– బాలకృష్ణ సమక్షంలో హిందూపురం తమ్ముళ్ల ఆందోళన
– ప్లకార్డులతో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు
– వారిని చూసి నవ్వుకుంటూ వెళ్లిన బాలయ్య
– పార్టీ గెలుపులో బాలయ్య పాత్ర అపూర్వం
– పదవి ఇవ్వకపోతే హిందూపురం ప్రజలు నిరాశ పడతారు
– హిందూపురం ఇన్చార్జి రాజగోపాల్
హిందూపురం: టీడీపీ అగ్రనేత, రాష్ట్రంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ.. ఆయన సమక్షంలోనే హటాత్తుగా తెరపైకి వచ్చిన అభిమానుల డిమాండ్, హాట్‌టాపిక్‌గా మారింది. పైగా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన సమక్షంలో ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేయడం..దానిని వారించకుండా, తన అభిమానుల నినాదాలు విన్న బాలయ్య.. చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోవడం చర్చనీయాంశమయింది.
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం బాలకృష్ణ హిందూపురం పర్యటనకు రాగా, ఆయన కాన్వాయ్‌ను వద్దే అభిమానులు ఈ మేరకు బాలకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న డిమాండ్ తో ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం బాలకృష్ణ ఎంతో కృషి చేశారని, పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన సేవలను గుర్తించాలని కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తన కాన్వాయ్ ఎదుట ప్లకార్డులతో ఆందోళన తెలుపుతున్న అభిమానులను చూసిన బాలకృష్ణ, వారి డిమాండ్లను విని నవ్వుతూ వెళ్లిపో వడం సోషల్‌మీడియాలో చర్చనీయాంశమయింది.
మంత్రి పదవి ఇస్తే తప్పేంటి: రాజగోపాల్
గత ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనానికి బాలకృష్ణ కూడా ఒక ప్రధాన కార ణమని, అలాంటి నేతకు మంత్ర పదవి ఇస్తే తప్పేమిటని హిందూపురం ఇన్చార్జి రాజగోపాల్ ప్రశ్నించారు. ‘బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలన్నది నియోజకవర్గమే కాదు. రాష్ట్ర ప్రజల కోరిక. గత ఎన్నికల్లో ఆయన పాత్ర అనిర్వచనీయం. బాలయ్యలాంటి సీనియర్ నేతకు, మంత్రి పదవి ఇవ్వకపోతే మా ప్రజలు నిరాశ చెందుతున్నారు. టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన బాలయ్యకు మంత్రి పదవి ఇచ్చి ప్రజల మనోభావాలు గౌరవించండి’ అని కోరారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, మంత్రి పదవి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.