అశోక్ కుమార్ (1911- 2001) జయంతి
అశోక్ కుమార్ ప్రముఖ భారతదేశ చలనచిత్ర నటుడు. అసలు పేరు కుముద్లాల్ గంగూలీ. తెర పేరు అశోక్ కుమార్.
అశోక్ కుమార్ భారత దేశ సినిమా తొలి సూపర్ స్టార్. మోతీలాల్ మనదేశ సినిమాలో తొలి సహజ నటుడు. మోతీలాల్ తరువాత అశోక్ కుమార్ తన నాణ్యమైన సహజ నటనతో సూపర్ స్టార్ అయ్యారు.
అమెరికా దేశ, అంతర్జాతీయ ఉన్నత నటుడు Paul Muni. ఆ Paul Muniతో పోలుస్తూ భారతదేశ Paul Muni అని అశోక్ కుమార్ను అనేవారు.
అభినయం, వాచికం ఆంగికం మూడిట్లోనూ అశోక్ కుమార్ ప్రశస్తం. చాల గొప్ప నటుడు అశోక్ కుమార్. దేశ సినిమా తొలిదశలోనే సరైన, మేలైన నటనను ఆపోసన పట్టారు అశోక్ కుమార్.
Method Acting పద్ధతిని, రష ( Russia, రష్య కాదు) దేశపు నాటక దర్శకుడు, నటుడు స్టేనిస్లేఫ్స్కీ (Stanislavsky 1863-1938) సూత్రీకరించారు. అది 1930ల నాటికి హాలివుడ్ కు చేరింది. 1947కు పుంజుకుంది. Montgomery Clift, James Dean, Marlon Brando అమేరిక సినిమాలో మెతడ్ ఆక్టింగ్ త్రిమూర్తులు. వీళ్లకు ముందే Paul Muni ఉన్నత స్థాయి సహజ నటనను ప్రదర్శించారు. Paul Muni కాలానికి Method Acting అన్న సూత్రీకరణ లేదు. అశోక్ కుమార్ నిస్సందేహంగా ఆ అంతర్జాతీయ స్థాయి నటుడే.
1936లో వచ్చిన జీవన్ నైయా హిందీ సినిమాతో అశోక్ కుమార్ నటుడు అయ్యారు. 1936లోనే అచ్యుత్ కన్యా సినిమాతో నటుడిగా గుర్తింపును పొందారు. 1943లో వచ్చిన కిస్మత్ సినిమా పెనువిజయంతో (దేశంలో కోటి రూపాయలు వసూళ్లు రాబట్టిన తొలి సినిమా ఇది) అశోక్ కుమార్ దేశ సూపర్ స్టార్ అయ్యారు.
1960 తరువాత కథానాయకుడు పాత్రల నుంచి ఇతర పాత్రలను ధరిస్తూ సుదీర్ఘ నటనా జీవితంలో సాగారు. పలు పాత్రలు ధరించారు. ధరించిన ప్రతి పాత్రకూ న్యాయం చేశారు.
ప్రతి గొప్ప నటుడూ సరిగ్గా చెయ్యని, చెడగొట్టిన, తప్పుగా చేసిన పాత్రలు, సినిమాలు ఉన్నాయి; ఉంటాయి. కానీ అశోక్ కుమార్ తన పూర్తి నటనా జీవితంలో సరిగ్గా చెయ్యని సందర్భం లేదు!
అంత మొహమ్మద్ రఫీ కూడా అటూ ఇటూ పాడిన పాటలు ఉన్నాయి. కానీ మన్నాడే, లతా మంగేష్కర్ సరిగ్గా పాడని పాటలు లేవు. అలా అశోక్ కుమార్ పాడు చేసిన సీన్, షాట్ లేవు.
దేశంలోని మహోన్నత నటుడు అశోక్ కుమార్ పలు పురస్కారాలతో పాటు 1988లో దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.
అశోక్ కుమార్ తెలుగు మా భూమి సినిమాలో నటించారు. మన మహా నటుడు ఎస్.వీ. రంగారావు మీద కొంత అశోక్ కుమార్ ప్రభావం ఉందని అనిపిస్తూంటుంది. (ఎస్.వీ. రంగారావు వీద జంధ్యాల గౌరీనాథశాస్త్రి ప్రభావం కూడా ఉంటుంది) వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ మన దేశంలో మంచి, గొప్ప, మేలైన, ప్రశస్తమైన నటులు కావాలనుకునే ఎవరికైనా ఆదర్శం అశోక్ కుమార్.
– రోచిష్మాన్
9444012279