Suryaa.co.in

Telangana

ధాన్యం కొనడం చేత కాకుంటే దిగిపోండి

– టీఆర్ఎస్ సర్కార్ పై సీఎల్పీ నేత భట్టి ఫైర్
-టీఆర్ఎస్ కు చేత కాకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ధాన్యం కొంటుంది.
– ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి
– ప్రకటన రాకుంటే రైతులను ఏకం చేసి ఉద్యమం తీవ్రతరం చేస్తాం
– తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా?
– కేంద్రం చూపించే వివక్షత జాతి విచ్ఛిన్నానికి విఘాతం
– భట్టి పాదయాత్రకు సిపిఎం, తెలుగుదేశం, ఎన్ఆర్ఐ సంఘీభావం

రాష్ట్రంలో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం చేతకాదని చేతులెత్తేసి ధర్నాలు చేయడం సరికాదని, పరిపాలన చేయడం చేత కాకుంటే దిగిపోవాలని టిఆర్ఎస్ సర్కార్ పై భట్టి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 18వ రోజు బోనకల్ మండలం గార్లపాడు, లక్ష్మీపురం, గోవిందాపురం, పెద్ద బీరవల్లి, జానకీపురం గ్రామాల్లో పీపుల్స్ మార్చ్ కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనడం టీఆర్ఎస్ కు చేతకాదని దిగిపోతే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సమర్థవంతమైన పరిపాలన చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొనుగోలు చేయకపోవడం వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అంతర్భాగం అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోవద్దని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శించే వివక్షత వల్ల జాతి సమైక్యతకు విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. కేంద్రం చూపించే వివక్ష జాతి విచ్ఛిన్నానికి దారి తీసే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్రం ధాన్యం కొంటదా? లేదా? తర్వాత తేల్చుకోవాలని, రైతులను ఆందోళనకు గురి చేయకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని కోరారు.

ఇప్పటికే నకిలీ విత్తనాలతో సరైన దిగుబడి రాక ఆందోళన చెందుతున్న రైతాంగానికి మద్దతు ధర కూడా కరువై, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. రైతులు మానసిక స్థైర్యం కోల్పోయిన తర్వాత జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటన చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏకంచేసి రైతు ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమస్ఫూర్తితో వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతామని తెలిపారు. నవభారత నిర్మాత ప్రధాని నెహ్రూ అనేక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా నిర్మించారని వివరించారు. వాటి ద్వారా పారే నీటితో పండించిన ధాన్యంతో గత 75 సంవత్సరాలుగా దేశంలో ఆకలి చావులు లేకుండా ఉన్న విషయాన్ని ఇప్పటి పాలకులు మర్చిపోవద్దని సూచించారు.

తినటానికి తిండి లేక ఆకలి చావులతో అలమటించచిన దేశంలో ఇప్పుడు ఆహారధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే కారణమన్నారు. పంటలు పండించడం రైతుల హక్కు అని, రైతులు పండించిన పంటలను కొనాల్సి బాధ్యత సర్కారుదని స్పష్టం చేశారు. కొనుగోలు బాధ్యతలు విస్మరించి రాజకీయ అవసరాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు.

రేషన్ ఇవ్వడం ఎట్లా బంద్ చేస్తారు
వృద్ధుల చేతివేళ్ళపై ఉన్న గీతలు అరిగిపోయి బయోమెట్రిక్ లో చూపించుకుంటే రేషన్ బియ్యం ఇవ్వడం ఎలా బందు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనకల్లు మండలం లక్ష్మీపురంలో చాలామంది వృద్ధులు మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు గోడు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యను సావధానంగా ఆలకించిన సీఎల్పీ నేత సంబంధిత అధికారులకు ఫోన్ చేసి క్లాస్ ఇచ్చారు. బయోమెట్రిక్ లో వాళ్ల వేలిముద్రలు పడుకుంటే ప్రత్యామ్నాయంగా బియ్యం పంపిణీ చేయాల్సిన విషయాన్ని విస్మరించి బందు చేయడం తగదన్నారు. వెంటనే గ్రామంలో ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వయోవృద్ధులకు రేషన్ బియ్యం ప్రతినెల పంపిణీ చేసేందుకు ప్రత్యేక అధికారిని కేటాయించాలని ఆదేశించారు.

భట్టి పాదయాత్రకు సిపిఐఎం, తెలుగుదేశం, ఎన్ఆర్ఐ సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మంగళవారం బోనకల్లు మండలం లక్ష్మీపురంలో సిపిఐఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్ఆర్ఐ ఇరుగు మధు ఉ స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నందమూరి సత్యనారాయణ మండల అధ్యక్షుడు సత్యనారాయణ జిల్లా కార్యదర్శి మాచినేని రవి గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ సిపిఐ ఎం జిల్లా నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ గుట్టూరి ఉమ, గ్రామ శాఖ కార్యదర్శి గుట్టూరి వెంకన్న, నాగేశ్వరరావు, కృష్ణారావు, పన్నీరు వెంకటేశ్వరరావు, పత్తి రాధాకృష్ణ,ఇరుగు శ్రీమతిల ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు వెల్ కమ్ చెప్పారు. సీఎల్పీ నేత విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ పాదయాత్రలో కదం తొక్కారు.

మొక్కజొన్న రైతుల సమస్యలు తెలుసుకున్న విక్రమార్క
బోనకల్లు మండలం గార్లపాడు నుంచి లక్ష్మీపురంకు పాదయాత్ర వస్తుండగా మార్గమధ్యంలో మొక్కజొన్న రైతులు హార్వెస్టర్ సహాయంతో మిల్లింగ్ చేస్తుండగా అక్కడికి వెళ్లి రైతుల సమస్యలను సీఎల్పీ నేత భట్టి
bhatti-pada1 విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న కు ఉన్న మద్దతు ధర, పెట్టుబడి, దిగుబడి వివరాలను తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుటెండ లో పనిచేస్తున్న తమకు కూలి గిట్టుబాటు కావడం లేదని పలువురు వాపోయారు.

మరికొందరు తమకు ఉండడానికి ఇల్లు లేదని, ఇంకొందరు రేషన్ కార్డు ఇవ్వడం లేదని, పింఛన్ రాకపోవడంతో నే వృద్ధాప్యంలో కూడా ఎండలో పని చేయడానికి వచ్చానని లక్ష్మి తన ఆవేదనను వెల్లడించింది. మీ అందరి సమస్యలను పరిష్కరించాలనే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా తనపైన ఉండటంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నానని భట్టి వివరించారు.

పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారానికి ప్రజల గొంతుక అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రగతి భవన్ గేటు బద్దలు కొడదామన్నారు. అదేవిధంగా బోనకల్ మేజర్ కాలువ కలకోట మైనర్ కాలువ తీరుతెన్నులను పరిశీలించారు.

LEAVE A RESPONSE