ్రులు వలలో చిక్కిన చేప పిల్ల లా కార్పొరేట్ గాలానికి చిక్కుకుంటారు.. ఈ మోసం గురించి ఎవరు కూడా ఒక్కసారి కూడా ఆలోచించరు?
వారి నాటకం ఇలా సాగుతుంది….!
“రండి ! కార్పొరేట్ స్కూల్ నిర్వహించే స్కాలర్షిప్ టెస్ట్ మీ పిల్లలచేత రాయించండి …ఇందులో పాస్ అయితే మీకు ఫ్రీగా ఉచిత భోజన వసతి సదుపాయాలతో సీటు ఇస్తామంటూ ముందుగా ప్రకటిస్తారు..
గతంలో తమ కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలతో… వీలైతే ఓ మంత్రితో నో… ఓ ఉన్నతాధికారి తోనో దిగిన విద్యార్థుల ఫోటోలను కటౌట్లను వాడవాడలా వెలిసేలా చూస్తారు… ఇక అప్పుడు అందమైన స్కూల్ బ్రోచర్లు బుక్ లెట్ లను చేతిలో పట్టుకున్న అపర మేధావులు…సారీ… పదవతరగతి కూడా పాస్ కానీ కార్పొరేట్ స్కూల్లో రిప్రజెంటేటివ్లు.
అదేనండి చక్కగా ముస్తాబైన కార్పొరేట్ రంగ స్కూల్ ల ప్రతినిధులు రంగప్రవేశం చేస్తారు…
పత్రికల్లో టీవీల్లో ప్రకటించిన విధంగా తమ కార్పొరేట్ స్కూల్లో ఆదివారం సెలవు రోజున మెరిట్ టెస్ట్, ఉచిత స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నామని పాంప్లెట్ పంచుతూ యుద్ధభూమిలో వీర సైనికుల వలే…విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్యంగా యుద్ధం ప్రారంభిస్తారు.
మెరిట్ విద్యార్థుల పై అంత ప్రేమ ఉంటే తమ సంస్థలో ఇది వరకే చదువుతున్న విద్యార్థులకు ఆ పురస్కారాలు ఇవ్వొచ్చు కదా ?
కానీ వారి లక్ష్యం అది కాదు సాధారణ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులను వారి ఇంటికి వెళ్లి మరి అన్నీ ఉచితంగా ఇప్పిస్తామంటూ చేర్చుకుంటారు. ఆ విద్యార్థి ప్రతిభను తమ ప్రతిభ అని మళ్లీ పత్రికా ప్రకటనలు ఇస్తారు. ఈ ప్రతిభ గల విద్యార్థి భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్ యొక్క బంగారుబాతు లాంటివారు. ఎందుకంటే వారికి సహజంగా వచ్చిన చక్కని తెలివి తేటలను ఉపయోగించుకునీ వారు ర్యాంకులు సాధిస్తే …అవి తామే సాధించినట్లుగా ప్రచారానికి ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
ఇదిలా ఉంటే మెరిట్ టెస్ట్ల కథ ఇలా ప్రారంభిస్తారు
ఆయన ఒక ఉద్యోగి . తన కొడుకు ఒక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు . చక్కగా మాట్లాడగలడు . మంచి మార్కులు వస్తున్నాయి . వారి అబ్బాయి చదివే స్కూల్ చక్కటి విద్యనందిస్తోంది. ఓ రోజు పత్రికలో వచ్చిన ఈ మెరిట్ టెస్ట్లో పాస్ అయితే అంతా ఫ్రీ అనే ప్రకటన చూసాడు .
“అబ్బే .. ఇందులో ఏదో మోసం వుంది” అనుకొన్నాడు . కార్పొరేట్ సంస్థలపై తనకు పెద్దగా నమ్మకం లేదు.
కానీ ఉచితం అనే ప్రకటన అతని ఆలోచనలను తప్పుదోవ పట్టించింది.. ఒక ఆదివారం తన కొడుకును తీసుకొని వెళ్లి టెస్ట్ రాయిస్తే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా ? టెస్ట్ కోసం ఫీజు కూడా లేదు . ఒక టెస్ట్ రాసిన ప్రాక్టీస్ వస్తుంది . అన్నిటికి మించి తన కుమారుడి స్టాండర్డ్ ఏంటో అర్థం అవుతుంది అనుకొన్నాడు .
