ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఈ రాత్రి ఢిల్లీలో తన నివాసంలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఇప్పుడు మరోసారి సీఎం, పీఎం మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో మోదీతో జగన్ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్య, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సవరించిన అంచనాలకు ఆమోదం పైన ప్రధానికి వివరించనున్నారు. అలాగే, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని సీఎం కోరుతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు రాజకీయాలపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ-చంద్రబాబు పలకరించుకున్న తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ..బాబుకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై మోదీ, షాతో జగన్ క్లారిటీ కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ టూర్ లో భాగంగా ముఖ్యమంత్రి జగన్… నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. ఈ రెండు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులైన ముర్ము, ధన్ కర్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది.