– జోగి సూత్రధారి.. నేను పాత్రధారినే
– ఆయన ఆదేశాల మేరకే నకిలీ మద్యం తయారు చేశా
– ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కుట్ర
– జోగి రమేశే సొంత మనుషులతో లీక్ చేయించారు
– నన్ను జోగి రమేష్ మోసం చేశారు
– నకిలీ మద్యం కేసులో ముద్దాయి జనార్దన్‌రావు వీడియో హల్చల్
– జోగి రమేష్ చుట్టూ బిగిసుకుంటున్న నకిలీ మద్యం ఉచ్చు
అమరావతి: నకిలీ మద్యం తయారీ వ్యవహారం వెనుక ఉన్నది మాజీ మంత్రి జోగి రమేశేనని, ఆయన ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన నిందితుడు జనార్దన్ రావు ఒక వీడియోలో వెల్లడించారు. ఇప్పుడు జనార్దన్‌రావు వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది.
కూటమి సర్కారును అప్రతిష్ఠ పాలు చేసే లక్ష్యంతోనే, జోగి ఈ కుట్ర పన్నారని జనార్దన్ కుండబద్దలు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినప్పటికీ, ప్రభుత్వం మారడంతో ఆపేశామని.. అయితే, టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు జోగి రమేశ్ తమను మళ్లీ ప్రోత్సహించారని జనార్దన్ రావు పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా తనను ఆఫ్రికాలోని తన మిత్రుడి వద్దకు పంపించారని వెల్లడించారు. జోగి రమేశ్ తనను మోసం చేశారని జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
“ముందుగా ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేశాం. కానీ, చంద్రబాబుపై బురద జల్లాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సరైన ప్రదేశమని జోగి రమేశ్ చెప్పారు. ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తన మనుషులతోనే జోగి రమేశ్ లీక్ ఇచ్చారు. రైడ్‌కు ముందురోజు ఇబ్రహీంపట్నంలో సరుకు పెట్టించి, ఆ తర్వాత సాక్షి మీడియాకు సమాచారం ఇచ్చి రైడ్ చేయించారు. అనుకున్నట్లే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా జోగి రమేశే “నని జనార్దన్ రావు ఆరోపించారు.
ఆఫ్రికా నుంచి రావొద్దని, బెయిల్ తానే ఇప్పిస్తానని నమ్మబలికారు. కానీ చివరకు హ్యాండ్ ఇచ్చి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని నా సోదరుడిని కూడా ఇరికించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ, నన్ను మోసం చేయడంతోనే బయటకు వచ్చి నిజాలు చెబుతున్నాను అని జనార్దన్ రావు వీడియోలో వెల్లడించారు.
ఇక జోగి వంతు?
నకిలీ మద్యం కేసులో సిట్ వేసిన నేపథ్యంలో.. కీలక నిందితుడు జనార్దన్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం చార్జిషీట్లో జోగి రమేష్ పేరు లేకపోయినప్పటికీ, అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు కోర్టుకు సమర్పించుకునే అవకాశాలున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం కూడా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా, టీడీపీ అగ్రనేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. నకిలీ కేసులో కూడా అదే పద్ధతి పాటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ధైర్యం ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి:జోగి రమేష్
ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎవరో ఒకరిని ఇరికించడానికే ఈ కుట్ర జరుగుతోందని, నకిలీ మద్యం తయారీకి ఆంధ్రప్రదేశ్ ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. తాను, జనార్దనరావు తాత ఒకే వీధిలో ఉంటామని, జనార్దనరావు పిల్లలను బెదిరించి అతడితో తనపై ఆరోపణలు చేయించారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం తన చేతిలో ఉన్న సిట్‌తో విచారణ జరిపిస్తూ, కావాలనే ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకుని తిరుమల రావాలని, నేను కూడా వచ్చి ప్రమాణం చేస్తా. లేకపోతే, విజయవాడ కనకదుర్గ గుడికైనా రావాలని జోగి రమేష్ సవాల్ విసిరారు.