– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సందర్భంగా ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే ఓటర్లను తొలగించారని, ఒకే పేరుతో అనేక మంది ఓటర్లుగా నమోదు అయ్యారని, ఒకే ఇంటిలో 125 మందికి పైగా ఓటర్లుగా నమోదు అయ్యారని ప్రజాప్రతినిధులకు కూడా వివిధ పేర్లతో ఓటరు జాబితా రూపొందటం వంటి అంశాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నాయని, అక్రమాలు జరిగాయని రాజకీయ పార్టీలతో పాటు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఈ అంశంపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సమగ్రంగా రూపొందించి అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని రామకృష్ణ కోరారు.