టెస్ట్ కు అప్లై చేసాడు . టెస్ట్ రాసే రోజు వచ్చింది
టెస్ట్ రాసి అబ్బాయి బయటకు వచ్చాడు .” ఏరా! ఎలా రాసావు ?” అడిగాడు తండ్రి . ఏమో డాడీ! . అన్ని కస్టమైన ప్రశ్నలు వచ్చాయి . నాకు తెలిసింది రాసాను ” చెప్పాడు అబ్బాయి.. సరేలే” అన్నాడు తండ్రి . ఆ విషయాన్ని అంతటితో మరచి పోయాడు .
వారం దాటక ముందే అబ్బాయి రాసిన టెస్ట్ రిజల్ట్ చేతికి వచ్చింది . అందులో తన కుమారుడు నూటికి నలబై మార్కులు సాధించాడు . తన కాళ్ళ కింద భూమి గిర్రున తిరిగినట్టు అయ్యింది .
” ఇదేంటి ? వీడికి, వీడి స్కూల్ లో ఎప్పుడు నూటికి 99 , లేదా కనీసం 95 మార్క్లు వచ్చేవి ఇప్పుడు ఇన్ని తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి అబ్బా అని ఆలోచనలో పడ్డాడు తండ్రి . గతంలో అబ్బాయి చదివిన స్కూల్ టీచర్లు ..సర్ మీ అబ్బాయి చక్కగా చదువుతాడు అంటూ కితాబు ఇచ్చారు కదా అని మరోమారు ఆలోచనలో పడ్డాడు . ఇక్కడేమో నూటికి మరీ దారుణంగా నలబై మార్కులే వచ్చాయి ఏమిటి అని ??” ఆందోళన పడసాగాడు .
అప్పుడే ఆ కార్పొరేట్ విద్యా సంస్థ రిజల్ట్ డేట్ అర్ ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది . ” సర్ .. చూసారా “.. మీ అబ్బాయి మార్కులు ? ఏదో సాదా సీదా స్కూల్ లో చదివిస్తే అలాగే ఉంటుంది సర్. అక్కడ బుక్ లో ఉన్నదే చెబుతారు . ఐఐటీ ఎంట్రన్సు అలాగుండదు . చాలా లోతైన ప్రశ్నలు అడుగుతారు . మా స్కూల్ లో ఐఐటీ స్థాయి లో చెబుతాము . మీ అబ్బాయి అక్కడే చదివితే పరిస్థితి ఇలాగే ఉంటుంది . రోజురోజుకు దిగజారిపోతోంది . ఐఐటీ స్థాయి చదువు కావాలంటే, రేసులో మీ అబ్బాయి వెనకబడి పోకుండా ఉండాలంటే మా స్కూల్ లో చేర్పించండి … అని వల విసురుతారు వారు..
మీరు తెలిసినవారు… చదువుకున్నవారు… ఆలోచించండి… మీ అబ్బాయికి మేము ఫీజు రాయితీ ఇస్తాం …మీ అబ్బాయి తో పాటు మీ బంధువులను మరికొంతమందినీ చేర్పిస్తే మీ అబ్బాయికి సగం రాయితీ తోనే చదువు చెప్తాం …అని మాయ మాటలు చెబుతారు.
మా సంవత్సరం ఫీజు రెండు లక్షలు . మీ అబ్బాయి నలభై శాతం మార్కులు సాధించాడు కాబట్టి నలబై శాతం ఫీజు డిస్కౌంట్ ఇస్తున్నాము . అంటే కేవలం లక్ష ఇరవై వేలు కడితే చాలు . ఎనభై వేలు అదా . ఈ ఆఫర్ ఈ రోజు రేపు మాత్రమే . చెప్పండి సర్… సీట్ రిజర్వు చేసెయ్యమంటారా ?”అని నమ్మబలుకుతారు అందమైన తీయనైన మాటలు మాట్లాడే కార్పొరేట్ స్కూల్ ప్రతినిధి.
తండ్రి ఆలోచనలో పడ్డాడు …. పిల్లల చదువుకంటే మించింది ఏమి వుంది ? ఏదో స్కూల్ బాగుంది కదా అని లోకల్ స్కూల్లో చేర్పిస్తే ఇక్కడ మా వాడు వెనుకబడిపోతున్నాడు . ఆమ్మో .. ఇది కీలక సమయం . తప్పటడుగు వేస్తె వాడి జీవితం పాడైపోతుంది”అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
” సర్ .. నేను వస్తున్నాను .. మా వాడికి సీట్ కావాలి . దయచేసి డిస్కౌంట్ కొంచం పెంచండి ” అంటూ తనకు కాల్ వచ్చిన నెంబర్ వ్యక్తికి తిరిగి కాల్ చేసాడు . సరే మీరు రండి సార్ చూద్దాం అన్నాడు కాల్ చేసిన వ్యక్తి.
