– పోలీసు శాఖ నిద్రపోతుంది
– పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా?
– సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా?
– కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో డీజీపీ విఫలం
– 19వ తేదీన ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదు
– టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు సీరియస్
అమరావతి: పోలీసు శాఖను హైకోర్టు తలంటింది. పోలీసుల పనితీరును తూర్పారపట్టిన హైకోర్టు పోలీసు శాఖను మూసేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తన ఆదేశాలు ఎందుకు పాటించలేదని నిలదీసింది.
పోలీసు శాఖ ను మూసివేయడం మేలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని..పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తిరుపతి పరకామణి కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖ పనితీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రికార్డులు సీజ్ చేయమని సెప్టెంబర్ 19వ తేదీన ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆ ఆధారాలను తారుమారు చేసేందుకు వీలుగా తప్పు చేసిన వారికి పోలీసులు సహకరించారని ఆరోపించింది. పోలీసు శాఖ చర్యలే ఈ కేసులో ఎంత నిజాయితీగా వ్యవహరించాయో చెబుతున్నాయని ఎద్దేవా చేసింది. రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని, సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
పరకామణిలో అక్రమాలపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా? అని నిలదీసింది. నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయమని డీజీపీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేవారని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన రికార్డులను సీజ్ చేయడంలో డీజీపీ విఫలం అయ్యారని ఫైర్ అయింది.