-ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్
గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరం అని సీఎం స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామన్నారు. శాసనసభలో సభ్యుల మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో జాలి పడాల్సి వస్తుంది. ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే సరికాదు. తెలంగాణలోని సర్పంచ్‌లు దేశంలోనే అత్యంత గౌరవంగా బతుకుతున్నారు. గర్వంగా తల ఎత్తుకునే సర్పంచ్‌లు ఉన్నారంటే మన వాళ్లే. మన సర్పంచ్‌లను కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసించారు. కొన్ని సందర్భాల్లో ప్రధాని, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు పంచాయతీరాజ్ చట్టం గురించి వివరించడం జరిగింది.
ఎవరి గొంతు నొక్కడం లేదు..
ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్పగలుగుతాం. మన ఇద్దరి కన్న అద్భుతంగా ప్రజలు గమనిస్తారు. అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తమ గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించిపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లు బాధ పడ్డ మాట వాస్తవం. ఇవాళ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నారు. గర్వపడుతున్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులేమీ ఉండవు
కరోనా లాంటి ఇతర సందర్భాల్లో డబ్బులకు ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే శాసనసభ్యులు, మినిస్టర్ల జీతాలు ఆపమన్నాను. కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దని చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో ప్రతిపక్షాలకు తెలియదా? ఫైనాన్స్ ఆఫ్ కమిషన్ ఇండియా చెప్పిన ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుంది. ప్రత్యేకంగా కేంద్రం నుంచి వచ్చే నిధులేమి ఉండవు. ఇది వారి అవగాహనలోపం అని అన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నిధులు రావు. కొన్ని చోట్ల వనరులు ఉంటాయి. కొన్ని చోట్ల వనరులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అన్ని గ్రామపంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివర్గం ఆమోదం తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని సభ ముందుకు తెచ్చామన్నారు. నిధుల దారి మళ్లింపు అనేది సత్యదూరం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.