బాబు తో తండ్రి కార్పొరేట్ స్కూలుకు వెళ్ళాడు.
.” డాడీ” .. మా స్కూల్ బాగుంది … నేను అక్కడే చదువుకుంటాను . ఇక్కడ వద్దు “అని అబ్బాయి” ఏడుస్తున్నాడు . తండ్రి దాన్ని పట్టించుకోలేదు .
“సర్ “చూసారు కదా …. మా వాడు అక్కడే చదుతాడంట …చెప్పాడు తండ్రి .
“మీ ఇష్టం సర్.. అయినా పిల్లలకు ఏమి తెలుసు సర్ .
సర్ .. మీ కోసం ఇంకో పది వేలు తగ్గిస్తున్నాము . అంటే మీకు తొంబై వేలు ఆదా. పైగా స్టార్ బ్యాచ్ లో సీట్ ఇస్తున్నా0. ఈ బ్యాచ్ లో చదివిన వారందరూ ఐఐటీ లో సీట్ కొట్టి ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా, కెనడా, బ్రిటన్లో స్థిరపడ్డారు …
కానీ ఈ ఆఫర్ ఈ రోజే సర్… నేను కస్టపడి మా డీన్ ను ఒప్పించాను . నూటికి నలబై మార్కులు కూడా రాలేదు . వాడికి సీట్ ఇవ్వడమే వేస్ట్ . పైగా ఫీజు డిస్కౌంట్ కూడానా ?” అన్నారు డీన్ .
నేను కస్టపడి ఒప్పించాను సర్ అన్నాడు కార్పొరేట్ విద్యా సంస్థ ప్రతినిధి .
“సరే .. సర్.. ! సీటు రిజర్వు చేయండి అన్నాడు తండ్రి… థాంక్యూ వెరీ మచ్ . ” అని ఫీజు కూడా కట్టేసాడు
కార్పొరేట్ స్కూల్ ఆఫీస్ లో .. డీన్ ఛాంబర్ లో….
” సర్ .. నలబై మార్కులు స్కోర్ చేసి మనం పెట్టిన టెస్ట్ లో స్టేట్ ఫస్ట్ రాంక్ సాధించాడు కదా అబ్బాయి .
ఆ అబ్బాయి ఫాదర్ వచ్చి ఇందాకే ఫీజు పే చేసి వెళ్ళాడు “అన్నాడు కార్పొరేట్ ప్రతినిధి.
“ఓహ్ గ్రేట్ జాబ్ సర్.. వాడు చురుకయిన కుర్రాడు . మనం ఎక్కడెక్కడో డిగ్రీ స్థాయి ప్రశ్నలు తెచ్చి ఐదో తరగతి కి స్కాలర్షిప్ టెస్ట్ పెడితే , వాడు నలబై స్కోర్ చేసాడంటే నిజం గా గ్రేట్ .
ఇదే టెస్ట్ మన కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు పెడితే కనీసం రెండు మార్కు లు కూడా రావు … అన్నాడు డీన్..
మన బాస్ ప్లానింగ్ అదిరిపోలా ? ముందుగా పేరెంట్ కాంఫిడెన్స్ ను దెబ్బ కొట్టాలి . తమ పిల్లలు చదువుతున్న పాఠశాల దేనికీ పనికి రాదని మార్కుల ద్వారా వారికి చూపాలి .
ఇదీ ప్లాన్ …. ప్రతినిధితో అన్నాడు డీన్
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి …. ఆ స్కూల్ లో నిజంగా మంచి స్టాండర్డ్ ఉందయ్యో. మెరికలాంటి కుర్రాళ్లు వున్నారు అని మెచ్చుకున్నాడు కార్పొరేట్ స్కూల్ డీన్. ”
“అవును సర్ ! మొన్న మన బ్రాంచ్ కి చెందిన నలుగురు టీచర్ లు…
ఆ పాఠశాలలో టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వూస్ కు వెళితే ఒకడు కూడా సెలెక్ట్ కాలేదు . అంటే వారిది ఎంత స్టాండర్డ్ స్కూలో అర్థం చేసుకోండి “సమాధానమిచ్చాడు కార్పొరేట్ ప్రతినిధి.
“నలుగురు వెళ్ళారా ? ఎందుకు ?” డీన్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు .
మనం పెట్టే అడ్మిషన్ ప్రెషర్ సర్.. అడ్మిషన్స్ తెస్తేనే మీకు జీతం అంటూ టీచర్లను వేధించడంతో, వారు ఉద్యోగాలు మానుకున్నారు అని చెప్పాడు కార్పొరేట్ అడ్మిషన్ల ప్రతినిధి .
దాంతో వారు లోకల్ పాఠశాలలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వెళ్ళారు అని మరోమారు సమాధానమిచ్చాడు కార్పొరేట్ స్కూళ్ళ అడ్మిషన్ల ప్రతినిధి..
మనలో మాట..
ఇదేమి బతుకు సర్ ! నా పై నాకే అసహ్యం వేస్తుంది . కాకపోతే పొట్టకూటి కోసం నేను కూడా ఇలా అలా అబద్ధాలు చెబుతూ నెట్టుకు వస్తున్నాను అన్నాడు కార్పొరేటర్ స్కూల్ ప్రతినిధి.
ఇప్పుడు చూడండి . ఆ అబ్బాయి, వేలమంది రాసిన మన స్కాలర్షిప్ టెస్ట్ లో నలబై మార్కు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచాడు . అదీ వాడి స్థాయి . వాడు చదువుతున్న స్కూల్ స్థాయి మన కార్పొరేట్ స్కూల్ కంటే గొప్పది అన్నాడు ప్రతినిధి .
కానీ నేనేమి చేశాను ? నా పొట్టకూటికోసం అబద్దం చెప్పాను. అబ్బాయి ఫాదర్ బ్రెయిన్ వాష్ చేశాను … మీ అబ్బాయి తక్కువ మార్కులు స్కోర్ చేసాడు అన్నాను ఒకింత పశ్చాత్తాప పడ్డాడు ప్రతినిధి.
అసలు ఆ టెస్ట్ రాస్తే మన స్కూల్ లోని టీచర్ లకు కూడా ముప్పై మార్కులు రావు . ఖర్మ సర్ .. అన్నాడు ప్రతినిధి.
నేను మంచి రెసిడెన్షియల్ స్కూల్ లో చదివి వచ్చాను సర్… ఇక్కడ మన ఇంగ్లీష్ టీచర్ ” మ్యా డం ” ( Myaa Ddum ) అంటూ ఉంటే నాకు డొకొస్తుంది సర్..
ఇంగ్లీష్ టీచర్ ఒక వాక్యం సరిగా ఇంగ్లీష్ లో మాట్లాడలేరు .
ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్ లను తిప్పి అడిగితే ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ ను వివరించలేరు .
మనం … ఐఐటీ అని చెప్పి బతుకుతున్నాము అంటూ ఆవేదన చెందాడు ప్రతినిధి.
పాపం సర్.. పిల్లల భవిష్యత్తును దెబ్బ తీస్తున్నాము . ఇన్ని అబద్దాలు చెప్పి ఫీజు లక్ష అయితే దాన్ని రెండు లక్షలు అని చెప్పి, ముందుగా నలబై శాతం డిస్కౌంట్ అని, అడ్మిషన్ కంఫర్మ్ చేసేటప్పుడు మరో పది వేలు డిస్కౌంట్ ఇచ్చి ..లక్ష పది వేలు వసూలు చేసి… లక్ష స్కూల్ కు కడితే నాకు పదివేలు వస్తాయి అన్నాడు .
అయిదు మందిని మోసం చేస్తే యాబై వేలు . ఇలా ఎందుకు చేస్తున్నాము అనిపిస్తుంది ?
ఖర్మ సర్ .. నాకు కూడా అవకాశం వస్తే నేను కూడా ఒక మంచి స్కూల్ లో టీచర్ గా చేరిపోతాను సర్ “ఈ మోసాలు పాపాలు ఇక చేయడం నావల్ల కావడం లేదు సార్ అన్నాడు ప్రతినిధి…
వెంటనే డీన్ కల్పించుకుని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు వలే ఇదంతా సర్వసాధారణం అయ్యా!! అంటూ ఓ నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు.
ఇది అంతులేని వింత కథ ! వేలమంది పిల్లల బాల్యం బలైపోతున్న నిజ జీవిత వ్యథ ! తల్లిదండ్రులారా ఆలోచించండి!
సేకరణ- రంగనాయకులు